Monday, 9 February 2015

బహదూర్‌పల్లి బాట

సోషల్ వర్క్ ఫీల్డు వర్క్ లో భాగంగా ఆ మధ్య నగరానికి కూతవేటు దూరంలో ఓ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాం. అక్కడ అనేక విషయాలు గమనించాం. నిజానికి ఇలాంటి ప్రభుత్వ పాఠశాలలు తెలంగాణ వ్యాప్తంగా చాలానే ఉన్నాయి. వీటన్నింటిని చూసిన తర్వాత ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దవచ్చు అనే విశ్వాసం కలిగింది.
---------------------------------

‘తినడానికి చేపను ఇవ్వడం కాదు, ఆ చేపను పట్టే నైపుణ్యాన్ని నేర్పించు’ అనే సూక్తి ఆ పాఠశాల ప్రధాన ముఖద్వారం వద్ద కనిపించింది. ఒక ప్రభుత్వ పాఠశాల అనగానే సహజంగానే అక్కడ ఉండే సదుపాయాలు గుర్తుకొస్తాయి. ఇవ్వాల చాలా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేవన్నది వాస్తవం. కానీ అంతకంటే ఆందోళనకరమైన అంశం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం. ప్రభుత్వ పాఠశాలలు అంటే చిన్నచూపు చూస్తున్న ఈ కాలంలో ఒక పాఠశాల రేపటి తెలంగాణ ప్రభుత్వ కేజీ టూ పీజీ ఉచిత విద్య కార్యక్రమానికి నమూనా నిలుస్తుంది అంటే అతిశయోక్తి కాదు. గ్రేటర్ హైదరాబాద్ మహానగరానికి కూతవేటు దూరంలో కుద్బుల్లాపూర్ మండలంలోని బహదూర్‌పూర్ మండల ప్రాథమిక పాఠశాల ప్రభుత్వ పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తున్నది. గత ఏడాది వరకు ఇద్దరు విద్యావాలంటీర్లు, ఒక ప్రధానోపాధ్యాయునితో నడిచిన ఆ పాఠశాల విద్యార్థుల డ్రాపౌట్లతో సతమతమయ్యేది.కాని నేడు అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఓ స్వచ్ఛంద సంస్థ ఆ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్నది. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అక్కడ విద్య బోధన జరుగుతున్నది. గత ఏడాది కంటే గణనీయంగా విద్యార్థుల సంఖ్య పెరిగింది. విలువలతో కూడిన విద్య అందిస్తున్నారు. క్రమశిక్షణ అనేది ప్రాథమిక స్థాయి నుంచి అలవాటు చేస్తే దాని ప్రభావం చాలా ఉంటుంది. అంతేకాదు హానెస్టీ బాక్స్. పాఠశాల పరిసరాల్లో ఏ విద్యార్థికి చెందిన ఏ వస్తువైనా పోతే అది ఎవరికి దొరుకుతుందో వారు నిజాయితీగా హానెస్ట్ బాక్సులో వేయడం. అలా నిజాయితీని ప్రదర్శించిన వారి తెల్లారి ప్రేయర్ సమయంలో ప్రశంసించడం. అంటే ఇదొక రకంగా వారికి నైతిక విద్యను బోధించడం లాంటిదే. సంక్లిష్ట అంశాలను సులభ పద్ధతిలో పిల్లలకు అర్థమయ్యేలా చిత్రాల రూపంలో బోధించడం. ఇందులో పర్యావరణ అంశాలు మొదలు నీతి శతకాలు అన్నీ అందరూ చదువుకునే విధంగా బైట ఒక ప్రదర్శించడం. ఆయా అంశాలు బొమ్మల రూపంలో ఉండడం వల్ల పిల్లలను ఇట్టే ఆకర్షిస్తున్నది. ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఉన్న ఆ ప్రాథమిక పాఠశాలల పిల్లలు ఒక్క చదువులోనే కాదు అన్ని రంగాల్లో తమదైన ప్రతిభను చూపుతున్నారు. ఇందులో విశేషమేమంటే అక్కడ చదువంతా ఒక బట్టి పద్ధతిలో కాకుండా విద్యార్థులకు కిండర్ గార్డెన్ పద్ధతిలో బోధిస్తున్నారు. బడి అంటేనే పారిపోయే పిల్లల్ని పద్ధతిగా తమ పనులను చక్కబెట్టుకునేట్టు తీర్చిదిద్దుతున్నారు. ఇక చదువు అంటే టీచరే బోధించడం కాదు. తాన చెప్పదలచుకున్న విషయాలు బోర్డుపై రాసి పిల్లలను తమ నోట్ పుస్తకాల్లో రాసుకోమని చెప్పడం కాదు. పిల్లల మధ్యనే వారికి అర్థమయ్యేలా బోధించడం. పాఠం చెప్పిన తర్వాత పది మంది పిల్లల చొప్పున ఒక దగ్గర కూర్చోబెట్టి ఒక సందేహాలను మరొకరు నివృత్తి చేసుకోవడం. ఇక లెక్కలు సులభ పద్ధతిలో అర్థమయ్యేలా బోధించడం. అలాగే ఎక్కాలను సైతం పాటల రూపంలో బోధించడం వల్ల వారు ఈజీగా గుర్తుపెట్టుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ప్రోత్సాహమందిస్తే వారు తన ప్రతిభను నిరూపించుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు. ఒక్కొక్కరిది ఒక్కో కల. కొందరు కొన్ని రా మెటీరియల్స్‌ను ఉపయోగించి కొన్ని వస్తులను తయారు చేయడం, అలాగే చిన్నతనం నుంచే క్రీడల పట్ల వారికి ఆసక్తి కలిగించడం ఇవన్నీ విద్యార్థులను పాఠశాలవైపు ఆకర్షించే అంశాలే. ఇంత కంటే మెరుగ్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతుండవచ్చు. ఒక నిర్ణీత లక్ష్యం కోసం నిరంతరం శ్రమిస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయి. అయితే ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయడానికి బహదూర్‌పల్లి పాఠశాలే ఆది కాదు అంతమూ కాదు. ఇది ఒక నమూనా కావాలి.
ఇవ్వాల ఫలాన స్కూలులో అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య లభిస్తుంది అనేది వాళ్లు చేసుకునే ప్రచారమే కావచ్చు. లేదా ఆయా పాఠశాలల్లో చదవితే మంచి భవిష్యత్తు ఉంటుంది అనే విశ్వాసం కావచ్చు. దీనికి కారణం అవి సంపాదించుకున్న నమ్మకం. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఎందుకంటే కూలిపని చేసుకునే వారు సైతం ఎంత ఖర్చు అయినా సరే ప్రైవేట్ పాఠశాలలోనే చదివించడానికి మొగ్గుచూపుతున్నాడు. కానీ ప్రభుత్వ పాఠశాలలో మాత్రం చదివించడానికి సిద్ధంగా లేడు. ఎందుకంటే అక్కన మౌలిక సదుపాయాల విషయంలో కావచ్చు, బోధన విషయంలో కావచ్చు వారు ప్రైవేట్ పాఠశాలలను ఆశ్రయించడానికి కారణమవుతున్నాయి. నిజానికి ప్రైవేట్ పాఠశాలల్లో బోధించే వారికంటే మెరుగైన అర్హతలు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉండవచ్చు. కానీ చదువు చెప్పడానికి ఆ అర్హతలే సరిపోవు. పేద, మధ్య తరగతి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే బాధ్యత వారి తల్లిదండ్రులు వారిపై పెడుతున్నారు. వాళ్లు బాధ్యతను నిర్వర్తించడానికి సంసిద్ధులు కావాలి. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యతే కాదు, ఉపాధ్యాయుల బాధ్యత అనే విషయాన్ని మరువరాదు. ప్రైవేట్ పాఠశాలలు ఏటా అడ్మిషన్ల సమయంలో వాళ్లకు వచ్చిన ఫలితాలను చూపెట్టి విద్యార్థులను తమ పాఠశాలలకు వచ్చే విధంగా ప్రచారాలు చేస్తున్నప్పుడు ఆ పని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎందుకు చేయకూడదో ఆలోచించాలి. అంతేకాదు ఇవ్వాల బహదూర్‌పల్లి మండల