Wednesday, 14 January 2026

సైనిక దినోత్సవం: వీర జవాన్లకు రాష్ట్రపతి, ప్రధాని సెల్యూట్


  • 'నేషన్ ఫస్ట్' అనే మీ స్ఫూర్తి అజరామరమని ప్రశంసలు

న్యూఢిల్లీ: భారత సైనిక దినోత్సవం (Army Day) సందర్భంగా దేశ రక్షణలో అహర్నిశలు శ్రమిస్తున్న వీర జవాన్లకు, మాజీ సైనికులకు, వారి కుటుంబసభ్యులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ  శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడటంలో భారత సైన్యం పోషిస్తున్న పాత్ర అనిర్వచనీయమని వారు కొనియాడారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందించిన రాష్ట్రపతి ముర్ము.. భారత సైనికులు కేవలం సరిహద్దుల వద్ద కాపలా కాయడమే కాకుండా, ప్రకృతి విపత్తులు, మానవీయ సంక్షోభాల సమయంలోనూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని ప్రశంసించారు. 'నేషన్ ఫస్ట్'  అనే వారి నినాదం, అంకితభావం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని ఆమె పేర్కొన్నారు.



మరోవైపు, భారత సైన్యం ధైర్యసాహసాలకు, దృఢ సంకల్పానికి దేశం గర్విస్తున్నదని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం నిస్వార్థ సేవలను అందిస్తూ, భారత సైన్యం దేశ భద్రతకు ఒక చిహ్నంగా నిలిచిందని ఆయన ప్రశంసించారు. సైనికుల విధి నిర్వహణ పట్ల దేశవ్యాప్తంగా అపారమైన నమ్మకం, కృతజ్ఞతా భావం ఉందని ప్రధాని పేర్కొన్నారు. ఇదే తరుణంలో దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ల త్యాగాలను ఆయన స్మరించుకున్నారు. 1949లో భారత సైన్యం పూర్తిస్థాయిలో స్వదేశీ నాయకత్వంలోకి వచ్చిన చరిత్రాత్మక రోజును గుర్తు చేసుకుంటూ, సైనిక దళాల ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

No comments:

Post a Comment

Featured post

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

  న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...