- బిలియన్ డాలర్ల ఎగుమతులపై ప్రభావం
- అమెరికాను బుజ్జగించేందుకే క్లాడియా ప్రభుత్వం చర్యలు
న్యూఢిల్లీ: దిగుమతి వస్తువులపై సుంకాలకు సంబంధించి అమెరికా బాటలోనే మెక్సికో వెళ్తున్నట్లు సమాచారం. తమ దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం లేని దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎంపిక చేసిన వస్తువులపై సుంకాలను భారీగా పెంచేందుకు మెక్సికో ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు అక్కడి సెనెట్ ఆమోదం తెలిపింది. చైనా, భారత్ సహా పలు ఆసియా దేశాలకు చెందిన సుమారు 1400 వస్తువులపై సుంకాలు 50శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయి. వచ్చే జనవరి 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. చైనా, భారత్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, ఇండోనేసియాతో సహా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం లేని ఇతర ఆసియా దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆటోమొబైల్స్, విడిభాగాలు, టెక్స్‌టైల్స్, దుస్తులు, ప్లాస్టిక్, స్టీలు తదితర వస్తువులపై దాదాపు సుంకాలు పెంచాలని మెక్సికో ప్రతిపాదించింది. వీటిని అక్కడి ఆర్థికమంత్రి సెప్టెంబర్‌లోనే ప్రవేశపెట్టారు. అయితే, చట్టసభలో అధికార మోరెనా పార్టీకి మెజార్టీ ఉన్నప్పటికీ అప్పుడు మద్దతు పొందలేకపోయింది. తాజాగా దీనికి గ్రీన్ సిగ్నల్ లభించడంపై అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ స్పందించారు.
దేశీయ ఉత్పత్తి పెంచడం, చైనాతో వాణిజ్య సమతుల్యత సమస్యను పరిష్కరించే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు క్లాడియా తెలిపారు. అయితే, అమెరికా-మెక్సికో-కెనడా వాణిజ్య ఒప్పందం తదుపరి సమీక్షకు ముందే ఈ చర్యలు తీసుకోవడం ఆసక్తిగా మారింది. మెక్సికోను ఉపయోగించుకొని చైనా బ్యాక్‌డోర్‌లో అమెరికా మార్కెట్‌లోకి ప్రవేశిస్తుందని ట్రంప్ యంత్రాంగం ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాను బుజ్జగించేందుకే క్లాడియా ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించిందని విశ్లేషకులు, ప్రైవేటు రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
అమెరికా బాటలోనే మెక్సికో
ఈ నిర్ణయం వల్ల ఏయే రంగాలపై ప్రభావం పడుతుందనే దానిపై ప్రస్తుతం భారత ప్రభుత్వం, పరిశ్రమ వర్గాలు సమీక్షిస్తున్నాయి. ఈ ఏకపక్ష సుంకాల పెంపు వల్ల ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు దెబ్బతింటాయని చైనా వంటి దేశాలు హెచ్చరించాయి. ట్రంప్ ప్రపంచ దేశాలపై సుంకాల పెంపుతో వాణిజ్య యుద్ధానికి తెర లేపిన అమెరికా బాటలోనే మెక్సికో కూడా వెళ్తున్నట్లు వాణిజ్య విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కాలంలో అమెరికా కూడా రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు చేసుకుంటున్నారనే కారణంతో భారత ఎగుమతులపై 50 శాతం సుంకాలు విధించింది.
No comments:
Post a Comment