పరిషత్ పాఠశాలో ఆసక్తి కలిగించే అంశం ఏమంటే రోజువారీ విద్యార్థుల హాజరుపట్టిక ఉంటుంది. అందులో ఎంత మంది హాజరయ్యారు ఎంత మంది రాలేదు అన్నది క్లాసుల వారీగా బోర్డుపై రాస్తున్నారు. ఒకటి రెండు రోజులకంటే ఎక్కువ రోజులు రాని విద్యార్థి ఇంటికి వెళ్లి వారి సమస్యను తెలుసుకుని, ఒకవేళ వాళ్ల ఇంట్లో తల్లిదండ్రులు అంగీకరించుకుంటే వాళ్లకు అర్థమయ్యేలా చెప్పి విద్యార్థులను పాఠశాలకు తీసుకుని వస్తున్నారు. పేద, మధ్య తరగతి విద్యార్థి పాఠశాలకు రాకపోవడానికి ఆర్థిక సమస్యలు కూడా ఒక కారణం కావచ్చు. లేదా కుటుంబ సమస్యలు ఏవైనా ఉండవచ్చు. తల్లిదండ్రులు ఇద్దరు కూలి పనికి వెళ్తే ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వారిని చూసుకోవడానికి మరొకరి చదువును త్యాగం చేసే పరిస్థితులు ఇప్పటికీ గ్రామాల్లో కొనసాగుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు అందరూ కృషి చేయాలి. ఇక ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు నేర్పించే విషయాలు వారికి జీవితాంతం ఉపయోగపడతాయి. పాఠశాల బోర్డుపై ఏ రోజుకారోజు ముఖ్య వార్తలు రాయడం, జనరల్ నాలెడ్జీకి సంబంధించిన ఒక ప్రశ్న రాయడం, నిన్నటి ప్రశ్నకు జవాబు ఇవ్వడం. ఒక మంచి మాట రాయడం. ఇలా విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పరిజ్ఞానమే కాకుండా ఇతరత్రా విషయాలపై అవగాహన కల్పించడం. ఇవన్నీ ఇప్పుడే కొత్తగా వచ్చినవి కాదు. గత రెండు మూడు దశాబ్దాల కిందట ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నవే. కానీ రానురాను ఆ పరిస్థితి పోయి ఇరవై నాలుగు గంటలు పుస్తక పురుగులుగా మార్చే సంస్కృతి వచ్చింది. మార్కుల పేరుతో పిల్లలను బైట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియకుండా పుస్తకాలకే పరిమితం చేయడం. ఒకరకంగా ఇది పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు పైసలు కుమ్మరిస్తే, పిల్లలు ఆ పుస్తకాల బరువును మోడయం లాంటిది. ఈ పరిస్థితి మారాలి. నాణ్యమైన విద్య అంటే పిల్లలను ప్రకృతికి దూరంగా చదివించడం కాదు. పుస్తకాలే ప్రపంచంగా బోధించడం అంతకన్నా కాదు. అందరికి సమాన విద్య అనేది ఆచరణలో సాధ్యం కావాలంటే ఈ మార్కుల కొలమానం నుంచి మనం బైటికి రావాలి.
మార్పును కోరుకుంటే మార్పుకనుగుణంగా మన ప్రణాళికలను రూపొందించుకోవాలి. వాటిని పకడ్బందీగా ఆచరణలో పెట్టాలి. ఇవాల దేశంలోనే కాదు చాలా రాష్ట్రాల్లోముఖ్యంగా అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో మొదలు తెలంగాణ రాష్ట్రంలో సైతం ప్రాథమిక విద్య పటిష్టంగా లేదని అనేక అధ్యయనాలు తేల్చాయి. ప్రాథమిక విద్య పటిష్టంగా ఉంటేనే విద్యార్థి భవిష్యత్తు బాగుంటుంది. కానీ నేడు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతున్నది. దీనిపై నిందారోపణలకు పరిమితం అవడం కంటే ప్రభుత్వ పాఠశాలల పటిష్టతకు కృషి చేసే మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పిల్లల బంగారు భవితకు బహదూర్‌పల్లి ఒక బాట కావాలి.

