- ఏఈఆర్ఓ రాజీనామాతో బెంగాల్ రాజకీయాల్లో కలకలం..
- ఈసీపై టీఎంసీ విమర్శల దాడి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ప్రక్రియలో జరుగుతున్న 'తార్కిక వైరుధ్యాలను' నిరసిస్తూ ఒక అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఏఈఆర్ఓ) తన పదవికి రాజీనామా చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ రాజీనామాను అస్త్రంగా చేసుకున్న అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC), కేంద్ర ఎన్నికల సంఘంపై విమర్శల దాడిని ముమ్మరం చేసింది. ఓటర్ల జాబితా నుంచి ఉద్దేశపూర్వకంగా అర్హులైన వారి పేర్లను తొలగిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత లోపించిందని, క్షేత్రస్థాయి అధికారులపై తీవ్ర ఒత్తిడి ఉందనే విషయాన్ని సదరు అధికారి రాజీనామా స్పష్టం చేస్తున్నదని టీఎంసీ పేర్కొంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఓటర్ల తొలగింపు ప్రక్రియ అశాస్త్రీయంగా సాగుతోందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే ఆరోపించారు. ఇప్పుడు స్వయంగా ఒక ఎన్నికల అధికారి తప్పులను ఎత్తిచూపుతూ తప్పుకోవడం తమ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నదని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే వివరణ ఇవ్వాలని, సవరణ ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు, ఈ రాజీనామా పరిణామాలపై ఎన్నికల సంఘం వర్గాలు ఆచితూచి స్పందిస్తున్నాయి. ఇది వ్యక్తిగత కారణాలతో జరిగిన రాజీనామానా లేక విధి నిర్వహణలో ఎదురైన సాంకేతిక ఇబ్బందుల వల్లనా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. అయితే, 2026 అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఓటర్ల జాబితా చుట్టూ ముసురుతున్న ఈ వివాదం బెంగాల్ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నది. బీజేపీ ఒత్తిడి మేరకే ఎన్నికల యంత్రాంగం పనిచేస్తోందన్న టీఎంసీ ఆరోపణలను కమలం పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. ఓటర్ల జాబితాలో అక్రమ చొరబాటుదారులను తొలగించడాన్ని టీఎంసీ తట్టుకోలేకపోతోందని వారు విమర్శిస్తున్నారు.
No comments:
Post a Comment