- సీఎం, డిప్యూటీ సీఎంల మధ్య పోరుపై జగదీష్ శెట్టర్ సంచలన వ్యాఖ్యలు
బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య కొనసాగుతున్న అధికార పోరు త్వరలోనే ప్రభుత్వం పతనానికి దారితీస్తుందని బీజేపీ ఎంపీ, మాజీ సీఎం జగదీష్ శెట్టర్ జోస్యం చెప్పారు. శుక్రవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిందని ఆరోపించారు.
సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య విభేదాలు అత్యంత తీవ్రస్థాయికి చేరాయని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి నాంది అని శెట్టర్ పేర్కొన్నారు. ఈ ఇద్దరు నేతల మధ్య పోరు వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, అధికారులు ఎవరి మాట వినడం లేదని, అవినీతి పెచ్చరిల్లిందని ఆయన విమర్శించారు. ఉప ఎన్నికల ఫలితాలను గమనిస్తే ప్రజల మద్దతు క్రమంగా బీజేపీ వైపు మళ్లుతోందని, ఈ పరిణామాలు తమ పార్టీకి లాభం చేకూరుస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఆరోపిస్తూ, జోక్యం చేసుకోవాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఇప్పటికే లేఖ రాసినట్లు శెట్టర్ వెల్లడించారు.కర్ణాటకలో నాయకత్వ మార్పుపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో, సిద్ధరామయ్య మాత్రం తన పదవికి ఎలాంటి ముప్పు లేదని, అధిష్టానం నిర్ణయమే తుది నిర్ణయమని స్పష్టం చేస్తున్నారు.
No comments:
Post a Comment