Thursday, 5 August 2021

జోహార్ జయశంకర్ సార్

జీవితమంతా ఉద్యమమే ఊపిరిగా బతికారు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్. నాటి ఫజల్ అలీ కమిషన్ మొదలు మొన్నటి శ్రీకృష్ణ కమిటీ వరకు తెలంగాణ పై వేసిన అన్నీ కమిటీల ముందు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను శాస్త్రీయంగా వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అన్నది సార్ కల. ఆ కల సాకారం కోసం తన జీవితకామంతా కృషి చేశారు. 

ఉమ్మడి రాష్ట్రంలో ఆయా ప్రభుత్వాలు రాష్ట్రంలో వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధి పై అధికారిక నివేదికలు విడుదల చేసేవారు. అందులో పేర్కొన్న లెక్కల ఆధారంగా నే తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని, ఈ ప్రాంతం పై వారు చూపిన వివక్షను ఏకరువు పెట్టేవారు. అందుకే సార్ అంటే అందరికీ అభిమానం. 

రాష్ట్ర సాధన అంశాన్ని ఎవరు ఎత్తుకున్నా సార్  తెలంగాణ కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని వారికి అందించారు. దశాబ్దాల పాటు తెలంగాణ ఉద్యమం అనేక ఆటుపోట్ల గురైంది. అయినా ఆ ఉద్యమ జ్వాల ఆరిపోకుండా కాపాడినవారు జయశంకర్ సార్. మలి దశ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న సందర్భంలో కొన్ని స్వార్థ శక్తులు ఇరు ప్రాంతాల ప్రజల్లో వైషమ్యాలు సృష్టించాలని చూశాయి. అలాంటి కుట్రలను సార్ బద్దలు కొట్టారు. ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసి ఉందాం అనే సందేశాన్ని సార్ అందించారు. ఉద్యమానికి దశను, దిశ ను చూపెట్టారు.

తెలంగాణ సిద్ధాంత కర్తగా రాష్ట్ర ఏర్పాటు కోసం సార్ చేసిన కృషి సువర్ణాక్షరాలతో లిఖించగలది. రాష్ట్ర సాధన కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలతో కలిసి పనిచేసినా తన స్వేచ్ఛను కోల్పోలేదు. ఉద్యమ సమయంలో తెలంగాణ వస్తే ఏమస్తుందో సారు చెప్పిన మాటలు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆవిష్కృతం అవుతున్నాయి. నీళ్ళు, నిధుల గురించి సార్ చెప్పిన సత్యాలు నేడు నిజం అవుతున్నాయి. సార్ చెప్పినట్టే గోదావరి, కృష్ణ నదుల్లో మన వాటాను హక్కుగా వినియోగించుకుంటున్నాం. నిధులు ఇక్కడి అభివృద్ధికి ఖర్చు చేసుకుంటున్నాం.

తెలంగాణ కు జరిగిన అన్యాయం వల్ల నాలుగు తరాలు నష్టపోయాయి. కాబట్టి యువత త్యాగాలు చేయవద్దు. త్యాగాలు మేము చేస్తాం. మీరు రేపటి రాష్ట్ర ఫలాలు అందుకోవాలి అన్నారు. నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి. అప్పుడే నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ట్యాగ్ లైన్ లక్ష్యం నెరవేరుతుంది. సార్ కల సంపూర్ణం కావాల్సి ఉన్నది. ఇందుకోసం సార్ ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత నాటి ఉద్యమ పార్టీ అయిన నేటి అధికార పార్టీపై ఉన్నది.

(సార్ జయంతి నేడు. జోహార్ ఆచార్య కొత్త పల్లి జయశంకర్ సార్)


-రాజు

ఆశావహులకు అశనిపాతమే

 

తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన 2026 తర్వాత చేపడుతామని కేంద్ర హోం శాఖ మంగళవారం ఎంపీ రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో సమాధానం ఇచ్చింది. ఈ ప్రకటన రాజకీయ ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లింది.  నిజానికి విభజన చట్టంలోని సెక్షన్ 15తో సంబంధం లేకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లోని నిబంధనల ప్రకారం తెలంగాణ అసెంబ్లీ స్థానాలను 119 నుంచి 153కు, ఏపీ 175 నుంచి 225కు పెంచాలని విభజన చట్టంలోని సెక్షన్ 26 (1) స్పష్టం చేస్తున్నది.  కానీ రాజ్యాగంలోని ఆర్టికల్ 179 (3) అనుసరించి 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల అనంతరమే రెండు రాష్ర్టాల్లో అసెంబ్లీ సీట్ల సర్దుబాటు జరుగుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. అయితే దీనిపై కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నేత వినోద్‌లు స్పందించారు. జమ్మూ-కశ్మీర్‌కు ఒక న్యాయం, తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు ఒక న్యాయం అన్నట్టు కేంద్రం వ్యవహరిస్తున్నదని విమర్శించారు. రాజ్యాంగమే ప్రామాణికం, జమ్మూ-కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన చేస్తే ఇక్కడ కూడా చేయాలని డిమాండు చేశారు.  ప్రతి పదేండ్లకు ఒకసారి జనాభాల లెక్కల సేకరణ జరుగుతుంది. 2021 తర్వాత మళ్లా 2031లోనే జనగణన జరుగుతుంది. కేంద్రం చెప్పినట్టు 2026 తర్వాత అంటే 2031లో చేపట్టే జనగణన వివరాలు ప్రచురించిన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనున్నట్టు స్పష్టమౌతున్నది. గత అనుభవాల దృష్ట్యా 2039 ఎన్నికల నాటికి మాత్రమే కొత్త నియోజకవర్గాలు అందుబాటులోకి రావచ్చని రాజకీయవర్గాల అంచనా.

 అయితే కేంద్రం ప్రకటించిన తాజా నిర్ణయం రాజకీయ ఆశావహులకు అశనిపాతమే. ముఖ్యంగా తెలంగాణలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అధికార టీఆర్‌ఎస్‌కు ఈ నిర్ణయంతో ఇబ్బందే. ఎందుకంటే ఉద్యమపార్టీగా పేరొందిన టీఆర్‌ఎస్‌ను ప్రజలు రెండుసార్లు ఆదరించారు. పధ్నాలుగేండ్ల సుదీర్ఘ కాల పోరాటంలో ఆ పార్టీలో పనిచేస్తున్న వారి జాబితా పెద్దదే. అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి కొంతమందికి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఇట్లా  అవకాశం ఇచ్చుకుంటూ వస్తున్నారు. చట్టసభల్లో పోటీచేసే అవకాశం లేనివారికి కార్పొరేషన్ పదవులు లేదా ఇతర పదవులు కట్టబెట్టారు. దీనికితోడు రాజకీయ పునరేకీకరణలో భాగంగా ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉన్నది. ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు కొన్నినియోజకవర్గాల్లో అయితే ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు. నియోవజర్గాల పునర్విభజన జరిగితే వీళ్లను సర్దుబాటు చేయవచ్చు అని ఇంతకాలం భావిస్తూ వస్తున్నారు. కానీ తాజాగా కేంద్ర హోం శాఖ ఇచ్చిన సమాధానం అధికారపార్టీకి మింగుడు పడని అంశమే. విభజన చట్టంలో ఇచ్చిన హామీని అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నా వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి అది అమల్లోకి వచ్చేది. కానీ ఇప్పట్లో లేదు కేంద్రం స్పష్టతను ఇచ్చింది. అలాగే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రోజురోజుకూ మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు రాష్ట్రంలో పాగా వేయడానికి ప్రణాళికలు వేసుకుంటూ  ముందుకు పోతున్నాయి. వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా ప్రతిపక్ష పార్టీలు కార్యాచరణతో ముందుకుపోతున్నాయి. 

నియోజకవర్గాల పునర్విభజన లేదు అని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో అధికారపార్టీ నుంచి ఇతర పార్టీలకు వలసలు పెరిగే అవకాశం ఉన్నది. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారనున్నాయి. అట్లనే ఏపీలో కూడా ఏ ఎన్నిక జరిగినా వైసీపీ, టీడీపీ మధ్యనే ఉన్నది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షపార్టీలను ఐక్యం చేసే పనిలో ఉన్నది. బీజేపీ కూడా దక్షిణాది రాష్ర్టాల్లో తమ బలం పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నది. ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లోనూ కొన్ని ఎంపీ సీట్లు గెలుచుకునేందుకు ఇప్పటి నుంచే పథకాలు రూపొందించుకుంటున్నాయి. కాబట్టి నియోజకవర్గాల పునర్విభజన అంశం ప్రతిపక్ష పార్టీల్లో చేరికలకు ద్వారాలు తెరిచిందనేది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

-రాజు

హాకీ ఆటగాళ్ళూ హాట్సాప్

ఒలింపిక్స్ జరుగుతున్న ప్రతీసారి పతకాల పట్టికలో భారత్ స్థానం సంపాదించేవరకు ఉత్కంఠే. మన అథెట్లు కొన్ని పతకాలు సాధించి దేశం పేరు నిలబెట్టగానే ఊపిరి పీల్చుకున్న సందర్భాలు అనేకం. కానీ ఈసారి ఆ టెన్షన్ లేదు. 