Saturday, 3 August 2013

బహుపరాక్ ప్రజలారా!!

కేసీఆర్ ను తిట్టడానికి పార్టీల్లో, నేతల్లో సమైక్యత వచ్చింది. ఏకాభిప్రాయం వచ్చింది. రెండుకళ్ళ సిద్ధాంతం సబబే అనిపించింది . ఒకరి మనోభావాలు మరొకరు అర్థం చేసుకున్నారు. ఇదంతా దేనికోసం సీమాంధ్ర లో తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మాత్రమే!  సీమాంధ్ర ఇప్పుడు జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావం కాదు, సమైక్య రాష్ట్రం కోసం అంతకంటే కాదు. తెలంగాణ పై నిర్ణయం జరిగిపోయాక ఇక ఏమీ చేయలేము అని చెప్పలేక ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికే! బహుపరాక్ ప్రజలారా!!

Thursday, 1 August 2013

ఆఖరి అస్త్రాలు



తెలంగాణ అనుకూల ప్రకటన వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అన్న లగడపాటి ఆ పని చేయలేదు. ఎందుకంటే తెలంగాణ బిల్లును ఇటు అసెంబ్లీ, అటు పార్లమెంటు లో ఓడించడానికి ప్రయత్నాలు చేస్తూ................................ నే ఉంటాడు. కాబట్టి లగడపాటి హార్డ్ కోర్ సమైక్యవాది అయిపోయాడు. ఇక ఇప్పుడు కొంత మంది సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలు తమ పదవులకు రాజీ'నామాలు' చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ రాజీనామాలతో వస్తే రాష్ట్రపతి పాలనే వస్తుంది తప్పా రాష్ట్ర విభజన పై కేంద్ర ప్రభుత్వం వెనక్కి వెళ్ళే అవకాశమే లేదు. ఇదే విషయాన్నీ దిగ్విజయ్, షిండే లు చెప్పారు. నాలుగేళ్ళ కిందట నల్లారి,నారా వారు ఆడిన రాజీ డ్రామా లతో కేంద్రం వెనక్కి తగ్గింది. దాని ఫలితంగా కార్యకర్తలను  కాపాడుకోవడానికి, పార్టీని నిలబెట్టుకోవడానికి వేల కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. అందుకే బాబు ఆ తప్పు మళ్ళీ చేయలేదు. కానీ విభజన పాపం బాబు, వైఎస్అర్ సీపీల పై కి నెట్టి లబ్ధి పొందాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు చాలా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే రాజీనామా చేసిన వైఎస్అర్ సీపీ ఎమ్మెల్యేల 'రాజీ'నామాలు ఏమయ్యాయో తెలియదు. సీమాంధ్ర నేతల రాజీనామాల వెనుక ఉన్న స్టార్ బాట్స్ మెన్ ఎవరో అందరికి తెలుసు. లగడపాటి చెప్పిన ఆ బాట్స్ మెన్ హస్తినలో రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇక ఇప్పటి రాజీనామాలు వారి ఆఖరి అస్త్రాలు. ఈ శుష్క యుద్ధం లో వాళ్ళు మీడియా ముందు హీరోలుగా కనబడినా...రాష్ట్ర విభజనపై కేంద్రం మనసు మారదు.

