Thursday, 8 January 2026

ముందు సోనియా, రాహుల్‌లను తిట్టిన రేవంత్‌ను నిలదీయండి

  •  కాంగ్రెస్ విమర్శలపై కేటీఆర్ ధ్వజం

హైదరాబాద్: రాహుల్ గాంధీపై తాను చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా బదులిచ్చారు. గతంలో గాంధీ కుటుంబాన్ని నిత్యం దూషించిన రేవంత్ రెడ్డిని ముందు నిలదీయాలని ఆయన సవాల్ విసిరారు. గురువారం తెలంగాణ భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతల తీరును 'రాజకీయ కపటత్వం'గా అభివర్ణించారు. రాహుల్ గాంధీని 'ముద్దపప్పు' అని సంబోధించింది రేవంత్ రెడ్డి కాదా? అని ఆయన ప్రశ్నించారు.



సోనియా గాంధీని 'బలి దేవత' అని, వెయ్యి మంది పిల్లల ప్రాణాలు తీసిన వ్యక్తి అని గతంలో రేవంత్ రెడ్డి విమర్శించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. అప్పట్లో గాంధీ కుటుంబాన్ని అంతలా అవమానించిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసి, ఇప్పుడు తాము ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తుంటే ఉలిక్కిపడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. "మీకు నిజంగా రాజకీయ ధైర్యం ఉంటే, ముందు మీ ముఖ్యమంత్రిని ప్రశ్నించండి. రేవంత్ రెడ్డి వేధింపులకు భయపడి మాపై పడుతున్నారు" అని ఆయన విమర్శించారు. రాహుల్ గాంధీ అశోక్ నగర్‌లో ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని, వరంగల్ రైతు రుణమాఫీ ఎందుకు పూర్తి కాలేదని తాము ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు.


ఇదే సమయంలో హైదరాబాద్ అభివృద్ధిపై కూడా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో నగరంలో రూ. 9,700 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని, ఇప్పుడు 'హైడ్రా' పేరుతో పేదల ఇళ్లను కూలుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తోందని మండిపడ్డారు. త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీని వీడి వెళ్లిన వారు కేవలం తమ భూములను కాపాడుకోవడానికే రేవంత్ రెడ్డి పంచన చేరారని, కానీ ప్రజలు మాత్రం ఎప్పుడూ కేసీఆర్ వెంటే ఉంటారని ఆయన స్పష్టం చేశారు.

No comments:

Post a Comment

Featured post

ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్‌ కు అరుదైన గౌరవం

అకాడమీ ఆఫ్ అచీవ్‌మెంట్’ అవార్డు ప్రదానం ‘గోల్డెన్ ప్లేట్’ పురస్కారం అందుకున్న భారతీయ సంగీత మాంత్రికుడు కళలు, సైన్స్ రంగాల్లో విశేష కృషికి ఇచ...