- 'ఉపాధి హామీ' పేరు మార్పుపై పార్లమెంట్‌లో విపక్షాల భారీ నిరసన!
- పేర్లు మార్చడంపైనే ప్రభుత్వం దృష్టి : ప్రియాంక
- గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకే ఈ మార్పులు: కేంద్రం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) - 2025' (VB-G RAM G) బిల్లు పార్లమెంట్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. దశాబ్దాలుగా ఉన్న 'మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం' (MGNREGA) పేరును మార్చడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
జాతిపిత మహాత్మా గాంధీ పేరును పథకం నుంచి తొలగించడం ఆయనను అవమానించడమేనని విపక్ష ఎంపీలు ఆరోపించారు. "గాంధీజీకి జరిగిన ఈ అవమానాన్ని భారత్ సహించదు" అంటూ నినాదాలు చేశారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం నుంచి మకర్ ద్వార్ వరకు ప్రతిపక్ష ఎంపీలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. చేతిలో గాంధీజీ చిత్రపటాలను పట్టుకుని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
ప్రియాంక గాంధీ విమర్శలు
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ.. కేవలం పేర్లు మార్చడంపైనే ప్రభుత్వం దృష్టి పెడుతోందని, పేదలకు ఉపాధి కల్పించే హక్కును ఈ కొత్త బిల్లు నీరుగారుస్తోందని విమర్శించారు. ఈ బిల్లును పార్లమెంటరీ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకే ఈ మార్పులు చేస్తున్నామని, పనిదినాలను 100 నుండి 125 రోజులకు పెంచామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు.
ఈ అంశంపై లోక్‌సభలో చర్చ ఇంకా కొనసాగుతోంది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటి ప్రధాన విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి.
No comments:
Post a Comment