మీరాబాయి సాయికోమ్ చాను క్రీడలు ప్రారంభమైన రెండో రోజే వెండి పతకాన్ని సాధించింది. వెయిట్ లిఫ్టర్‌గా 2016 ఒలింపిక్స్‌లో ఎదుర్కొన్న పరాభవం నుంచే మీరాబాయి చాను పాఠాలు నేర్చుకున్నది. ఫీనిక్ష్ పక్షి వలె పునరుజ్జీవం పొంది టోక్యోలో మెరిసింది. కట్టెల మోతతో మొదలైన ఆమె విజయ ప్రస్థానం వెనుక ఎన్నో ఉత్థానపతనాలున్నాయి. అస్సాంకు చెందిన బాక్సర్ లవ్లీనా కాంస్య పతకాన్ని సాధించింది. అయితే తన తొలి ఒలింపిక్స్‌లోనే పతకంతో తన పవర్‌ను ప్రపంచానికి చాటింది. భారత షట్లర్ పి.వి. సింధు రియోలో రజతం, టోక్యో కాంస్యం ఒలింపిక్స్‌లలో పతకాలు సాధించింది.  వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. 


2011 ఏప్రిల్ 2న వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కెప్టెన్ ధోనీ సిక్సర్ కొట్టినప్పుడు 120 కోట్ల భారతీయులు భావోద్వేగానికి లోనయ్యారు. 1983 తర్వాత భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్‌ను ముద్దాడింది. ధోనీసేన విశ్వవిజేతగా నిలిచింది. ఆ భావోద్వేగమే 41 ఏండ్ల తర్వాత ఒలింపిక్స్‌లో జర్మనీపై గెలిచి భారత్ కాంస్య పతకాన్ని సాధించినప్పుడు కలిగింది. మన దేశ జాతీయ క్రీడ హాకీ. కానీ క్రికెట్ మానియాలో చాలా క్రీడలు ఒలింపిక్స్, ఆసియా క్రీడల వంటి సమయాల్లోనే పతాక శీర్షికల్లో కనిపిస్తాయి. అందుకే జర్మనీతో గెలిచిన తర్వాత  భారత్‌లో ప్రజలు హాకీని మర్చిపోయారు. నిజానికి వారు హాకీని ప్రేమిస్తారు. కానీ మేము గెలుస్తామని నమ్మడం మానేశారు. కానీ మేము ఈరోజు గెలిచాం. భవిష్యత్తులో వారు మా నుంచి మరింత ఆశిస్తారు, మమ్మల్ని నమ్ముతారు డ్రాగ్ ఫ్లికర్ రూపిందర్ పాల్ అన్న మాటలు అక్షరాల నిజం.


బెల్జియంతో పోరు అన్నప్పుడే మన హాకీ ఆటగాళ్లు ఏదో ఒక పతకాన్ని పట్టుకొస్తారనే నమ్మకం కలిగింది. బెల్జియంపై ఓడిపోయినా మనోైస్థెర్యం కోల్పోలేదు. రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతాక విజేత. 1980 తర్వాత భారత్ ఒలింపిక్స్‌లో పతక పోరులో తలపడిన సందర్భం లేదు. కానీ కోట్లాది మంది భారతీయుల కల నెరవేర్చాలనే తపన, కసి ఉన్నాయి. ఉత్కంఠను అధిగమించింది. హాకీకి పునర్ వైభవమే లక్ష్యంగా ఆటగాళ్లు పోరాడారు. ఇదే 41 ఏండ్ల తర్వాత భారత్‌కు పతకాన్ని అందించింది. అందుకే పసిడి పతకాన్ని తలదన్నేలా ఈ పోరు జరిగిందని క్రీడా విశ్లేషకులు వ్యాఖ్యానించారు. 


