Tuesday, 6 January 2026

తైవాన్‌పై దాడి విఫలమైతే చైనాకు లక్ష మంది సైనికుల ప్రాణనష్టం



  • తాజా నివేదిక హెచ్చరిక


తైపీ: తైవాన్‌పై సైనిక చర్యకు దిగాలని భావిస్తున్న చైనాకు అంతర్జాతీయ మేధోమథన సంస్థ (Think Tank) 'జర్మన్ మార్షల్ ఫండ్' (GMF) గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఒకవేళ చైనా గనుక తైవాన్‌పై పూర్తిస్థాయి దాడికి  దిగి అది విఫలమైతే, చైనా సుమారు 1,00,000 మంది సైనికులను కోల్పోవాల్సి వస్తుందని "ఇఫ్ చైనా అటాక్స్ తైవాన్"  అనే పేరుతో విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.


భారీ ప్రాణనష్టం

 చైనా సైన్యం తైవాన్‌పై దాడి చేస్తే కొన్ని నెలల పాటు సాగే భీకర యుద్ధంలో చైనాకు చెందిన లక్ష మంది జవాన్లు మరణించవచ్చని, చివరకు చైనా తన బలగాలను వెనక్కి పిలిపించుకోవాల్సి వస్తుందని నివేదిక అంచనా వేసింది. ఇదే సమయంలో తైవాన్‌కు కూడా 50,000 మంది సైనికులు, 50,000 మంది పౌరుల ప్రాణనష్టం జరుగుతుందని పేర్కొంది. ఈ యుద్ధంలో అమెరికా మరియు జపాన్ దళాలు జోక్యం చేసుకునే అవకాశం ఉందని, అమెరికాకు చెందిన 5,000 మంది, జపాన్‌కు చెందిన 1,000 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవచ్చని అంచనా.

ఆర్థిక సంక్షోభం

యుద్ధం కారణంగా చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని, విదేశీ పెట్టుబడులు పూర్తిగా తగ్గిపోయి లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతుందని నివేదిక హెచ్చరించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రాజకీయ పట్టు కూడా దీనివల్ల బలహీనపడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా ప్రధాన ద్వీపం నుంచి వెనక్కి తగ్గినప్పటికీ, తైవాన్ సమీపంలోని కిన్మెన్, మత్సు వంటి చిన్న దీవులను మాత్రం తన ఆధీనంలోనే ఉంచుకునే అవకాశం ఉందని ఈ అధ్యయనం పేర్కొంది.

No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...