- అసలైన వారెవరో ప్రజలే తేల్చారు - ఏకనాథ్ షిండే
ముంబై: మహారాష్ట్రలో ఇటీవల జరిగిన మున్సిపల్ కౌన్సిల్ ,మున్సిపాలిటీ ఎన్నికల్లో 'మహాయుతి' కూటమి ప్రభంజనం సృష్టించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే అన్నారు. ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఫలితాలు రాబోయే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలకు దిక్సూచి అని పేర్కొన్నారు.మున్సిపల్ ఎన్నికల్లో సుమారు 75 నుంచి 80 శాతం స్థానాలను మహాయుతి కూటమి కైవసం చేసుకుందని షిండే వెల్లడించారు. కొన్నిచోట్ల విడివిడిగా, మరికొన్ని చోట్ల కలిసిపోటీ చేసినప్పటికీ.. అంతిమంగా ప్రజలు కూటమివైపే నిలిచారని ఆయన అన్నారు. "రాష్ట్రంలో అసలైన శివసేన ఏదో, నకిలీ ఏదో ప్రజలు తమ తీర్పు ద్వారా స్పష్టం చేశారు. కేవలం అధికారం కోసమే రాజకీయం చేసే వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు" అని ప్రత్యర్థి వర్గాన్ని ఉద్దేశించి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అభివృద్ధే మా మంత్రం
మహాయుతి ప్రభుత్వం కేవలం మాటలకు పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు చేస్తోందని, అందుకే ప్రజలు తమను ఆశీర్వదిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. "ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ మహాయుతి విజయం సాధించడం ఖాయం. అభివృద్ధి మంత్రాన్ని నమ్ముకున్న మా కూటమికి ముంబై ఓటర్లు బ్రహ్మరథం పడతారని నేను గట్టిగా నమ్ముతున్నాను" అని షిండే ధీమా వ్యక్తం చేశారు. ఈ విజయంతో మహారాష్ట్రలో అధికార కూటమి శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. రాబోయే ఎన్నికల్లోనూ ఇదే జోరును కొనసాగించాలని మహాయుతి నేతలు భావిస్తున్నారు.
No comments:
Post a Comment