అలాగే టోక్యో ఒలింపిక్స్‌లో ఈసారి మన ఆటగాళ్ల ప్రదర్శన గతంలో కంటే మెరుగ్గా ఉన్నది. రైతు బిడ్డ రవి కుమార్ దహియా అద్భుత పోరాటంతో రెజ్లింగ్ 57 కిలోల విభాగంలో రజతం సాధించాడు. హరియాణలోని సోనెపత్‌కు సమీపంలోని నాహ్రి రవి కుమార్ దహియా స్వగ్రామం. ఏ మాత్రం వసతులు లేని కుగ్రామం నుంచి వచ్చిన ఈ మల్ల యోధుడు పసిడి పతకమే లక్ష్యంగా పోరాడి రజతంతో మెరవడం విశేషం. 


ప్రపంచంలో మన కంటే చిన్నదేశాలు ఒలింపిక్స్‌లో అద్భుతమైన ప్రదర్శనను చూపెడుతున్నాయి. మనం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఆటగాళ్లను తీర్చిదిద్దాలి. ఈసారి పతకాలు సాధించిన వారి నేపథ్యం చూస్తే దేశంలోని మారుమూల కుగ్రామాల నుంచి ఎన్నో కష్టాల కడలిని దాటి ఇక్కడిదాకా వచ్చారు. దేశ ప్రతిష్ఠను నిలబెట్టారు. గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి మట్టిమాణిక్యాలు ఇంకా ఎందరో ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా కృషి చేసి అలాంటి వారిని గుర్తించాలి. వారికి అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పించాలి. సరైన శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దితే  రానున్నరోజుల్లో మన దేశం నుంచి మరింత మంచి అత్యుత్తమ ఆటగాళ్లు తయారవుతారు. 

-రాజు


Monday, 2 August 2021

ఉప ఎన్నిక, ఉద్యమకారులు


హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి ఎవరూ అన్నది వారం, పది రోజుల్లోగా అధికారికంగా వెల్లడి కానున్నది. ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత హుజురాబాద్ లో రాజకీయ వాతావరణం హీటెక్కింది. ఈటల బీజేపీ లో చేరిన తర్వాత ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం మండలాల వారీగా ఇంచార్జి లను ప్రకటించి ప్రచారం మొదలుపెట్టింది. కాంగ్రెస్ నుంచి కౌశిక్ రెడ్డి పోటీ చేస్తారు అని అందరూ అనుకుంటుండగానే ఈ నెల రోజుల్లో అనేక రాజకీయ పరిణామాలు జరిగాయి.
చివరికి కౌశిక్ టీ ఆర్ ఎస్ కండువా కప్పుకోవడం, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ గా రాష్ట్ర క్యాబినెట్ ఆయనను నామినేట్ చేయడం వంటి నిర్ణయాలు చక చకా జరిగిపోయాయి. అలాగే అధికార పార్టీ ఆహ్వానం మేరకు తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ, ఈటల చేరిక తర్వాత బీజేపీలో అంతర్గతంగా జరిగిన పరిణామాలతో మాజీమంత్రి పెద్దిరెడ్డి ఇంకా కొంతమంది ఆ పార్టీని వీడి టీఆర్ఎస్ చేరారు.

దళిత బంధు పథకం, హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యం ప్రతిపక్ష పార్టీలలో భిన్నస్వరాలకు వేదిక అయ్యాయి. కొన్నిరోజులుగా చర్చలో ఉన్న ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఎవరన్నది కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తున్నది. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఎన్నికల సందర్భంలో ఉద్యమం, ఉద్యమకారులు అనే ప్రశ్నలు పౌర సమాజం నుంచి వస్తున్నాయి. ఎందుకంటే టీఆర్ఎస్ మాత్రమే చాలామంది ఉద్యమకారులను గుర్తించింది. వారి సేవలు రాష్ట్ర పునర్ నిర్మాణంలో వినియోగించుకుంటున్నది.