Saturday, 27 July 2013

కొత్త రాగల కుట్ర

తెలంగాణ ప్రజల ఆకాంక్ష హైదరాబాద్ తో కూడిన పది జిల్లాల తెలంగాణ మాత్రమే! ఇప్పుడు మీడియాలో వస్తున్నలీకులు  అంటు మొక్క రాయల తెలంగాణ ఎవరికీ ఆమోదయోగ్యం కాదు. దీన్ని తెలంగాణ ప్రజలే కాదు, రాయలసీమ ప్రజలు కూడా అంగీకరించరు. ఇప్పటివరకు రాష్ట్రంలో సమైక్య, తెలంగాణ వాదనలే ఉన్నాయి. ఆ మధ్య రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కూడా ఈ రెండు అంశాల పైనే కిరణ్, బొత్స, రాజనర్సింహను రోడ్ మ్యాప్ అడిగారు. తెలంగాణను అడ్డుకోవడానికి సీమాంధ్ర ప్రజాప్రతినిధుల కంటే ప్రసార మాధ్యమాలే ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాయి. బులిటెన్ ఒక వాదాన్ని తెరమీదికి తెస్తున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రాయల తెలంగాణకే మొగ్గు చూపిస్తున్నట్లయితే దీన్ని ఇరు ప్రాంతాల ప్రజలు ఒప్పుకోరు కాబట్టి దీని సాకుతో ఇప్పటి వరకు ఆ పార్టీ చెబుతున్న నిర్ణయాన్ని చెప్పకుండా విభజన అంశాన్నికొన్ని రోజులు (కాంగ్రెస్ పార్టీ దృష్టిలో కొన్ని ఏళ్ళు) కోర్ కమిటీలో చర్చిస్తూ సాగదీస్తుంది.

Saturday, 13 July 2013

సమా‘వేషాలు’


దిగ్విజయ్ సింగ్ తెలంగాణపై అన్ని పార్టీలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపామన్నారు. ఇక సంప్రదింపులు ఉండవు అన్నారు. ఇక నిర్ణయమే మిగిలింది అన్నారు. అది తీసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. ఆ నిర్ణయం తీసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై ఒక విధానం ఉండాలి. అలాగే తెలంగాణపై ఇప్పటి వరకు ఏ అభిప్రాయం చెప్పని పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీనే. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత తెలంగాణపై ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీలు యూటర్న్ తీసుకున్నాయని కమిటీలు వేసింది. చర్చలు, సంప్రదింపుల పేరుతో ఏకాభిప్రాయం సాధిస్తామన్నది. తెలంగాణపై దేశవ్యాప్తంగా మెజారిటీ ఎప్పుడో వచ్చింది. కానీ హామీ ఇచ్చిన పార్టీ, అధికారంలో ఉన్న పార్టీకి మాత్రం దీనిపై ఎలాంటి నిర్దిష్ట అభిప్రాయం లేకపోవడమే ఇప్పటి విషాదం. తెలంగాణ అంశం తేలాలంటే కాంగ్రెస్ పార్టీ తన వైఖరి వెల్లడించాలి. అది జరగనంత కాలం కమిటీలు, చర్చలు, సంప్రందిపులు, కోర్ కమిటీ సమావేశాలు, సీడబ్లూసీలో చర్చించడాలు, రోడ్ మ్యాప్‌లు మాత్రమే కనిపిస్తాయి. ఆ సమా‘వేషాలు’ సమస్య సాగదీతకే తప్ప, పరిష్కారం కోసం కాదు.

