- ప్రజాస్వామ్యానికి సరికొత్త నిర్వచనం చెప్పిన భారత్
- కామన్వెల్త్ సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగం!
న్యూఢిల్లీ: భారతదేశం తన ప్రజాస్వామ్య వ్యవస్థలు, ప్రక్రియల ద్వారా ప్రపంచానికి ఒక సరికొత్త దిశానిర్దేశం చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటింగ్ మాత్రమే కాదని, అది స్థిరత్వం, వేగవంతమైన అభివృద్ధి, భారీస్థాయి మార్పులకు వేదిక అని భారత్ నిరూపించిందని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని సంవిధాన్ సదన్‌లో ప్రారంభమైన 28వ కామన్వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సును ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ.. భారత్ తన వైవిధ్యాన్ని బలహీనతగా కాకుండా ప్రజాస్వామ్య బలంగా మార్చుకుందని కొనియాడారు. మన దేశంలో ప్రజాస్వామ్యం అంటే 'చివరి వ్యక్తి వరకు ఫలాలు అందడం' అని, ఎటువంటి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తున్నదని ఆయన స్పష్టం చేశారు.
గత కొన్నేళ్లలో సుమారు 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడటం మన ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. భారతదేశంలో ప్రజలే సర్వోన్నతులని, వారి ఆకాంక్షలకే అత్యున్నత ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థికవ్యవస్థగా భారత్ అవతరించిందని, యూపీఐ రూపంలో ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ పేమెంట్ వ్యవస్థను కలిగి ఉన్నామని ఆయన గర్వంగా ప్రకటించారు. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తిదారుగా, రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా భారత్ సాధించిన ప్రగతిని ఆయన వివరించారు. గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న దేశాల) గొంతుకను భారత్ ప్రతి అంతర్జాతీయ వేదికపై బలంగా వినిపిస్తున్నదని, జీ20 అధ్యక్ష పదవి సమయంలోనూ ఆయా దేశాల ప్రాధాన్యాలను ప్రపంచ అజెండాలో కేంద్ర బిందువుగా ఉంచామని ప్రధాని గుర్తుచేశారు.
ఈ సందర్భంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సోషల్ మీడియా వల్ల ప్రజాస్వామ్య సంస్థల సామర్థ్యం పెరిగినప్పటికీ, వాటి దుర్వినియోగం వల్ల తప్పుడు సమాచారం, సైబర్ నేరాలు, సామాజిక విభజన వంటి తీవ్రమైన సవాళ్లు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని ఎదుర్కోవడానికి సామూహిక బాధ్యతతో పరిష్కారమార్గాలు అన్వేషించాలని ఆయన పిలుపునిచ్చారు. ఏడు దశాబ్దాల భారత పార్లమెంటరీ ప్రయాణంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా చట్టాలను రూపొందించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశామని ఆయన చెప్పారు. నిష్పాక్షికమైన ఎన్నికల వ్యవస్థ వల్ల ప్రతి పౌరుడు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామి అవుతున్నారని, ఇది భారతీయ ప్రజాస్వామ్యంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచిందని ఓం బిర్లా వివరించారు.
No comments:
Post a Comment