ఉద్యమ సమయంలో ఉద్యమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్ర బిందువుగా నిలిచింది. అందుకే దుబ్బాక, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సమయంలో పెద్దగా ప్రధాన అంశం కాలేదు. కాని హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఉద్యమకారుల విషయం ఇప్పుడు ప్రధానం అయ్యింది. బీసీ సామాజిక సమీకరణలు వంటివే కాకుండా ఈటల రాజేందర్ కు ఉద్యమ నేపథ్యం ఉండటంతో అధికార పార్టీ కూడా అలాంటి అభ్యర్థి వైపే చూసేలా చేసింది. ఈ కోణంలోనే ఉద్యమకారుడు, బీసీ అయిన టీఆర్ ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ అభ్యర్థి అయితేనే గెలుపు అవకాశాలు ఉంటాయి అనే అభిప్రాయం అధికార పార్టీలో ఉన్నది. సంక్షేమ పథకాలకు తోడు ఉద్యమకారుడు వర్సెస్ ఉద్యమకారుడు అనేవి తమకు లాభిస్తాయి అనే ఆలోచనలో టీఆర్ ఎస్ అధినాయకత్వం ఉన్నదని అర్థం అవుతున్నది. గెల్లు అభ్యర్థిత్వం అధికారికంగా ప్రకటించడమే మిగిలింది ఇక. ఆ తర్వాత హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకోనున్నది.

- ఆసరి రాజు

ప్రకటనలకే పరిమితం

 కొన్ని నెలలుగా కొలువుల ముచ్చట ప్రకటనలకే పరిమితం అయ్యింది. జూలై 13, 14 తేదీల్లో జరిగిన క్యాబినెట్ భేటీల్లో 50 వేల కొలువుల భర్తీ కి ఆమోదముద్ర పడుతుంది అని నిరుద్యోగులు ఆశించారు. కానీ వారి ఆశలు అడియశలే అయ్యాయి. అధికారులు అందించిన ఖాళీల వివరాలు అసంపూర్తిగా ఉన్నాయి అని పూర్తి వివరాలతో రావాలని క్యాబినెట్ ఆదేశించింది. ఆ తర్వాత మరో ఐదు రోజులకు క్యాబినెట్ మీట్ ఉంటుంది అని వార్తలు వచ్చాయి. తిరిగి 17 రోజుల తర్వాత ఆగస్టు 1న క్యాబినెట్ భేటీ జరిగింది. నిన్న కూడా కొత్త నియామకాలకు గ్రీన్ సిగ్నల్ వస్తుంది అనుకున్నారు.  కానీ నిన్న కూడా నిరుద్యోగులకు నిరాశే ఎదురైంది. జూలై 9న 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన కూడా వెలువడింది. జూలై నెలలో దాదాపు కొలువుల ముచ్చటే నడిచింది. ఖాళీల వివరాలు అసమగ్రం, వాటిపై అధ్యయనం అనేవి ఉత్త ముచ్చట్లే.ఎందుకంటే ఒక్కరోజులో సమగ్ర కుటుంబ సర్వే చేసి రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివరాలు లేవంటే నమ్మశక్యంగా లేదు. దాదాపు ఏడు నెలలుగా నియామకాల అంశంపై ప్రభుత్వం అనేక ప్రకటనలు చేసింది. కాబట్టి ఖాళీల సమగ్ర వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కానీ వాటిని భర్తీ చేయాలనే సంకల్పమే లేదు.


సంక్షేమం- సంక్షోభం


 ప్రజా సంక్షేమం కోసం తెచ్చిన పథకాలు ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి తెర తీశాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యం అయిన నేపథ్యంలో అధికార పార్టీ అక్కడ ఎలాగైనా తన పట్టును నిలుపుకోడానికి ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగానే అక్కడ దళిత బంధు, రెండో విడత గొర్రెల పంపిణి, నామినేటెడ్ పదవులు చేపట్టింది. దళిత బంధు కొత్తగా ఎన్నికల కోసం తెచ్చింది కాదు అని, రాజకీయ కోణం లేదు అని సీఎంతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. కానీ ఈటల రాజీనామా వ్యవహారం కొందరికి రాజకీయంగా లబ్ధి చేకూరింది. ఏండ్ల తరబడి పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్న వారిని ఇప్పటికైనా పడవులు దక్కాయని అంటున్నారు. నిజమే. ఉప ఎన్నిక వస్తే నిధులు, పదవులు వస్తాయి అని అంటున్న వారి వాదనలో వాస్తవం ఉన్నది. మొన్న నాగార్జున సాగర్, ఇప్పుడు హుజురాబాద్ నియోజకవర్గానికి పథకాలు, నిధుల వరాలు సీఎం ప్రకటించడమే వారి వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. అందుకే ఎమ్మెల్యే గారు రాజీనామా చేయండి అని ప్రజల నించి ప్రజాప్రతినిధులకు వారి వారి నియోజకవర్గాల్లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. సంక్షేమ పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా అమలు కావాలని, అర్హులైన వారందరికీ ఆ ఫలాలు దక్కాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆశించడం అత్యాశ కూడా కాదు. అందుకే సంక్షేమం కోసం తెచ్చిన కొన్ని పథకాలు అధికార పార్టీకి రాజకీయ లబ్ధి నే కాదు రాజకీయ సంక్షోభాలకు కారణం అవుతున్నాయి. దీనికి తాజా ఉదాహరణనే 'రాజీనామా' డిమాండ్లు తెరపైకి రావడం.