Tuesday, 9 July 2013

సత్తిబాబు సమైక్య సన్నాయి



రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు తిరుపతి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకున్నానని చెప్పారు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే పీసీసీ అధ్యక్షునిగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన ఆయన ఆ మధ్య ఉండవల్లి అరుణ్‌కుమార్ సమైక్యాంధ్ర సదస్సుకు హాజరయ్యారు. ఆ సదస్సులో ఊసరవెల్లి ఉండవల్లి తెలంగాణ ఉద్యమనాయకత్వంపై విషం చిమ్ముతుంటే ఆ వేదికను పంచుకొని నేను సమైక్యాంధ్ర గురించి మాట్లాడలేదు అన్నారు. అంతేకాదు ఆ సభలో తెలంగాణకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ, ఉద్యమాన్ని అవహేళన చేస్తున్న వారందరితో కలిసిపోయారు సత్తిబాబు. ఆయన ఆరోజు ఆ సభలో సమైక్యవాదాన్ని వినిపించకపోయినా ఆయన ఆంతర్యం మాత్రం అదేనని అప్పుడే అర్థమైంది. దీనిపై ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు ఆయనను నిలదీస్తే మీరు సభ పెట్టండి మీ సభకు వస్తాను అని తప్పించుకున్నాడు. అట్లాగే ఆమధ్య రాష్ట్రస్థాయి కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలోనూ తెలంగాణ అమరులకు నివాళులు అర్పించే సమయంలో బొత్స వ్యవహరించిన తీరు ఆయన తెలంగాణ వ్యతిరేకతను చూపెట్టింది. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రాష్ట్ర మొత్తానికి ప్రాతినిధ్యం వహించాలి. కానీ రేపు ఎన్నికల్లో వీరిద్దరు పోటీ చేసేది సీమాంధ్ర ప్రాంతంలో. అంతేకాదు సత్తిబాబు కుటుంబం నుంచి ఎన్నికల్లో నిలబడే వారి సంఖ్య కూడా పెద్దగానే ఉంటుంది. అందుకే ఎన్నికల సమయంలో సత్తిబాబు సమైక్య సన్నాయి నొక్కుతున్నారు.  ఒకవైపు తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తిస్తున్నామంటూనే వైఎస్‌ఆర్‌సీపీ సీమాంధ్రలో రాజీనామాలకు తెరలేపింది. కాంగ్రెస్ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామంటూనే విభజనకు అంగీకరించమని ‘గంట’లు మోగిస్తారు. టీడీపీ తెలంగాణకు వ్యతిరేకం కాదని బాబు చెప్పుకొస్తాడు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి లాంటి వాళ్లు కాగితాల మీద ఇచ్చే రోడ్డు మ్యాప్ ఆధారంగా రాష్ట్రాన్ని విభజిస్తామంటే ఊరుకోము అంటాడు. సాక్షాత్తూ రాష్ట్ర పీసీసీ అధ్యక్షునికే తెలంగాణ వ్యతిరేకత ఉంటే, ఇక మిగతా నేతలను ఆయన ఎలా కట్టడి చేస్తాడు? మా పార్టీ క్రమశిక్షణకు పెట్టింది పేరు అనే చంద్రబాబు మాత్రం తెలంగాణ విషయంలో ఆ షరతు వర్తించదు అంటాడు. సీమాంధ్ర బాబు చిత్రాలు ఈ నాలుగేళ్లలో ఈ ప్రాంత ప్రజలు చాలానే చూశారు. అందుకే ఇక తెలంగాణపై ఎన్ని నాటకాలు వేసినా ప్రయోజనం ఉండదు.

