- మాడ్వి హిడ్మాకు అత్యంత సన్నిహితుడు
- ప్రధాన దాడుల సూత్రధారి
- మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ
హైదరాబాద్/రాయ్‌పూర్: మావోయిస్టు పార్టీకి అత్యంత కీలకమైన 'బెటాలియన్ నంబర్ 1' ఇన్-ఛార్జ్, మోస్ట్ వాంటెడ్ కమాండర్ బర్సే దేవా అలియాస్ సాయినాథ్ శుక్రవారం తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. గత నెలలో ఎన్‌కౌంటర్‌లో మరణించిన అగ్రనేత మాడ్వి హిడ్మాకు దేవా అత్యంత సన్నిహితుడు.
పువర్తి గ్రామం నుంచి ప్రస్థానం
బర్సే దేవాపై ప్రభుత్వం సుమారు రూ. 25.47 లక్షల భారీ రివార్డును ప్రకటించింది. ఆయనతో పాటు మరో 15 నుంచి 17 మంది క్యాడర్ కూడా లొంగిపోయినట్లు సమాచారం. నవంబర్ 18న ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి అడవుల్లో హిడ్మా మరణించిన తర్వాత మావోయిస్టు సాయుధ విభాగమైన పీఎల్‌జీఏ కార్యకలాపాలను పర్యవేక్షించడంలో దేవా కీలక పాత్ర పోషించారు. దేవా, హిడ్మా ఇద్దరూ సుక్మా జిల్లాలోని పువర్తి గ్రామానికి చెందినవారు. దాదాపు 40 ఏళ్ల పాటు మావోయిస్టుల గుప్పిట్లో ఉన్న ఈ గ్రామంలో 2024 ఫిబ్రవరిలో భద్రతా దళాలు క్యాంపును ఏర్పాటు చేశాయి. 2013లో 27 మందిని బలితీసుకున్న దర్భా ఘాటి దాడి, 2021లో 22 మంది భద్రతా సిబ్బంది వీరమరణం పొందిన సుక్మా-బీజాపూర్ ఎన్‌కౌంటర్ వంటి ప్రధాన ఘటనల ప్రణాళికలో దేవా కీలక పాత్ర పోషించారు.
కుప్పకూలుతున్న సాయుధ విభాగం?
దేవా లొంగుబాటు సమయంలో ఆయన వద్ద నుంచి ఒక లైట్ మిషన్ గన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకప్పుడు 10 వేల నుంచి 12 వేల మంది క్యాడర్‌తో, 8 బెటాలియన్లతో బలంగా ఉన్న పీఎల్‌జీఏ, ఇప్పుడు దేవా లొంగుబాటుతో పూర్తిగా బలహీనపడిందని భద్రతా దళాలు భావిస్తున్నాయి. మావోయిస్టు పార్టీ టాప్ స్ట్రాటజిక్ త్రయంలో ఒకరైన దేవా లొంగుబాటు, ఆ సంస్థ సైనిక వెన్నుముకను విరిచినట్లయిందని నిఘా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. బెటాలియన్‌లోని మరికొందరు సభ్యులు కూడా త్వరలోనే లొంగిపోయే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
No comments:
Post a Comment