Wednesday, 14 January 2026

పింక్ సిటీలో భారత సైన్యం పరాక్రమం


  • 78వ ఆర్మీ డే పరేడ్‌లో స్వదేశీ యుద్ధనౌకలు, డ్రోన్ల ప్రదర్శన
  • 'ఆత్మనిర్భర భారత్' దిశగా బలమైన అడుగు


జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరం భారత సైన్యం ధైర్యసాహసాలకు, సాంకేతిక పటిమకు వేదికైంది. 78వ సైనిక దినోత్సవం (Army Day) సందర్భంగా చారిత్రక నగరంలో నిర్వహించిన గ్రాండ్ పరేడ్ దేశం సాధించిన 'ఆత్మనిర్భరత'ను ప్రపంచానికి చాటిచెప్పింది. తొలిసారిగా కంటోన్మెంట్ ప్రాంతం వెలుపల, సాధారణ ప్రజల మధ్య జగత్‌పురాలోని మహల్ రోడ్డుపై ఈ పరేడ్ నిర్వహించడం విశేషం. సుమారు 1.5 లక్షల మంది వీక్షకుల మధ్య జరిగిన ఈ వేడుకలో భారత సైన్యం తన అత్యాధునిక సాంకేతిక సామర్థ్యాలను, స్వదేశీ ఆయుధ సంపత్తిని ప్రదర్శించింది.



ఈ పరేడ్‌లో ముఖ్యంగా 'ఆపరేషన్ సింధూర్'లో కీలకపాత్ర పోషించిన యుద్ధ సామగ్రి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టీ-90 భీష్మ ట్యాంకులు, బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థలు, ఎం-777 హోవిట్జర్లు, ధనుష్ ఆర్టిలరీ గన్‌లు భారత సైనిక బలాన్ని ప్రతిబింబించాయి. వీటితోపాటు భవిష్యత్తు యుద్ధతంత్రంలో కీలకమైన స్వదేశీ 'ఆకాష్‌తీర్' ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, రోబోటిక్ మ్యూల్స్ వంటి సాంకేతికతను మొదటిసారిగా బహిరంగంగా ప్రదర్శించారు. మనుషులు. యంత్రాల సమన్వయంతో సాగే ఆధునిక యుద్ధ నైపుణ్యాలను జవాన్లు ప్రదర్శించి వీక్షకులను మంత్రముగ్ధులను చేశారు.


ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ సమక్షంలో జరిగిన ఈ పరేడ్‌లో 30కి పైగా సైనిక విభాగాల కవాతు, ఆర్మీ ఏవియేషన్ హెలికాప్టర్ల ఫ్లై-పాస్ట్ పారాచూట్ విన్యాసాలు దేశభక్తిని ఉరకలెత్తించాయి. రక్షణ రంగంలో దిగుమతులపై ఆధారపడకుండా, స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆయుధాలను పెద్ద ఎత్తున ప్రదర్శించడం ద్వారా భారత్ తన రక్షణ స్వావలంబనను చాటుకుంది. సాయంత్రం ఎస్ఎంఎస్ స్టేడియంలో నిర్వహించనున్న 'శౌర్య సంధ్యా' వేడుకల్లో భాగంగా 1,000 డ్రోన్లతో నిర్వహించబోయే డ్రోన్ షో ఈ సంబరాలకు పరాకాష్టగా నిలవనుంది.

No comments:

Post a Comment

Featured post

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

  న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...