రవీంద్రభారతి ప్రాంగణంలో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్‌బాబు, భాజపా తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. 7.2 అడుగుల బాలు కాంస్య విగ్రహాన్ని తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా తయారు చేయించారు. విగ్రహావిష్కరణలో భాగంగా రవీంద్ర భారతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బాలసుబ్రహ్మణ్యంకు ఇష్టమైన 20 పాటలతో ఇవాళ సాయంత్రం 50 మందితో సంగీత విభావరి కార్యక్రమం ఏర్పాటు చేశారు.
పరిపూర్ణ కళాకారుడిని గుర్తు చేసుకుంటున్నాం: వెంకయ్యనాయుడు
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్నేహశీలి, మృదుస్వభావి అని, ఇవాళ పరిపూర్ణ కళాకారుడిని గుర్తు చేసుకుంటున్నామని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వివిధ రంగాల్లో ప్రతిభ చూపించారని చెప్పారు. ‘‘ తెలుగు పాటకు ఘంటసాల, ఎస్పీ బాలు పట్టం కట్టారు. సినీ చరిత్రలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు చిరస్థాయిగా ఉంటుంది. ఎస్పీ గళం.. సంగీత దర్శకుడు ఏది కోరుకుంటుందో అది ఇచ్చే అక్షయపాత్ర. గళంలో వైవిద్యం చూపడం ఎస్పీ బాలు ప్రత్యేకత. ఆయన తెలుగు ఉచ్ఛారణ వింటుంటే ఎంతో ఆనందంగా ఉండేది. ఆయన హాస్యం, సమయస్ఫూర్తి అందర్నీ అలరించేది. ‘పాడుతా తీయగా’ కార్యక్రమం ద్వారా వందలమంది గాయకులను పరిచయం చేశారు’’ అని వెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నారు.
No comments:
Post a Comment