- కోల్‌కతా స్టేడియంలో గందరగోళం
- ఉన్నతస్థాయి విచారణకు ఆదేశం
- అసంతృప్తి వ్యక్తం చేసిన అభిమానులు
కోల్‌కతా/న్యూఢిల్లీ: ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో కనిపించిన సందర్భంగా జరిగిన గందరగోళం పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై ఆమె ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించడంతో పాటు, అర్జెంటీనా దిగ్గజం మెస్సీకి, ఆయన అభిమానులకు, క్రీడాభిమానులకు హృదయపూర్వక క్షమాపణలు తెలిపారు.సరిగా నిర్వహణ లేకపోవడం,మెస్సీ వేదిక వద్ద కేవలం కొద్దిసేపు మాత్రమే కనిపించడంతో ఆగ్రహించిన అభిమానులు స్టేడియంలోని కొన్ని భాగాలను ధ్వంసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ముఖ్యమంత్రి ఈ విధంగా స్పందించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నివారించడానికి బాధ్యతను నిర్ధారించడానికి, సరైన చర్యలను సిఫార్సు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
ముఖ్యమంత్రి ప్రకటన
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 'ఎక్స్' లో పోస్ట్ చేస్తూ.."సాల్ట్ లేక్ స్టేడియంలో ఈ రోజు జరిగిన నిర్వహణ లోపం చూసి నేను చాలా కలత చెందాను, షాక్ అయ్యాను. నా అభిమాన ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీని చూడడానికి వేలాదిమంది క్రీడాభిమానులు, ఫ్యాన్స్‌తో కలిసి నేను కూడా కార్యక్రమానికి హాజరు కావడానికి స్టేడియంకు వెళ్తున్నాను. ఈ దురదృష్టకర సంఘటనకు నేను లియోనెల్ మెస్సీకి, అలాగే క్రీడాభిమానులందరికీ, ఆయన అభిమానులకు హృదయపూర్వక క్షమాపణలు చెప్తున్నాను" అని ముఖ్యమంత్రి తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఉన్నత స్థాయి విచారణకు ఆదేశం
సింగిల్ బెంచ్ రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ (రిటైర్డ్) అషిమ్ కుమార్ రే అధ్యక్షతన ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ కమిటీలో చీఫ్ సెక్రటరీ, అదనపు చీఫ్ సెక్రటరీ, హోమ్ అండ్ హిల్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్ సభ్యులుగా ఉంటారు. "ఈ సంఘటనపై కమిటీ వివరణాత్మక విచారణ జరుపుతుంది, బాధ్యతను నిర్ధారిస్తుంది, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా నిరోధించడానికి చర్యలను సిఫార్సు చేస్తుంది. మరోసారి, క్రీడాభిమానులందరికీ నా హృదయపూర్వక క్షమాపణలు తెలుపుతున్నాను" అని బెనర్జీ తెలిపారు.
అసంతృప్తి వ్యక్తం చేసిన అభిమానులు
ఈ సంఘటన అనంతరం ఏఎన్‌ఐ తో మాట్లాడిన ఒక అభిమాని, "కార్యక్రమం పూర్తిగా భయంకరంగా ఉంది. ఆయన కేవలం 10 నిమిషాలు వచ్చారు. నాయకులు, మంత్రులు అందరూ ఆయన చుట్టూ చేరారు. మేము ఏమీ చూడలేకపోయాము. ఆయన ఒక్క కిక్ లేదా ఒక్క పెనాల్టీ కూడా తీసుకోలేదు. షారుక్ ఖాన్‌ను కూడా తీసుకొస్తామని చెప్పారు. ఎవరినీ తీసుకురాలేదు. ఆయన 10 నిమిషాలు వచ్చి వెళ్లిపోయారు. ఇంత డబ్బు, భావోద్వేగాలు, సమయం వృధా అయ్యాయి" అని ఆవేదన వ్యక్తం చేశారు.మరో అభిమాని టికెట్ కోసం రూ. 12 వేలు ఖర్చు చేసినప్పటికీ మెస్సీ ముఖాన్ని కూడా చూడలేకపోయానని ఆరోపించారు.
నేపథ్యం: దీనికి ముందు, శనివారం ఉదయం కోల్‌కతా చేరుకున్న అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ, శ్రీ భూమి స్పోర్టింగ్ క్లబ్ అధ్యక్షుడు, పశ్చిమ బెంగాల్ మంత్రి సుజిత్ బోస్‌తో కలిసి లేక్ టౌన్‌లో ఏర్పాటు చేసిన తన 70 అడుగుల భారీ విగ్రహాన్ని వర్చువల్‌గా ఆవిష్కరించారు. ఈ విగ్రహం 2022 FIFA ప్రపంచ కప్ ట్రోఫీని పట్టుకున్న మెస్సీని సూచిస్తుంది.
No comments:
Post a Comment