Wednesday, 14 January 2026

ప్రపంచ పార్లమెంటరీ వేదికపై భారత్ గర్జన


  • ఢిల్లీలో 28వ కామన్వెల్త్ స్పీకర్ల సదస్సు ప్రారంభం
  • ఏఐ, సోషల్ మీడియా ప్రభావంపై మోడీ కీలక ప్రసంగం



న్యూఢిల్లీ: అంతర్జాతీయ పార్లమెంటరీ దౌత్యంలో భారత్ మరో కీలక ఘట్టానికి వేదికైంది. దేశ రాజధానిలోని చరిత్రాత్మక పార్లమెంట్ భవనం (సంవిధాన్ సదన్) సెంట్రల్ హాల్‌లో 28వ కామన్వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సును (CSPOC) ప్రధాని నరేంద్ర మోడీ గురువారం (జనవరి 15, 2026) ఘనంగా ప్రారంభించనున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక సమావేశానికి 42 కామన్వెల్త్ దేశాలు, నాలుగు పాక్షిక స్వయంప్రతిపత్తి కలిగిన పార్లమెంట్ల నుంచి సుమారు 61 మంది స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారులు హాజరవుతున్నారు. సుమారు 16 ఏళ్ల విరామం తర్వాత భారత్ ఈ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడం విశేషం.


మూడురోజుల ఈ సదస్సులో మారుతున్న కాలానికి అనుగుణంగా పార్లమెంటరీ వ్యవస్థలను ఎలా ఆధునీకరించాలనే అంశంపై లోతైన చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా పార్లమెంటు పనితీరులో కృత్రిమ మేధ (Artificial Intelligence) వినియోగం, దానివల్ల కలిగే ప్రయోజనాలు, ఎదురయ్యే సవాళ్లపై స్పీకర్లు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. వీటితోపాటు ప్రజాప్రతినిధులపై సోషల్ మీడియా చూపుతున్న ప్రభావం, ఓటింగ్‌కు అతీతంగా ప్రజాస్వామ్య ప్రక్రియలో సామాన్య పౌరుల భాగస్వామ్యాన్ని ఎలా పెంచాలి, పార్లమెంటుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అనుసరించాల్సిన సరికొత్త వ్యూహాలపై ఈ వేదికపై మేధోమథనం సాగనున్నది.


ప్రజాస్వామ్య సంస్థలను పటిష్టం చేయడంలో స్పీకర్లు పోషించాల్సిన నిష్పాక్షిక పాత్రపై ప్రత్యేక ప్లీనరీ సెషన్ నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సైబర్ ముప్పులు, వాతావరణ మార్పులు వంటి సంక్లిష్ట సమస్యలను ఎదుర్కోవడంలో పార్లమెంటుల మధ్య సహకారం ఎంత అవసరమో ప్రధాని మోడీ తన ప్రసంగంలో  ప్రస్తావించనున్నారు. భారత్ తన పురాతన ప్రజాస్వామ్య విలువలను ఆధునిక సాంకేతికతతో జోడించి ఎలా ముందుకు సాగుతుందో ఈ సదస్సు ద్వారా ప్రపంచానికి చాటిచెప్పనుంది. ఈ సమావేశం ద్వారా కామన్వెల్త్ దేశాల మధ్య పార్లమెంటరీ బంధాలు మరింత ధృడపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

No comments:

Post a Comment

Featured post

తొలి బిడ్డను ఆహ్వానించడానికి ముందే ఒక తేదీని అనుకున్నాం

  పాత ఇంటర్వ్యూలో సమంత చేసిన వ్యాఖ్యలు వైరల్ మా ఇంటి బంగారం" విజయంతో పాటు గర్భధారణ వార్తలతో హెడ్‌లైన్స్‌ లో నిలిచిన స్టార్ హీరోయిన్ దర్...