- కాంగ్రెస్, ఎన్సీపీ, ఎంఐఎంలతో కూటమి ఏర్పాటు చేయడాన్ని తప్పుపట్టిన సంజయ్ రౌత్
మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారం కోసం బీజేపీ ఎంతటి దిగజారుడు రాజకీయాలకైనా పాల్పడుతుందని, ఆ పార్టీకి ఎటువంటి సిద్ధాంతాలు లేవని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా అంబర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్‌లో శివసేనను పక్కనపెట్టేందుకు బీజేపీ తన బద్ధశత్రువులైన కాంగ్రెస్, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో జతకట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. అలాగే అకోట్ మున్సిపల్ కౌన్సిల్‌లో ఎంఐఎం, ఇతర పార్టీలతో కలిసి బీజేపీ కూటమిని ఏర్పాటు చేయడాన్ని ప్రస్తావిస్తూ.. బీజేపీది 'ద్వంద్వ వైఖరి' కలిగిన పార్టీ అని రౌత్ విమర్శించారు.
60 సీట్లున్న అంబర్‌నాథ్ మున్సిపాలిటీలో శివసేన అత్యధికంగా 27 సీట్లు గెలుచుకున్నది. మెజారిటీకి అవసరమైన నాలుగు స్థానాలు దూరంలో నిలిచిపోయింది. బీజేపీ 14, కాంగ్రెస్, 12, అజిత్ పవార్ (ఎన్సీపీ) 4, మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. కాంగ్రెస్, అజిత్‌పవార్‌తో కలిసి కూటమిగా ఏర్పడాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది.
కేవలం అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ తన ప్రయోజనాల కోసం ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటుందని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. జాతీయస్థాయిలో "కాంగ్రెస్ ముక్త్ భారత్" అని నినాదాలు చేసే బీజేపీ, స్థానిక సంస్థల్లో మాత్రం అదే కాంగ్రెస్‌తో చేతులు కలపడం ఆ పార్టీ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని శివసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ విమర్శలపై స్పందించిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ లేదా ఎంఐఎంతో పొత్తులను తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. స్థానిక నాయకులు సొంతంగా తీసుకున్న ఇలాంటి నిర్ణయాలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని, ఆ పొత్తులను రద్దు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని ఆయన వెల్లడించారు.
No comments:
Post a Comment