Sunday, 1 August 2021

ఆ ప్రయత్నాలు ఫలిస్తే...

 

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నరేండ్ల సమయం ఉన్నది. అయితే అప్పుడే కొత్త కూటములు, బీజేపీ యేతర పార్టీల సమావేశాల వంటివి జరుగుతున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ఇప్పటికే వివిధ ప్రాంతీయపార్టీలతో భేటీ అయి చర్చలు జరిపారు. తాజాగా పంజాబ్‌లో అధికార కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న సంక్షోభానికి ఆయన ఇచ్చిన సలహాతోనే కాంగ్రెస్‌ పార్టీ సిద్ధూను ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎంపిక జరిగింది అంటున్నారు. అంతేకాదు ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ప్రశాంత్‌ కిషోర్‌ రాబోయే కాలంలో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించిన రూట్‌ మ్యాప్‌పై కాంగ్రెస్‌ పెద్దలతో చర్చించారని, వాటికి వారు ఆమోదం తెలిపారు అన్నది వారంరోజులుగా వార్తల్లో కనిపిస్తున్న ప్రధాన వార్తలు.


కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం గత కొంతకాలంగా గతానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇందుకు ఉదాహరణ తెలంగాణలో ఆ పార్టీ అధ్యక్షుడి ఎంపిక. అట్లనే పంజాబ్‌లోనూ ముఖ్యమంత్రి అమరిందర్‌ సింగ్‌ వర్గం వ్యతిరేకించినా సిద్ధూకే పార్టీ రాష్ట్ర బాధ్యతలు కట్టబెట్టింది. వచ్చే ఏడాది జరుగనున్న ఆరు రాష్ర్టాల ఎన్నికలు, తెలంగాణలోనూ పార్టీ పటిష్ఠత, రాష్ట్రంలో అధికారంలోకి రావడం, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుంచి గణనీయంగా ఎంపీ స్థానాలు దక్కించునే వ్యూహంలోనే భాగంగా రేవంత్‌రెడ్డి ఎంపిక జరిగింది అంటున్నారు. పార్టీలో ప్రక్షాళన చర్యలు ప్రారంభించడమే కాకుండా మొన్న బెంగాల్‌లో బీజేపీని మట్టికరిపించిన మమతా బెనర్జీతో సోనియా, రాహుల్‌లు చర్చలు జరిపారు. ఆ సందర్భంలోనే బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటయ్యే కూటమికి సారథి ఎవరైనా సై అనే సంకేతాలు ఇచ్చారు. ఆ కూటమిలో సాధారణ కార్యకర్తలా పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు.


