- ఆత్మనిర్భర్ భారత్‌కు కర్షకులే ఊపిరి
- ఢిల్లీ పొంగల్ వేడుకల్లో ప్రధాని మోడీ ప్రశంసల జల్లు
న్యూఢిల్లీ: దేశ నిర్మాణంలో రైతులు అత్యంత కీలకమైన భాగస్వాములని, వారి నిరంతర శ్రమ 'ఆత్మనిర్భర్ భారత్' (స్వయం సమృద్ధి భారత్) ప్రచారాన్ని బలోపేతం చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొనియాడారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన ప్రసంగించారు. రైతులకు సాధికారత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగా నిరంతరం కృషి చేస్తున్నదని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రకృతి, కుటుంబం. సమాజం మధ్య సమతుల్యతను ఎలా కాపాడుకోవాలో పొంగల్ పండుగ మనకు దిశానిర్దేశం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. కేవలం తమిళ సంస్కృతికి మాత్రమే పరిమితం కాకుండా, పొంగల్ ఇప్పుడు ఒక ప్రపంచ పండుగగా మారిందని, ఇది దేశ రైతుల కష్టానికి ఇచ్చే గౌరవమని ప్రధాని అభివర్ణించారు.
ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్' స్ఫూర్తిని చాటుతుంది
భూమికి, సూర్యుడికి కృతజ్ఞతలు తెలుపుకునే ఈ పండుగ వేళ.. దేశంలోని ఇతర ప్రాంతాలలో లోహ్రి, మకర సంక్రాంతి, మాగ్ బీహు వంటి పండుగలు కూడా జరుపుకోవడం 'ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్' స్ఫూర్తిని చాటుతుందని మోడీ వెల్లడించారు. ప్రకృతి పట్ల కృతజ్ఞత అనేది కేవలం మాటలకే పరిమితం కాకూడదని, అది మన జీవన విధానంలో భాగం కావాలని ఆయన పిలుపునిచ్చారు. భూమి మనకు ఎన్నో వనరులను అందిస్తున్నదని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. భూసారాన్ని కాపాడటం, నీటి సంరక్షణ. వనరులను పొదుపుగా వాడటం వంటి అంశాలను భవిష్యత్తు తరాల కోసం దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మా కే నామ్, అమృత్ సరోవర్ వంటి కార్యక్రమాలు ఈ స్ఫూర్తిని ప్రోత్సహిస్తున్నాయని ఆయన వివరించారు.
తమిళ సంస్కృతి మానవాళికే ఒక గొప్ప ఆస్తి
తమిళ సంస్కృతి కేవలం మన దేశ వారసత్వమే కాదని, అది మొత్తం మానవాళికే ఒక గొప్ప ఆస్తి అని ప్రధాని ప్రశంసించారు. తమిళ సంస్కృతిలో రైతులను జీవనాధారంగా పరిగణిస్తారని, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, సజీవమైన నాగరికతలలో ఇది ఒకటని ఆయన కొనియాడారు. ఇది శతాబ్దాల చరిత్రను కలుపుతూ, గతం నుంచి పాఠాలు నేర్చుకుంటూ వర్తమానాన్ని భవిష్యత్తు వైపు నడిపిస్తుందని చెప్పారు. భారతదేశం తన మూలాల నుంచి శక్తిని పొందుతూ, కొత్త అవకాశాల వైపు దూసుకుపోతోందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
No comments:
Post a Comment