- ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో వరుసగా 9వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ పన్నుల వ్యవస్థలో కీలక మార్పులను ప్రకటించారు. కొత్తగా రూపొందించిన ఆదాయపు పన్ను చట్టం 2025 (Income Tax Act 2025) వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి, అంటే ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వస్తుందని ఆమె స్పష్టం చేశారు. పన్ను చెల్లింపుదారులకు ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ ఈ కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు.
కనెక్టివిటీ అండ్ టూరిజం: హై-స్పీడ్ రైలు కారిడార్లు
పర్యావరణ హితమైన రవాణా వ్యవస్థను ప్రోత్సహిస్తూ, దేశంలోని ప్రధాన నగరాల మధ్య ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేందుకు ఏడు కొత్త హై-స్పీడ్ రైలు కారిడార్లను (High-Speed Rail Corridors) ప్రభుత్వం అభివృద్ధి చేయనున్నది.
ముంబై నుండి పూణే
పూణే నుండి హైదరాబాద్
హైదరాబాద్ నుండి బెంగళూరు
హైదరాబాద్ నుండి చెన్నై
చెన్నై నుండి బెంగళూరు
ఢిల్లీ నుండి వారణాసి
వారణాసి నుండి సిలిగురి
జల రవాణా - పర్యాటక రంగం
రాబోయే ఐదేళ్లలో 20 కొత్త జాతీయ జలమార్గాలను (National Waterways) అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, దేశంలోని మారుమూల ప్రాంతాలకు రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు మరియు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు 'సీ ప్లేన్ల' (Seaplanes) తయారీని దేశీయంగా ప్రోత్సహించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేక ప్రోత్సాహకాలను (Incentives) అందించాలని ప్రతిపాదించారు.