Thursday, 8 January 2026

మందరిలో కలకలం : గుజరాత్‌లో భారీగా పులి చర్మాల స్వాధీనం


రాజ్‌పిప్లా (గుజరాత్): గుజరాత్ రాష్ట్రం నర్మదా జిల్లాలో భారీ ఎత్తున పులి చర్మాలు, గోళ్లు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. రాజ్‌పిప్లా ప్రాంతంలోని ప్రసిద్ధ ధర్మేశ్వర్ మహాదేవ్ ఆలయ సమీపంలో ఉన్న ఒక పాత భవనంలో సుమారు 40కి పైగా పులి చర్మాలు, 133 పులి గోళ్లను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పునరుద్ధరణ పనులు జరుగుతున్న ఈ ఆలయ ఆవరణలోని ఒక గది నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.



స్థానిక సమాచారం ప్రకారం.. ఆ పాత గదిలో గతంలో ఒక వృద్ధ పూజారి నివసించేవారు. సుమారు ఐదు నెలల కిందట ఆయన మరణించినప్పటి నుంచి ఆ గది మూసి ఉంది. అయితే, ఆలయ మరమ్మతు పనుల సమయంలో గది లోపల నుండి అసాధారణమైన వాసన రావడాన్ని గమనించిన ఆలయ ట్రస్టీలు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అటవీ శాఖ అధికారులు కలిసి అక్కడ తనిఖీలు చేయగా, పాత పెట్టెల్లో దాచి ఉంచిన 37 పూర్తి పులి చర్మాలు, కొన్ని చర్మం ముక్కలు, భారీ సంఖ్యలో గోళ్లు బయటపడ్డాయి.


స్వాధీనం చేసుకున్న ఈ వస్తువులు అసలైన పులి చర్మాలేనా లేక కృత్రిమమైనవా అని నిర్ధారించడానికి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL)కి పంపినట్లు రాజ్‌పిప్లా రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ జిగ్నేష్ సోనీ తెలిపారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు, చనిపోయిన పూజారికి వీటితో ఉన్న సంబంధం ఏమిటి? ఇంత పెద్ద మొత్తంలో వన్యప్రాణుల అవశేషాలు ఎక్కడి నుంచి వచ్చాయి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గుజరాత్‌లో పులుల ఉనికి తక్కువగా ఉన్న తరుణంలో ఇంత పెద్ద మొత్తంలో చర్మాలు లభించడం అటవీ అధికారులను విస్మయానికి గురిచేసింది.

No comments:

Post a Comment

Featured post

అయోధ్య నుంచి పోటీ చేయండి

యోగి ఆదిత్యనాథ్‌కు అఖిలేశ్‌ యాదవ్‌ సవాల్‌ త్వరలో రామ మందిరానికి ఎస్పీ నేతలతో కలిసి వెళ్తా: ఎస్పీ అధినేత  న్యూఢిల్లీ, అక్టోబర్‌ 8: ఉత్తరప్రదే...