- 4 కోట్ల రిజిస్ట్రేషన్లతో ప్రపంచరికార్డును దాటేసిన 'ఎగ్జామ్ వారియర్స్'
న్యూఢిల్లీ: విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే 'పరీక్షా పే చర్చ 2026' సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది ఈ కార్యక్రమం కోసం ఇప్పటివరకు 4 కోట్ల మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. గత ఏడాది నమోదైన 3.56 కోట్ల గిన్నిస్ వరల్డ్ రికార్డును ఈ సంఖ్య అధిగమించడం విశేషం. కేవలం ఒక వార్షిక సంభాషణలా ప్రారంభమైన ఈ కార్యక్రమం, నేడు విద్యార్థులకు ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పించే ఒక దేశవ్యాప్త ఉద్యమంగా మారిందని ఆయన కొనియాడారు.
పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో 'ఎగ్జామ్ వారియర్స్'గా పిలవబడే విద్యార్థులందరూ ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ అందించే అమూల్యమైన సలహాల ద్వారా ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, మానసిక ప్రశాంతతను ఎలా పెంపొందించుకోవాలో నేర్చుకోవాలని ఆయన సూచించారు. డిసెంబర్ 1, 2025న మైగవ్ (MyGov) పోర్టల్ ద్వారా ప్రారంభమైన ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా భారీ సంఖ్యలో భాగస్వాములయ్యారు. ఈ అపూర్వ స్పందనను బట్టి ఈ కార్యక్రమం పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ స్పష్టమవుతున్నదని విద్యా మంత్రిత్వ శాఖ పేర్కొంది.
స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ విభాగం ఏటా నిర్వహించే ఈ వేదిక ద్వారా విద్యార్థులు నేరుగా ప్రధానితో సంభాషించే అవకాశం లభిస్తుంది. విద్యాపరమైన ఒత్తిళ్లు, మానసిక ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసం వంటి కీలక అంశాలపై ప్రధాని ఇచ్చే సూచనలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. పరీక్షలంటే భయం కాకుండా ఒక ఉత్సవంలా జరుపుకోవాలనే సానుకూల దృక్పథాన్ని ఈ వేదిక ప్రోత్సహిస్తున్నది. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇంకా సమయం ఉన్నందున, మరింత మంది విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరుతున్నది.
No comments:
Post a Comment