వరుసగా రెండుసార్లు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు భారీ మెజారిటీ కట్టబెట్టారు. ప్రజల ఆకాంక్షలు ఈ ఏడేండ్ల కాలంలో కేంద్రం నెరవేర్చిందనే చర్చ ఇప్పుడు జాతీయస్థాయిలో నడుస్తున్నది. మోదీకి ప్రత్యామ్నాయంగా బలమైన నేత ప్రతిపక్షాల నుంచి కనిపించకపోవడం కూడా బీజేపీకి కలిసి వచ్చింది. అయితే ఈ ఏడాదిన్నర కాలంలో కరోనా కట్టడి విషయంలోనూ, పెట్రోల్‌, డిజిల్‌, గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరిగిపోవడం, నిరుద్యోగ రేటు నలభై ఏండ్ల గరిష్ఠ స్థాయికి చేరడం వంటివి మోదీ ప్రభుత్వానికి ప్రతికూలంగా మారాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ కూడా వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే జరిగింది. కొంతకాలంగా ప్రధాని మోదీ గ్రాఫ్‌ పడిపోతున్నది. దీనికి తోడు బెంగాల్‌లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆ పార్టీలోని పెద్దలంతా ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు మమత వైపే నిలిచారు. ఇప్పుడు బీజేపీ మిత్రపక్షాలతో కాకుండా సొంతంగా అధికారంలో ఉన్న యూపీ, కర్ణాటక, గుజరాత్‌, మధప్రదేశ్‌ వంటి రాష్ర్టాల్లో కూడా వచ్చే ఎన్నికల నాటికి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా యూపీలో వచ్చే ఏడాది అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో  పట్టణ ప్రాంతంలోఆ పార్టీ మంచి మెజారిటీనే సాధించింది. అయితే గ్రామీణ ప్రాంతంలో సమాజ్‌వాదీ పార్టీ తన పట్టును నిలుపుకున్నది. కాబట్టి అక్కడ ఎలా ఉండబోతున్నది ఇప్పుడే చెప్పలేము. కర్ణాటకలో యడ్యూరప్ప వైదొలిగారు. బసవరాజు బొమ్మై కొలువుదీరారు. అయితే అక్కడ కాంగ్రెస్‌, జేడీయూల సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇందులో యడ్యూరప్ప కీలకంగా వ్యహరించారు. ఇప్పుడు ఆ పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభం రానున్నరోజులు ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సహకారంతో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వచ్చారు. తాజా మంత్రివర్గంలో ఆయనకు మంత్రిగా అవకాశం కల్పించారు. రాష్ర్టాల్లో అధికారంలోకి రావడానికి బీజేపీ తన సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి గతంలో కాంగ్రెస్‌ పార్టీ విధానాలనే అనుసరిస్తున్నది అనడానికి కర్ణాటక, మధ్యప్రదేశ్‌, బీహార్‌ రాష్ర్టాల్లో జరిగిన పరిణామాలే ఉదాహరణ. రాం విలాస్‌ పాశ్వాన్‌ మరణం తర్వాత ఆ పార్టీ రెండుగా చీలిపోయింది. నితీశ్‌ కుమార్‌ ఎన్నికల సమయానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఆయన ఎన్డీఏలో ఎంత కాలం కొనసాగుతారు అన్నది వచ్చే ఏడాది జరిగే ఆరు రాష్ర్టాల ఎన్నికల తర్వాత తేలుతుంది. ఇట్లా కేంద్రంలో అధికారం రావడానికి కావాల్సిన మెజారిటీ స్థానాలు ఉండే యూపీ, మధ్యప్రదేశ్‌, బీహార్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ర్టాల్లో బీజేపీకి అనుకూలతల కంటే ప్రతికూలతలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.  బహుశా ఈ మారిణ పరిస్థితుల నేపథ్యంలోనే కాంగ్రెస్‌ పార్టీ ప్రశాంత్‌ కిషోర్‌తో కలిసి వ్యూహరచన చేస్తూ కొత్త కూటముల ఏర్పాటు దిశగా వెళ్తున్నది.


ఇప్పటికీ మోదీకి ప్రత్యామ్నాయంగా విపక్ష కూటమిలో ముందే కూటమి ప్రధాని అభ్యర్థిని ప్రకటించకూడదనుకుంటున్నారు. దీనివల్ల జరిగే లాభం కంటే నష్టమే ఎక్కువనే అభిప్రాయం వివక్ష నేతల్లో ఉన్నది. అందుకే  అధికారానికి కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ సీట్ల గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఆయా రాష్ర్టాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో కలిసి నడువాలని కాంగ్రెస్‌ పెద్దలు భావిస్తుండవచ్చు. ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న రాష్ర్టాల్లో మాత్రం రాష్ర్టాల్లో అధికారాన్ని దక్కించుకోవడంతో పాటు ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుచుకోవడంపైనే ఫోకస్‌ పెట్టారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా విపక్ష నేతలు చేస్తున్న కూటమి ప్రయత్నాలు ఫలిస్తే మూడోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న కమలనాథులకు చెక్‌ పడటం ఖాయం అంటున్నారు.

- రాజు

Featured post

ఓట్ల తొలగింపుపై అఖిలేశ్ యాదవ్ తీవ్ర ఆగ్రహం.. ఈసీ తీరుపై ప్రశ్నల వర్షం!

  లక్నో: ఓటర్ల జాబితా నుంచి ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయి...