- విపక్షాలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శలు
అయోధ్య: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్ష పార్టీలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. గతంలో కొంతమంది వ్యక్తులు తమ స్వార్థం, బుజ్జగింపు రాజకీయాల కోసం పవిత్ర అయోధ్య నగరాన్ని అశాంతికి, ఘర్షణలకు నిలయంగా మార్చారని ఆయన ఆరోపించారు. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ రెండో వార్షికోత్సవం , 'ప్రతిష్ఠ ద్వాదశి' వేడుకల సందర్భంగా బుధవారం అయోధ్యలో జరిగిన బహిరంగ సభలో సీఎం యోగి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రామజన్మభూమి ఆలయ నిర్మాణం, ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీని ఆయన కొనియాడారు. అయోధ్య చరిత్రలో ఆగస్టు 5, 2020 (శంకుస్థాపన), జనవరి 22, 2024 (ప్రాణ ప్రతిష్ఠ), నవంబర్ 25 (శిఖరంపై జెండా ఆవిష్కరణ) సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టాలని పేర్కొన్నారు.
విపక్షాలపై విమర్శలు
"అయోధ్య అంటే యుద్ధం లేని చోటు అని అర్థం. కానీ కొందరు మతపిచ్చి, ఓటు బ్యాంకు రాజకీయాలతో ఇక్కడ అలజడి సృష్టించారు. ఇప్పుడు ఆ అడ్డంకులన్నీ తొలగిపోయి అయోధ్య వైభవం ప్రపంచానికి చాటిచెప్పబడుతోంది" అని యోగి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు. రామజన్మభూమి ఉద్యమంలో రాజ్‌నాథ్ సింగ్ కీలక పాత్ర పోషించారని, 500 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆలయ రూపురేఖలను చూసి ఆయన భావోద్వేగానికి లోనయ్యారని సీఎం తెలిపారు. ప్రాణ ప్రతిష్ఠ రెండో వార్షికోత్సవం సందర్భంగా రామ మందిరంలో యజ్ఞ యాగాదులు, తత్వ హోమం, రామ తారక మంత్ర హోమం వంటి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. 2024 జనవరి 22న ప్రధాని మోడీ చేతుల మీదుగా రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరిగిన సంగతి తెలిసిందే. నేటితో ఆ అపూర్వ ఘట్టం జరిగి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా అయోధ్య నగరం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది.
No comments:
Post a Comment