Friday, 7 August 2026

థాయ్‌లాండ్‌ స్కూల్‌లో కాల్పులు.. ఏడుగురు మృతి



థాయ్‌లాండ్‌లోని ఓ పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. నొంతబురి ప్రావిన్స్‌లోని బాంగ్‌ క్రువాయ్‌ జిల్లాలో ఉన్న డెబ్సిరిన్‌ స్కూల్‌లో తొమ్మిదో తరగతి విద్యార్థి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

మృతుల్లో ముగ్గురు ఉపాధ్యాయులు, ముగ్గురు విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాల్పులకు పాల్పడిన విద్యార్థి అనంతరం తనను తాను కాల్చుకుని మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై థాయ్‌ ఉప ప్రధాని అనుతిన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, దాడికి గల కారణాలను పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు.

  • స్కూల్‌కు వెళ్లే ముందు తాత, బామ్మను కూడా కాల్చిన విద్యార్థి

స్కూల్‌లో కాల్పులకు పాల్పడిన విద్యార్థి.. పాఠశాలకు వెళ్లే ముందు తన ఇంట్లో తాత, బామ్మపై కూడా కాల్పులు జరిపినట్లు థాయ్‌లాండ్‌ ప్రజారోగ్య మంత్రి తెలిపారు. ఈ ఘటనలో వారు కూడా మృతి చెందినట్లు వెల్లడించారు.

కాల్పులకు ఉపయోగించిన 9 ఎంఎం హ్యాండ్‌గన్‌ విద్యార్థి తాతకు చెందినదిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అతడి తాత గతంలో ఉపాధ్యాయుడిగా పనిచేసినట్లు పేర్కొన్నారు. స్కూల్‌లో కాల్పులకు దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కావేరీ కోసం ఎన్ని అవమానాలకైనా సిద్ధమే

 


  • తమిళనాడు సీఎం విజయ్‌

కావేరీ జలాల వివాదంపై తమిళనాడు అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ చేసిన విమర్శలకు ముఖ్యమంత్రి విజయ్‌ ఘాటుగా సమాధానమిచ్చారు. తమిళనాడు ప్రజల ప్రయోజనాల కోసం కావేరీ సమస్య పరిష్కారానికి అవసరమైతే ఎన్ని అవమానాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.

మేకెదాటు ప్రాజెక్టును కర్ణాటక ప్రభుత్వం చేపట్టకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుందో చెప్పాలని ఉదయనిధి స్టాలిన్‌ ప్రశ్నించారు. కావేరీ అంశంపై కర్ణాటక అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఐకమత్యాన్ని చాటిందని, అయితే తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి నిరాకరిస్తోందని విమర్శించారు. మేకెదాటు అంశంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి బెంగళూరుకు వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

దీనిపై సీఎం విజయ్‌ స్పందిస్తూ.. మేకెదాటు ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం ఆమోదించామని తెలిపారు. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాసినట్లు గుర్తుచేశారు. 1969లో ఈ ప్రాజెక్టుకు తొలిసారిగా అనుమతి ఇచ్చింది డీఎంకే ప్రభుత్వమేనంటూ ఉదయనిధి విమర్శలకు బదులిచ్చారు.

తన బెంగళూరు పర్యటనను కూడా విజయ్‌ సమర్థించుకున్నారు. శత్రు దేశాలు సైతం తమ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు.. పొరుగు రాష్ట్రంతో సమస్య పరిష్కారం కోసం చర్చించేందుకు వెళ్లడంలో తప్పేముందని ప్రశ్నించారు.

‘‘తమిళనాడు ప్రజల ప్రయోజనాల కోసం కావేరీ సమస్యను పరిష్కరించేందుకు నేను ప్రయత్నిస్తున్నాను. ఈ ప్రయత్నంలో భాగంగా నాకు అవమానం ఎదురైనా భరించేందుకు సిద్ధంగా ఉన్నాను. ప్రజల ప్రయోజనాలే నాకు ముఖ్యం’’ అని విజయ్‌ స్పష్టం చేశారు.

నీట్ పేపర్ లీక్‌లో విస్తుపోయే విషయాలు

  • చీటీలపై ప్రశ్నలు రాసుకున్న నిందితులు


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌ పేపర్ లీక్‌ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రశ్నపత్రాన్ని లీక్‌ చేసేందుకు కొందరు ఎన్‌టీఏ నిపుణులు, మధ్యవర్తులు కలిసి ఒక వ్యవస్థీకృత నెట్‌వర్క్‌గా పనిచేసినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ప్రశ్నలను గుర్తుపెట్టుకోవడం, వాటిని చీటీలపై రాసుకోవడం, పుస్తకాల్లో సంబంధిత పేరాలను గుర్తించడం వంటి పద్ధతులను నిందితులు అనుసరించినట్లు పేర్కొంది.

దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో సీబీఐ 94 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. నీట్‌ ప్రశ్నపత్రం తయారీ ప్రక్రియలో భాగమైన కెమిస్ట్రీ నిపుణుడు పీవీ కులకర్ణి, బోటనీ నిపుణురాలు మనీషా మాందరే, ఫిజిక్స్‌ నిపుణురాలు మనీషా హవల్దార్‌ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ పేర్కొంది. అరెస్టయిన 13 మందిలో వీరు కూడా ఉన్నారు.

ఎన్‌టీఏ కేంద్రంలో ప్రశ్నల రూపకల్పన, అనువాదం జరుగుతున్న సమయంలో వివిధ విభాగాల్లోకి నిపుణులకు ప్రవేశం ఉండేదని దర్యాప్తులో తేలినట్లు సీబీఐ తెలిపింది. ఈ సమయంలో వారు ప్రశ్నలను చీటీలపై రాసుకోవడం లేదా పుస్తకాల్లో సంబంధిత అంశాలను మార్క్‌ చేసుకునేవారని పేర్కొంది. అనంతరం తమ నెట్‌వర్క్‌లోని మధ్యవర్తులు, కోచింగ్‌ సెంటర్ల ద్వారా ఆ సమాచారాన్ని విద్యార్థులకు చేరవేసినట్లు ఆరోపించింది.

డిజిటల్‌ పద్ధతులను ఉపయోగిస్తే తమ వ్యవహారం బయటపడే అవకాశం ఉండటంతో.. నిందితులు ఈ పాత పద్ధతిని ఎంచుకున్నట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఆర్థిక ప్రయోజనాలతో పాటు కోచింగ్‌ సెంటర్ల విజయశాతాన్ని పెంచుకోవడమే ఈ కుట్ర వెనుక ఉద్దేశమని పేర్కొన్నారు.

దర్యాప్తులో భాగంగా చేతిరాతతో ఉన్న పలు నోట్స్‌ను సీబీఐ స్వాధీనం చేసుకుంది. పేపర్‌ సెట్టింగ్‌ ప్రక్రియలో ఎన్‌టీఏ అనుసరిస్తున్న భద్రతా విధానాల్లోనూ లోపాలు ఉన్నట్లు దర్యాప్తు సంస్థ గుర్తించింది. ప్రశ్నపత్రాల తయారీకి వెళ్లే, అక్కడి నుంచి బయటకు వచ్చే నిపుణులను తనిఖీ చేసే వ్యవస్థ లేదని పేర్కొంది.

కులకర్ణి మూడు సెట్ల పరీక్షపత్రాల నుంచి మూడు రోజుల్లో 135 ప్రశ్నలను అనువదించినట్లు ఛార్జ్‌షీట్‌లో సీబీఐ ప్రస్తావించింది. ఈ ప్రక్రియలో ప్రశ్నలకు నిపుణులకు సులభంగా పరిచయం ఏర్పడే అవకాశం ఉండటంతో లీకేజీకి మార్గం సుగమమైందని దర్యాప్తు సంస్థ పేర్కొంది.

చంద్రుడిపై కూలిన స్పేస్‌ఎక్స్ రాకెట్ శకలం

 


  • దృశ్యాలు తీసిన కొరియా శాటిలైట్

చంద్రుడి ఉపరితలంపై స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌-9 రాకెట్ శకలం ప్రమాదవశాత్తూ ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన ఆసక్తికర దృశ్యాలను దక్షిణ కొరియాకు చెందిన ‘దనూరి’ అంతరిక్ష నౌక రికార్డు చేసింది. రాకెట్ శకలం చంద్రుడిని ఢీకొట్టడానికి ముందు, ఆ తర్వాత ప్రభావిత ప్రాంతానికి సంబంధించిన చిత్రాలను దనూరి తన కెమెరాలో బంధించింది.

