'మన్ కీ బాత్'లో ప్రధాని మోదీ హర్షం
న్యూఢిల్లీ: 2025 సంవత్సరం భారతదేశం తన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పిన సంవత్సరమని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఆదివారం జరిగిన ఈ ఏడాది చివరి 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, దేశ భద్రత నుండి అంతరిక్షం వరకు, సంస్కృతి నుండి క్రీడల వరకు భారత్ సాధించిన మైలురాళ్లను గుర్తు చేసుకున్నారు.
2025 విజయాల ప్రస్థానం - ముఖ్యాంశాలు:
జాతీయ భద్రత & ఆపరేషన్ సిందూర్: దేశ భద్రత విషయంలో భారత్ ఎన్నటికీ రాజీ పడదని ప్రధాని స్పష్టం చేశారు. 'ఆపరేషన్ సిందూర్' ద్వారా భారత్ తన సత్తాను ప్రపంచానికి చాటిందని, ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
అంతరిక్షంలో అద్భుతం: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) చేరుకున్న తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన శుభాన్షు శుక్లాను ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు.
క్రీడా రంగంలో కేక: 2025 క్రీడల్లో చిరస్మరణీయమని, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని పురుషుల జట్టు, మొదటిసారి వన్డే ప్రపంచకప్‌ను మహిళల జట్టు కైవసం చేసుకోవడం చారిత్రాత్మకమని మోదీ అన్నారు. అంధుల మహిళా జట్టు సాధించిన విజయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
సాంస్కృతిక వైభవం & కుంభమేళా: ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పాల్గొన్న తీరు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందని, భారత్ విశ్వాసం మరియు వారసత్వానికి ఇది నిదర్శనమని చెప్పారు. అయోధ్య రామమందిరంలో ధ్వజారోహణ ప్రతి భారతీయుడిని గర్వంతో నింపిందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ 'నరసాపురం లేస్': ఏపీలోని నరసాపురం లేస్ ఉత్పత్తుల గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ కళకు జీఐ ట్యాగ్ లభించడంపై హర్షం వ్యక్తం చేస్తూ, లక్షలాది మంది మహిళలకు ఇది ఉపాధిని ఇస్తోందని కొనియాడారు.
2026 వైపు అడుగులు
"నూతన ఆశలు, సంకల్పాలతో మనం 2026లోకి అడుగు పెడుతున్నాం. యువశక్తే భారతదేశానికి అతిపెద్ద బలం. వికసిత్ భారత్ లక్ష్యంగా మనమంతా కలిసి సాగాలి" అని ప్రధాని పిలుపునిచ్చారు. జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా 'వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్' నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
No comments:
Post a Comment