ఢిల్లీ: నీళ్ల బాటిళ్లకు అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలను పాటించడం లేదంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మన దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలకు కనీస తాగు నీరే అందడం లేదని అత్యున్నత న్యాయస్థానంతెలిపింది. ఇది కేవలం ‘లగ్జరీ వ్యాజ్యమే’ అంటూ పిటిషన్‌ను తిరస్కరించింది.
ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నాణ్యతా ప్రమాణాలను మెరుగుపర్చేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టులో రిట్ పిటషన్ దాఖలైంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చితో కూడిన ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ‘‘ఇది అర్బన్-రిచ్ మనస్తత్వంతో వేసిన పిటిషనే. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా మందికి తాగు నీటి సరఫరా సరిగా లేదు. వారు శుద్ధి చేయని జలాలపై ఆధారపడుతున్నారు. ముందు వారి సంగతి ఆలోచిద్దాం. నీళ్ల బాటిళ్ల నాణ్యత గురించి తర్వాత చూద్దాం’’ అని ధర్మాసనం తెలిపింది.
‘‘అమెరికా, జపాన్, ఈయూ మార్గదర్శకాలను మన దేశంలో ప్రవేశపెట్టగలమా? అనే విషయాన్ని మీరు ఆలోచించుకోవాలి. భారత్‌లోని వాస్తవిక పరిస్థితులను తెలుసుకోవాలి. గాంధీజీ దేశానికి వచ్చినప్పుడు.. ఆయన చాలా మారుమూల ప్రాంతాల్లో పర్యటించారు. మీరు కూడా అలా అభివృద్ధికి నోచుకుని ప్రాంతాలను సందర్శించండి. అక్కడి ప్రజలు తాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో చూడండి. అప్పుడు మీకు మన దేశం అంటే ఏంటో అర్థమవుతుంది’’ అని పిటిషనర్‌కు సుప్రీం కోర్టు ధర్మాసనం సూచించింది.
No comments:
Post a Comment