- ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్
మొహాలీ: చిన్న దుకాణదారులు, వ్యాపారులను రక్షించి, వారి వ్యాపార నిర్వహణను సులభతరం చేయనంత వరకు ఏ దేశం కూడా పురోగమించలేదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి మొహాలీలో జరిగిన 'పంజాబ్ రాష్ట్ర వ్యాపారుల కమిషన్' తొలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. వ్యాపారుల పట్ల ప్రభుత్వాలకున్న ప్రతికూల దృక్పథం మారాలని హితవు పలికారు.
"మన దేశంలో ఇప్పటి వరకు వ్యాపారులను దొంగల్లా చూసే సంస్కృతి కొనసాగుతోంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారిని కేవలం ఓట్ల కోసం, నిధుల వసూళ్ల కోసమే వాడుకున్నారు" అని కేజ్రీవాల్ విమర్శించారు. తాము ఏర్పాటు చేసిన ఈ కమిషన్ ద్వారా స్థానిక మార్కెట్లను అభివృద్ధి చేస్తామని, వ్యాపారులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో 'పన్ను ఉగ్రవాదం' నడుస్తోందని మండిపడ్డ పంజాబ్ మాజీ సీఎం, భవిష్యత్తులో కేంద్రంలో తమ ప్రభుత్వం వస్తే జీఎస్‌టీ (GST) నుం,ఇ వ్యాపారులకు విముక్తి కలిగిస్తానని ఆకాంక్షించారు.
తాను కూడా ఒక వ్యాపార కుటుంబం నుండి వచ్చానని, దుకాణదారుల కష్టనష్టాలు తనకు తెలుసని కేజ్రీవాల్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. చిన్ననాటి సెలవుల్లో తన బాబాయ్ కిరాణా కొట్టులో స్వయంగా కూర్చున్న రోజులను ఆయన నెమరువేసుకున్నారు. పెద్ద పెద్ద పెట్టుబడుల గురించి మాట్లాడే ప్రభుత్వాలు.. కిరాణా, బట్టలు, టైల్స్ వంటి చిన్న వ్యాపారాలు చేసుకునే వారిని విస్మరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత కాంగ్రెస్, అకాలీదళ్ ప్రభుత్వాలపై విమర్శలు చేస్తూ.. ప్రజల మధ్యకు వచ్చి నిజాయితీగా అభిప్రాయాలు అడిగే ధైర్యం ఆ పార్టీలకు లేదని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు.
No comments:
Post a Comment