- కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ తీవ్ర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఎన్నికల సంస్కరణలపై పార్లమెంట్‌లో జరుగుతున్న చర్చ సందర్భంగా, కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ భారత ఎన్నికల సంఘం (ఈసీ)పై తీవ్ర విమర్శలు చేశారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) నిర్వహించడానికి ఈసీకి గల చట్టబద్ధత, నిష్పాక్షికతను ఆయన ప్రశ్నించారు.ఈ అంశంపై పార్లమెంట్‌లో ప్రసంగించిన తివారీ ఈసీకి సర్ నిర్వహించే చట్టపరమైన హక్కు లేదని వాదించారు.
దేశంలోని అనేక రాష్ట్రాలలో సర్ కొనసాగుతోంది, కానీ దానిని నిర్వహించడానికి ఎన్నికల సంఘానికి ఎలాంటి చట్టబద్ధత లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇంత మంది సభ్యులు ఇక్కడ ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై ప్రశ్నలు లేవనెత్తాల్సి వస్తుండటం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ఈసీ సభ్యుల ఎంపిక పద్ధతిని మార్చాలని ప్రతిపాదించారు. ఈసీ సభ్యుల ఎంపికకు సంబంధించిన చట్టాన్ని సవరించాలని సూచించారు. కొత్త ఎంపిక కమిటీలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)లను కూడా చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
- ప్రతిపక్షం ఆరోపణలు
సర్ ప్రక్రియను ఉపయోగించి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిజమైన ఓటర్ల పేర్లను తొలగించడానికి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు చాలా నెలలుగా ఆరోపిస్తున్నాయి. ఎన్నికల సంస్కరణలు, సర్‌పై లోక్‌సభ, రాజ్యసభల్లో మొత్తం 10 గంటల పాటు చర్చకు సమయం కేటాయించబడింది.
- సర్ రెండవ దశ షెడ్యూల్
ఎన్నికల సంఘం సర్ రెండవ దశను 12 రాష్ట్రాలు/యూటీలలో నిర్వహిస్తోంది. నేడు (డిసెంబర్ 9) డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురిస్తుంది. డిసెంబర్ 9 నుంచి జనవరి 8, 2026 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరిస్తుంది. ఫిబ్రవరి 7, 2026 తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నది.
No comments:
Post a Comment