Wednesday, 14 January 2026

ఇరాన్‌కు చైనా బాసట


  • అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యంపై డ్రాగన్ ఆగ్రహం
  • టారిఫ్ యుద్ధాలతో ఎవరికీ లాభం లేదని హెచ్చరిక



బీజింగ్/న్యూయార్క్: అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా దూకుడుపై చైనా మరోసారి తీవ్రస్థాయిలో మండిపడింది. ఇరాన్ దేశ స్థిరత్వానికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన చైనా.. సార్వభౌమాధికారం కలిగిన దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేసింది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ బీజింగ్‌లో మాట్లాడుతూ.. అంతర్జాతీయ సంబంధాలలో బలప్రయోగం చేయడం లేదా సైనిక చర్యల పేరుతో బెదిరింపులకు దిగడం వంటి చర్యలను చైనా ఎప్పుడూ ఒప్పుకోదని వెల్లడించారు. ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న ఆంక్షలు, టారిఫ్‌ల (సుంకాల) అంశంపై స్పందిస్తూ.. ఇటువంటి 'సుంకాల యుద్ధాల్లో' ఎవరూ విజేతలుగా నిలవరని, తమ దేశ చట్టబద్ధమైన హక్కులు. ప్రయోజనాలను కాపాడుకోవడానికి చైనా కట్టుబడి ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.


  • ట్రంప్‌ వ్యాఖ్యలు ఇరాన్ జాతీయ భద్రతకు ముప్పు


మరోవైపు, అమెరికా తీరుపై ఇరాన్ ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) మెట్లు ఎక్కింది. ఇరాన్‌లో జరుగుతున్న నిరసనలను ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని, ఇది తమ దేశ సార్వభౌమాధికారానికి. భద్రతకు ముప్పు అని ఇరాన్ ఐరాస భద్రతా మండలికి ఫిర్యాదు చేసింది. అమెరికా బహిరంగంగా తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ, ప్రభుత్వ సంస్థలను ఆక్రమించుకోవాలనే కుట్రలకు బాహ్య మద్దతు ఇస్తున్నదని ఇరాన్ శాశ్వత ప్రతినిధి ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు చేస్తున్న వ్యాఖ్యలు కేవలం రాజకీయ ప్రకటనలు మాత్రమే కాదని, అవి ఇరాన్ జాతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పుగా పరిణమించాయని ఇరాన్ విదేశాంగ శాఖ వాదిస్తున్నది.


  • ఇరాన్. చైనా దేశాలు ఏకమవ్వడంతో ఉత్కంఠ

ఐరాస చార్టర్‌లోని నిబంధనల ప్రకారం ఏ దేశం కూడా మరో దేశంపై సైనిక చర్యల హెచ్చరికలు జారీ చేయడం లేదా అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టడం నిషిద్ధమని టెహ్రాన్ గుర్తు చేసింది. అంతర్జాతీయ చట్టాల ప్రాథమిక సూత్రాలను అమెరికా ఉల్లంఘిస్తున్నదని, దీనిపై ఐరాస సెక్రటరీ జనరల్ జోక్యం చేసుకోవాలని ఇరాన్ కోరింది. నిరసనకారులకు మద్దతుగా అమెరికా చేస్తున్న ప్రకటనలు తమ దేశాన్ని అస్థిరపరిచే వ్యూహంలో భాగమని ఇరాన్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, అగ్రరాజ్యం అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్. చైనా దేశాలు ఏకమవ్వడం ప్రపంచ రాజకీయాల్లో ఉత్కంఠను రేపుతున్నది.

No comments:

Post a Comment

Featured post

భారత్-చైనా బంధాల్లో ఊరట

అజిత్ దోవల్, వాంగ్ యీ కీలక భేటీ న్యూఢిల్లీ: భారతదేశం , చైనా దేశాల మధ్య గత నాలుగేళ్లకు పైగా తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన తూర్పు లడఖ్ సరిహద్దు వ...