Saturday, 6 July 2013

పార్టీల నిర్ణయమే ప్రామాణికం

తెలంగాణపై ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, డెప్యూటీ ముఖ్య మంత్రులను రోడ్‌ మ్యాప్‌లతో రమన్నాడు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహా రాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌. ఆయన చెప్పిన ప్రకారం కాంగ్రెస్‌ అధిష్టానం ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, రెండోది సమైక్యాంధ్రాను కొనసాగిం చడం. ఈ రెండు వాదనల్లో ఏదో ఒక అంశాన్ని ఎన్నుకొని వారి అభిప్రా యాలు ఆ పార్టీ రాష్ట్ర పెద్దలకు చెప్పుకునే అవకాశం కార్య కర్త మొదలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులకు ఉన్న ది. వీరందరి అభిప్రాయాలను పరిగణలోకి హస్తినకు వెళ్తారు. అయితే రాష్ట్ర విభజనపై మాట్లాడుతున్న రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికే ఎన్నోమార్లు వివిధ కమిటీల ముందు, కాంగ్రెస్‌ అధిష్టాన పెద్దల ముందు వినిపించారు. మొన్న దిగ్విజయ్‌ వచ్చినప్పుడు కూడ ఇరుప్రాంతాల నుంచి తమ తమ అభిప్రాయాలతో కూడిన నివేదికలు ఇచ్చారు. అలాగే అందరి అభిప్రాయాలు అధిష్టాన పెద్దలకు విన్నవించి, రాష్ట్ర విభజనపై అన్ని ప్రాంతాల మనోభా వాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అందరికి ఆమోదయో గ్యమైన నిర్ణయం కేంద్ర ప్రభుత్యం తీసుకుంటుందని ఇప్పుడు విభజనపై మడత మాటలు మాట్లాడుతున్న నేతలంతా ఇంతకాలం చెప్పుకొచ్చినవే. ఈ రాష్ట్ర ఎప్పటికీ సమైక్యంగానే ఉంటుంది. ఎప్పు డు ఎన్నికలు వచ్చినా సమైక్యవాదానికి 270 స్థానాలు ఖాయమన్న లగడపాటి రాజగోపాల్‌ దాన్ని పక్కనపెట్టాడు. తనకున్న సమాచారం మేరకు మూడు నెలల్లో తెలంగాణపై ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో తీర్మానం కోరుతారని, అప్పుడు ఆ తీర్మానం వీరిపో యేలా చేయాలన్నారు. ఆ తీర్మానం వీరిపోతుందా లేక పాస్‌ అవుతుందా అనేది ఆంధ్రా ఆక్టోపస్‌కు అర్థం కావడం లేదు. అందుకే అప్పుడు ఆ తీర్మానం వీరిపోవాడానికి నలభైపైచిలుకు ఉన్న సీమాంధ్ర టీడీపీ నేతలు సమైక్యవాదంపై గళం విప్పాలం టున్నాడు. తెలుగుతల్లి ముక్కలు కాకుండా ఉండాలంటే వాళ్లు వేసే ఓటుపైనే ఆధారపడి ఉంటుందని తెగ ఆందోళనపడుతున్నాడు. ఇప్పుడు లగడపాటి రాజగోపాల్‌ సీమాంధ్ర కాంగ్రెస్‌, టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలకు అధికార ప్రతినిధి అయిపోయాడు. అయా పార్టీల నేతలంతా తెలంగాణను వ్యతిరేకించాలంటున్నాడు. ఇంతకాలం రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితిలో జరగదన్న అగడపాటి ఇప్పుడు మా త్రం ఏం జరుగుతుందో చెప్పలేము అంటున్నాడు. దానిపై ఆయ నకు క్లారిటీ రావాలంటే అసెంబ్లీ తీర్మానం తర్వాత వస్తుందేమో! ఇక్కడే అగడపాటి రాజగోపాల్‌ ఒక విషయాన్ని మరిచిపోతున్నాడు. రాష్ట్ర విభజనపై వ్యక్తిగత అభిప్రా యాలు ఏవైన పార్టీల అభిప్రా యాలే అంతిమం అన్న ప్రాథమిక విషయాన్ని ఆయన మరిచిప తున్నాడు. అసెంబ్లీలో తీర్మానం పెడితే తెలంగాణకు తాము వ్యతిరే కం కాదు అన్న పార్టీల బలబలా లు చూస్తే ఆ బిల్లు సునాయసంగా పాస్‌ అవుతుంది. లేదు ఆ మాట అన్నది తమ రాజకీయ లబ్ధి కోసమే అంటే పరిస్థితి మరోలా ఉంటుంది. ఇప్పుడు పక్క పార్టీల విషయాన్ని