- 'స్వయంకృత అపరాధం'
- అమెరికా మాజీ ఎన్ఎస్‌ఏ జాన్ బోల్టన్
వాషింగ్టన్: భారతదేశం నుంచి వచ్చే దిగుమతులపై అదనపు సుంకాలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలపై ఆ దేశ మాజీ జాతీయ భద్రతా సలహాదారు (NSA) జాన్ బోల్టన్ తీవ్రంగా స్పందించారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఒక 'స్వయంకృత అపరాధం' అని, ఇది భారత్-అమెరికా సంబంధాల్లో నిజమైన ఇబ్బందులను సృష్టించిందని ఆయన విమర్శించారు. ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బోల్టన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అమెరికా ప్రయోజనాల విషయంలో ట్రంప్‌కు ఎటువంటి వ్యూహాత్మక అవగాహన లేదని బోల్టన్ ఎద్దేవా చేశారు. చైనా నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కోవడానికి భారత్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ వంటి దేశాలతో కలిసి పనిచేయాల్సింది పోయి, ముఖ్యమైన భాగస్వామి అయిన భారత్‌పై సుంకాలు విధించడం అర్థరహితమని ఆయన పేర్కొన్నారు.రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్నందుకే భారత్‌పై సుంకాలు పెంచుతున్నామని ట్రంప్ చెబుతున్నప్పటికీ, భారత్ కంటే ఎక్కువగా రష్యా చమురును కొంటున్న చైనాపై గానీ, టర్కీపై గానీ ఆయన సుంకాలు విధించకపోవడాన్ని బోల్టన్ ఎత్తిచూపారు.
ముప్పు చైనా నుండే
ప్రధాని నరేంద్ర మోడీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహం ద్వారానే ఈ సంక్షోభాన్ని పరిష్కరించుకోవచ్చని బోల్టన్ ఆశాభావం వ్యక్తం చేశారు. వీరిద్దరూ నేరుగా మాట్లాడుకుని ఈ వివాదానికి ముగింపు పలకాలని ఆయన సూచించారు. 21వ శతాబ్దంలో అమెరికాకు అసలైన ముప్పు చైనా నుండే ఉందని, దక్షిణ చైనా సముద్రం, భారత్ సరిహద్దుల్లో (LAC) చైనా బలగాల మోహరింపును అడ్డుకోవడానికి భారత్-అమెరికా భాగస్వామ్యం ఎంతో కీలకమని బోల్టన్ వివరించారు.
ఇటీవల ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ట్రంప్ మాట్లాడుతూ.. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపకపోతే సుంకాలు మరింత పెంచుతామని హెచ్చరించారు. "మోడీ మంచి వ్యక్తి, నా అసంతృప్తి గురించి ఆయనకు తెలుసు, నన్ను సంతోషపెట్టడం ఆయనకు ముఖ్యం" అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయస్థాయిలో చర్చకు దారితీశాయి. ప్రస్తుతం భారత్ నుంచి అమెరికాకు వెళ్లే కొన్ని వస్తువులపై 50 శాతం వరకు సుంకాలు ఉన్నాయి.
No comments:
Post a Comment