- యువతే దేశ భవిష్యత్తుకు నిర్మాతలు
- ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక ప్రసంగం
న్యూఢిల్లీ: డిజిటల్ ఇండియా, స్టార్టప్‌ల వృద్ధి, యువత క్రియాశీల భాగస్వామ్యం కలిసి భారతదేశ భవిష్యత్తును సరికొత్తగా తీర్చిదిద్దుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. న్యూఢిల్లీలో జరిగిన 'విక్షిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026' ముగింపు సదస్సులో ప్రసంగించిన ఆయన, యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తల శక్తితో దేశం సాంకేతిక, సృజనాత్మక రంగాల్లో వేగంగా దూసుకుపోతున్నదని పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా వేదికగా ఒక కొత్త సృజనాత్మక వర్గం పుట్టుకొచ్చిందని, ఇది సంస్కృతి, కంటెంట్. క్రియేటివిటీ కలబోతగా ఉన్న 'ఆరెంజ్ ఎకానమీ' (Orange Economy) వృద్ధికి ఊతమిస్తున్నదని ఆయన వివరించారు. 2047 నాటికి భారతదేశం వందేళ్ల స్వాతంత్య్ర వేడుకలు జరుపుకునే సమయానికి, నేటి యువత సామర్థ్యమే దేశ బలాన్ని నిర్ణయిస్తుందని, వారి విజయాలే భారత్‌ను ప్రపంచ శిఖరాగ్రానికి చేరుస్తాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
యువ నాయకుల ఈ చర్చా వేదిక అతి తక్కువ కాలంలోనే ఒక శక్తివంతమైన 'థింక్ ట్యాంక్'గా మారిందని, భారత దేశపు జెన్-జీ (Gen Z) యువతలోని అపారమైన సృజనాత్మకతకు ఇది నిదర్శనమని మోడీ కొనియాడారు. గతంలో కేవలం ప్రభుత్వ నియంత్రణలో ఉన్న రంగాలను ప్రైవేట్ భాగస్వామ్యానికి తెరవడంతో పాటు స్టార్టప్ ఇండియా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పన్నుల సరళీకరణ వంటి సంస్కరణలు దేశంలో స్టార్టప్ విప్లవాన్ని వేగవంతం చేశాయని ఆయన చెప్పారు. ముఖ్యంగా రక్షణ రంగంలో నేడు వెయ్యికి పైగా స్టార్టప్‌లు పనిచేస్తున్నాయని, డ్రోన్లు, ఏఐ కెమెరాలు, రోబోటిక్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలపై యువత అద్భుతమైన పరిశోధనలు చేస్తున్నదని ప్రశంసించారు. భారతదేశ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ ఏ స్థాయిలో విస్తరిస్తుందో చెప్పడానికి ఇవే నిదర్శనమని ఆయన అన్నారు.
అంతరిక్ష రంగంలో చోటుచేసుకున్న భారీ మార్పుల గురించి కూడా ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఐదు ఆరేళ్ల కిందటి వరకు అంతరిక్ష బాధ్యతలన్నీ కేవలం ఇస్రో (ISRO)పైనే ఉండేవని, కానీ తమ ప్రభుత్వం ఈ రంగాన్ని ప్రైవేట్ సంస్థలకు అందుబాటులోకి తెచ్చి, సరైన విధానాలు, సంస్థలను సృష్టించిందని గుర్తుచేశారు. స్వామి వివేకానందుడి జీవితం యువతకు గొప్ప మార్గదర్శి అని, ఆయన ఆశయాలతో దేశం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. జనవరి 9 నుంచి 12 వరకు జరిగిన ఈ 'విక్షిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్'లో దేశవ్యాప్తంగా సుమారు 50 లక్షల మందికి పైగా యువత వివిధస్థాయిల్లో పాల్గొని తమ గళాన్ని వినిపించారు.
No comments:
Post a Comment