పక్కనపెడితే మీ ముఖ్య మంత్రి, పీసీసీ, డెప్యూటీ సీఎం రోడ్‌ మ్యాప్‌ల ఆధారంగా కాంగ్రెస్‌ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని అసెంబ్లీలో అమలు చేయాల్సిన బాధ్యత సభా నాయకుడిగా ముఖ్యమంత్రిపై ఉంటుంది. తమ అభిప్రాయాన్ని తెలియజేసి మిగతా పార్టీల అభిప్రాయాన్ని కోరవలసి ఉంటుంది. అంతేగానీ బడిత ఉన్న వాడిదే బర్రె అన్నట్టు సీమాంధ్ర ప్రాంతంలో సంఖ్యాబలం ఎక్కువగా ఉంది కాబట్టి పార్టీ నిర్ణయంతో సంబంధం లేకుండా వ్యవహరిస్తామంటే తీర్మానం వీగిపోతుందేమో కానీ రాష్ట్ర విభజన మాత్రం ఆగదు. మెజరిటీ ప్రాంత ప్రతినిధులు తమకున్న బలంతో మైనరిటీ ప్రాంతాన్ని గుప్పిట్లో పెట్టుకుంటామంటే కుదరదు. ఇలాంటి పరిస్థితి ఉంటుం దనే రాజ్యాంగ నిర్మాతలు కొత్త రాష్ట్రాల ఏర్పాటు నిర్ణయాన్ని కేంద్రం చేతిలో పెట్టారు. అందుకే మీ రాష్ట్ర వ్యవహారల పర్యవేక్ష కుడు దిగ్విజయ్‌ సింగ్‌ కూడా అసెంబ్లీ తీర్మానానికి కట్టుబడి ఉండా ల్సిన పనిలేదు అన్నారు. రాష్ట్రాన్ని విడదీస్తే రాజీనామాలు చేస్తాం. అగ్నిగుండం అవుతుంది అనే మాటలతో కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్‌ చేసే రాజకీయాలకు కాలం చెల్లింది. తెలంగాణ కోసం ఆ మధ్య కొంతమంది ఎంపీలు పార్టీకి డెడ్‌లైన్లు పెడితే, అధిష్టానానికి డెడ్‌లైన్లు పెట్టే సాహసం ఎవరూ చేయకూడదని ముఖ్యమంత్రి అన్న మాటలు రాజీనామాలు చేస్తాం అంటున్నవారు గుర్తించుకుంటే మంచిది. టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలు కూడా తెలంగా ణపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నాయి. కాంగ్రెస్‌ హస్తిన పెద్దలు మొదలు ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి దాకా కేంద్రం దీనిపై చర్చలు జరుపుతున్నదని త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఆ నిర్ణయానికి అనేక గడువులు పెట్టి మాట మార్చారు కూడా. ఇప్పుడు ఆ సమయం కూడా దాటిపోయింది. అందుకే డిగ్గీరాజా ఒక డెడ్‌లైన్లు ఉందవు నిర్ణయమే ఉంటుందని కుండబద్దలు కొట్టారు. ఈ మాట నిజమో కాదో అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అన్నదమ్ముల్లా విడిపోయి ఆత్మీయుల్లా కలిసుందామని ఆంధ్రప్రదేశ్‌ లోని బుద్ధిజీవులంతా కోరుకుంటున్నారు. అయితే నిర్ణయం రాకము ందే ఒక ప్రాంత ప్రజలు ఆకాంక్షపై ఒక వర్గం మీడియా, కొంత మంది వ్యక్తులు విషం చిమ్మడం సరికాదు. అలాగే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టేవరకూ కాంగ్రెస్‌ను నమ్మేస్థితిలో ప్రజలు లేరు. కాంగ్రెస్‌ పార్టీ అన్నమాట ప్రకారం పార్లమెంట్‌లో బిల్లు పెడితేనే ఆ పార్టీని తెలంగాణ ప్రజలు విశ్వసిస్తారు. తెలంగాణ ప్రజల నాలుగు దశాబ్దాల కల సాకారమవుతుందనుకున్న ప్రతి తరుణంలో ఒక వర్గం మీడియా అడ్డుకోజూడటం ఇక్కడి ప్రజల్లో పెను ప్రభావమే చూపుతుంది. తెలంగాణపై పార్టీల నిర్ణయమే ప్రామాణికం. ఆయా పార్టీలు ఇక్కడ మన గలగాలంటే ఇప్పుడు అవి తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.

Featured post

అయోధ్య నుంచి పోటీ చేయండి

యోగి ఆదిత్యనాథ్‌కు అఖిలేశ్‌ యాదవ్‌ సవాల్‌ త్వరలో రామ మందిరానికి ఎస్పీ నేతలతో కలిసి వెళ్తా: ఎస్పీ అధినేత  న్యూఢిల్లీ, అక్టోబర్‌ 8: ఉత్తరప్రదే...