- దిగ్విజయ్ సింగ్‌పై రాహుల్ గాంధీ చమత్కారం
- నవ్వుల్లో మునిగిన సోనియా గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ సంస్థాగత బలాన్ని పొగుడుతూ ట్వీట్ చేసిన మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్‌ను ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన సరదా వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఢిల్లీలోని 'ఇందిరా భవన్'లో జరిగిన వేడుకల అనంతరం నేతలందరికీ టీ, టిఫిన్ ఏర్పాటు చేశారు. ఈ సమయంలో రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్ ఎదురుపడ్డారు. ఇద్దరూ కరచాలనం చేసుకుంటుండగా.. రాహుల్ నవ్వుతూ.. "కల్ ఆప్నే బద్మాషీ కర్ ది" (నిన్న మీరు భలే చిలిపి పని/అల్లరి చేశారు కదా) అని వ్యాఖ్యానించారు. రాహుల్ చేసిన ఈ వెటకారపు వ్యాఖ్య వినగానే పక్కనే ఉన్న సోనియా గాంధీతో పాటు మిగిలిన సీనియర్ నేతలంతా ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు.
వివాదానికి కారణమైన ఆ ట్వీట్:
శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి ముందు దిగ్విజయ్ సింగ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఎల్.కె. అద్వానీ పాదాల దగ్గర కూర్చున్న పాత ఫొటోను షేర్ చేస్తూ.. "ఒక సాధారణ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టి, దేశ ప్రధాని స్థాయికి ఎదిగారంటే అది ఆ సంస్థాగత బలమే కారణం. దీనిని చూసి కాంగ్రెస్ నేర్చుకోవాలి" అని ఆయన పేర్కొన్నారు. దీనిపై పార్టీలో తీవ్ర చర్చ నడిచింది. కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా స్పందిస్తూ.. "గాంధీ స్థాపించిన సంస్థకు గాడ్సే అనుచరుల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు" అని ఘాటుగా బదులిచ్చారు.
ఖర్గే పరోక్ష హెచ్చరిక
ఆవిర్భావ దినోత్సవ ప్రసంగంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు. "కాంగ్రెస్ అయిపోయిందని విమర్శించేవారికి నేను చెప్పేది ఒక్కటే.. మాకు అధికారం తక్కువ ఉండవచ్చు కానీ, మా వెన్నుముక ఇంకా నిటారుగానే ఉంది. మేము రాజ్యాంగం విషయంలో గానీ, లౌకికవాదం విషయంలో గానీ ఎప్పుడూ రాజీ పడలేదు, పడబోము" అని కుండబద్దలు కొట్టారు. తర్వాత దిగ్విజయ్ సింగ్ వివరణ ఇస్తూ.. తాను కేవలం ఆర్‌ఎస్‌ఎస్ సంస్థాగత పటిష్టతను మాత్రమే ప్రశంసించానని, మోదీ సిద్ధాంతాలకు తాను ఎప్పటికీ వ్యతిరేకమేనని స్పష్టం చేశారు. ఏది ఏమైనా, రాహుల్ గాంధీ దీనిని సీరియస్‌గా తీసుకోకుండా సరదాగా వ్యాఖ్యానించడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది.
No comments:
Post a Comment