- ప్రకృతి, సంస్కృతిల కలయికగా నిలిచిన వేడుక
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని బొల్లారం రాష్ట్రపతి నిలయంలో గత తొమ్మిదిరోజులుగా కొనసాగిన రెండో ఎడిషన్ 'ఉద్యాన్ ఉత్సవ్' ఆదివారం సాయంత్రం అత్యంత వైభవంగా ముగిసింది. భారతీయ వారసత్వం, వ్యవసాయం, పర్యావరణ సుస్థిరత, పౌర భాగస్వామ్యాన్ని చాటిచెప్పేలా సాగిన ఈ ఉత్సవానికి లక్ష మందికి పైగా సందర్శకులు తరలివచ్చారు. రాష్ట్రపతి నిలయం ఆధ్వర్యంలో, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహించిన ఈ వేడుకలో పాఠశాల విద్యార్థులు, రైతులు, అంకుర సంస్థల ప్రతినిధులు, సామాన్య ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.
భారతీయ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ ఉత్సవం సాగిందని 'మేనేజ్' (MANAGE) డైరెక్టర్ జనరల్ డాక్టర్ సాగర్ హనుమాన్ సింగ్ కొనియాడారు. చిన్నారులకు విజ్ఞానాన్ని పంచే ప్రదర్శనలు, రైతులకు అవగాహన కల్పించే వర్క్‌షాప్‌లతో పాటు ఈ వేడుకల్లో యువతుల భాగస్వామ్యం ప్రోత్సాహకరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు ఈ ఉత్సవంలో క్రియాశీలకంగా పాల్గొనడం పట్ల రాష్ట్రపతి సచివాలయ డైరెక్టర్ శివేంద్ర చతుర్వేది హర్షం వ్యక్తం చేశారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సంప్రదాయ విలువల మధ్య వారధిగా ఈ కార్యక్రమం నిలిచిందని నిర్వాహకులు వెల్లడించారు.
ఈ ఉత్సవంలో ఏర్పాటు చేసిన 50కి పైగా థీమాటిక్ స్టాళ్లు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గ్రీన్ నాలెడ్జ్ హబ్, మిల్లెట్ మండి, స్టార్టప్ హబ్, ఎకో బజార్, ఇన్నోవేషన్ జోన్ వంటి వివిధ విభాగాల ద్వారా 120 మందికి పైగా ప్రదర్శకులు తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. చిరుధాన్యాల ప్రాముఖ్యం నుండి అత్యాధునిక వ్యవసాయ పరికరాల వరకు అనేక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. రాష్ట్రపతి నిలయానికి ఉన్న చారిత్రక వైభవాన్ని నేటి తరం సరికొత్త కోణంలో వీక్షించేలా ఈ 'ఉద్యాన్ ఉత్సవ్' ఒక వేదికగా నిలిచింది.
No comments:
Post a Comment