- ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్
న్యూఢిల్లీ: విద్య అనేది కేవలం జ్ఞానార్జనకే పరిమితం కాకుండా, సమాజంలోని అసమానతలను తగ్గించడానికి, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి, దేశంలోని ప్రతి మూలకు అభివృద్ధిని చేరవేయడానికి ఒక సాధనంగా ఉపయోగపడాలని ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) 9వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్య కేవలం వ్యక్తిత్వాన్ని మలచడమే కాకుండా, మనస్సును దృఢపరిచి మేధస్సును విస్తరింపజేస్తుందని ఆయన పేర్కొన్నారు. దేశ ఆర్థిక, సామాజిక , శాస్త్రీయ పురోభివృద్ధి కోసం విద్యార్థులు అంకితభావంతో కృషి చేయాలని ఆయన కోరారు.
2047 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా (వికసిత్ భారత్) తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని చేరుకోవడంలో యువతకు సరైన శిక్షణ, విద్య ఎంతో అవసరమని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. మన ప్రాచీన సంప్రదాయ విలువలూ, ఆధునిక పోకడలూ సమన్వయంతో సాగాలని, భారతదేశ చరిత్ర ఎప్పుడూ జ్ఞాన అన్వేషణకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని ఆయన చెప్పారు. పరిపాలనాపరమైన నిర్ణయాలు సాఫీగా అమలు కావాలంటే సహకార ధోరణిని అలవర్చుకోవాలని సూచించారు. భారతీయ భాషల కోసం జేఎన్‌యూ ప్రత్యేక అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. జేఎన్‌యూ పూర్వ విద్యార్థులు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. మానవీయ శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలు, భాషలతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల్లో కూడా జేఎన్‌యూ అగ్రగామిగా ఉందని ఆయన ప్రశంసించారు. జేఎన్‌యూ ఎప్పుడూ కాలం కంటే ముందుంటుందని, జాతీయ విద్యా విధానం (NEP) 2020 లోని అనేక సూత్రాలను ఈ విశ్వవిద్యాలయం అది అధికారికంగా అమలులోకి రాకముందే అనుసరించడం విశేషమని ఆయన పేర్కొన్నారు.
No comments:
Post a Comment