Tuesday, 13 January 2026

నిరసనకారులను ఉరితీస్తే ఖబడ్దార్

  • ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్
  • అమెరికా నుంచి సాయం అందుతుందన్న అగ్రరాజ్య అధ్యక్షులు

వాషింగ్టన్: ఇరాన్‌లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను అణచివేయడానికి అక్కడి పాలకులు ఉరిశిక్షలను ఆయుధంగా వాడుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా హెచ్చరించారు. ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నిరసనకారులను ఉరితీసే చర్యలకు పాల్పడితే అమెరికా అత్యంత కఠినంగా స్పందిస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇరాన్ వీధుల్లో పోరాడుతున్న వారికి మద్దతుగా "సాయం అందుతున్నది" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ట్రంప్, అక్కడి పరిస్థితులను తాము నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. ఇరాన్‌లో జరుగుతున్న రక్తపాతంపై పూర్తిస్థాయి నివేదిక కోసం వేచి చూస్తున్నానని, ఒకసారి స్పష్టత వచ్చిన తర్వాత తదుపరి కార్యాచరణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.




నిరసనకారులపై కాల్పులు జరిపినా, వారిని చంపినా అమెరికా జోక్యం చేసుకుంటుందని ట్రంప్ గతంలోనే హెచ్చరించారు. తాజాగా టెహ్రాన్ ప్రాసిక్యూటర్లు కొందరు నిరసనకారులపై 'దేవునిపై యుద్ధం' వంటి తీవ్రమైన ఆరోపణలు మోపి మరణశిక్ష విధించే అవకాశం ఉందని ప్రకటించడంతో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా కరాజ్ నగరానికి చెందిన 26 ఏళ్ల ఎర్ఫాన్ సోల్తానీ అనే యువకుడికి ఇప్పటికే మరణశిక్ష పడిందని, అది ఏ క్షణమైనా అమలు కావచ్చని మానవహక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇరాన్ ప్రజల స్వేచ్ఛా పోరాటానికి తమ మద్దతు ఉంటుందని చెబుతూనే, అణచివేతకు పాల్పడే అధికారులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.

No comments:

Post a Comment

Featured post

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

  న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...