చంద్రుడి కక్ష్యలో ప్రయాణిస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం విశేషం. రాకెట్ శకలం ఢీకొన్న ప్రాంతంలో భారీ గొయ్యి ఏర్పడటంతో పాటు దుమ్ము, రాళ్లు పెద్ద ఎత్తున ఎగసిపడినట్లు చిత్రాల్లో కనిపించింది. ఢీకొట్టడానికి ముందు తీసిన చిత్రాలతో పోలిస్తే.. ప్రభావిత ప్రాంతం అనంతరం మరింత నల్లగా కనిపిస్తున్నట్లు దక్షిణ కొరియా అంతరిక్ష సంస్థ వెల్లడించింది.

దనూరి దక్షిణ కొరియా తొలి చంద్ర మిషన్‌. 2022 ఆగస్టులో ఈ అంతరిక్ష నౌకను ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ ఫాల్కన్‌-9 రాకెట్‌ ద్వారా ప్రయోగించారు. ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తూ ఉపరితలాన్ని పరిశీలిస్తోంది.

Thursday, 6 August 2026

ప్రధానితో నెట్‌ఫ్లిక్స్ సీఈవో భేటీ



  • ప్రపంచ కంటెంట్ హబ్‌గా భారత్‌పై చర్చ


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో నెట్‌ఫ్లిక్స్ సహ-సీఈఓ టెడ్ సరాండోస్‌తో సమావేశమయ్యారు. భారతదేశానికి గొప్ప కథన సంప్రదాయం, అపార సృజనాత్మక ప్రతిభ ఉన్నాయని, వాటిని ప్రపంచ స్థాయి కంటెంట్ సృష్టికి వినియోగించే అవకాశాలపై చర్చించినట్లు ప్రధాని తెలిపారు. భారత్‌ను గ్లోబల్ కంటెంట్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా మీడియా, వినోద రంగ సామర్థ్యాలపై ఇరువురు అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ ‘నెట్‌ఫ్లిక్స్ ఇండియా స్టోరీటెల్లింగ్ ఇనిషియేటివ్’ను ప్రకటించింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (IICT), నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NFDC) భాగస్వామ్యంతో యువ సృజనాత్మక ప్రతిభకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కల్పించే కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వెల్లడించింది.



టోల్ ప్లాజాల్లో అక్రమ వసూళ్లకు తావులేదు



  •  ‘మెకానికల్ పాస్’ లేదన్న కేంద్రం


జాతీయ రహదారుల టోల్ ప్లాజాల్లో వినియోగదారుల రుసుములు పూర్తిగా నిబంధనల ప్రకారమే వసూలు చేస్తున్నామని కేంద్ర రహదారుల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఆయన మాట్లాడుతూ వాణిజ్య వాహనాలకు ‘మెకానికల్ పాస్’ పేరుతో ఎలాంటి పాస్ జారీ చేయడం లేదని, అలాంటి అక్రమ వసూళ్లు జరుగుతున్న జాతీయ రహదారి భాగం ఏదీ గుర్తించలేదని తెలిపారు. టోల్ వసూళ్లలో పారదర్శకత కోసం ఎన్‌హెచ్‌ఏఐ ప్రత్యేక ప్రామాణిక విధానాలు అమలు చేస్తోందని, నగదు, ఫాస్‌ట్యాగ్ లావాదేవీలన్నీ టోల్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ ద్వారానే జరుగుతున్నాయని వెల్లడించారు.



‘పీఎం సూర్యఘర్’కు 50 లక్షల కుటుంబాలు



  • 19 లక్షల మందికి జీరో విద్యుత్ బిల్లు


ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద దేశవ్యాప్తంగా లబ్ధిదారుల సంఖ్య 50 లక్షలు దాటిందని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సీఐఐ అంతర్జాతీయ ఇంధన సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 19 లక్షల కుటుంబాలు జీరో విద్యుత్ బిల్లుతో ప్రయోజనం పొందుతున్నాయని వెల్లడించారు. అదనంగా ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను విక్రయించి 12 లక్షలకుపైగా కుటుంబాలు రూ.421 కోట్ల ఆదాయం సంపాదించాయని తెలిపారు. 2030 నాటికి 500 గిగావాట్ల నాన్-ఫాసిల్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని దేశం చేరుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత తొమ్మిది నెలల్లో రోజువారీ రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్లు 5 వేల నుంచి 16 వేలకుపైగా పెరిగినట్లు వెల్లడించారు.



Featured post

పార్లమెంట్‌లో నిరసనల హోరు

గందరగోళం మధ్య ‘కేరళం’ బిల్లుకు ఆమోదం న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు మంగళవారం కూడా తీవ్ర గందరగోళం మధ్య కొనసాగాయి. విద్యార్థులపై ప...