Friday, 20 November 2026

మోదీ వ్యాఖ్యలపై రాహుల్‌ గాంధీ కౌంటర్‌



  • పారిశ్రామికవేత్తలపై ఆరోపణలు కాదు, మీ అంగీకారమే

భారత పారిశ్రామిక సంస్థలు ఉద్యోగాల కల్పన, ఉద్యోగుల వేతనాల పెంపుపై తగిన చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఘాటుగా స్పందించారు. పారిశ్రామికవేత్తలపై ప్రధాని చేస్తున్న ఆరోపణలు నిజానికి ఆయన స్వయంగా చేసిన అంగీకారాలేనని విమర్శించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా స్పందించిన రాహుల్‌.. దేశంలోని విమానాశ్రయాలు, ఓడరేవులు, గనులు, అడవులు, విద్యుత్‌, బొగ్గు, రహదారులు వంటి కీలక రంగాలు కొందరి చేతుల్లోకి వెళ్లాయని ఆరోపించారు.


‘‘నిన్న మోదీజీ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి.. పన్నులు తగ్గించినా మీరు ఉద్యోగుల వేతనాలు పెంచలేదు, కొత్త ఉద్యోగాలు కల్పించలేదు అని ఎద్దేవా చేశారు. ఇవి వారిపై చేస్తున్న ఆరోపణలు కావు. నిజానికి మీరే చేసిన అంగీకారాలు’’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు.


‘‘వారు ఎంతగా ఆకలితో ఉన్నారంటే తమ కడుపు కూడా నింపుకోలేకపోతున్నారని మీరు అన్నారు. బాగా చెప్పారు. ఆ ఆకలి ఎవరిదో దేశం మొత్తానికి తెలుసు. విమానాశ్రయాలు, ఓడరేవులు, గనులు, అడవులు, విద్యుత్‌, బొగ్గు, రహదారులు.. అన్నీ కొందరికే అప్పగించారు. మరి వారు ఎన్ని ఉద్యోగాలు కల్పించారు?’’ అని ప్రశ్నించారు.


ఉద్యోగాలు కల్పించే చిన్న వ్యాపారులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్‌ఎంఈ) నోట్ల రద్దు, లోపభూయిష్టమైన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానాలతో దెబ్బతీశారని రాహుల్‌ ఆరోపించారు. నిజాయతీగా పోటీ పడే పెద్ద సంస్థలకు కూడా సమాన అవకాశాలు లేకుండా చేశారని విమర్శించారు. గుత్తాధిపత్యం వల్ల ఉద్యోగాలు సృష్టించబడవని, ధరలు పెరిగి పోటీ తగ్గిపోతుందని పేర్కొన్నారు.


‘‘మీరు పని చేయండి.. మేం చూస్తాం అంటున్నారు. కానీ మోదీజీ.. మీరూ, మీ స్నేహితులూ కలిసి చేసిన దోపిడీని దేశం చూసింది. ఇప్పటికీ చూస్తూనే ఉంది’’ అంటూ రాహుల్‌ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


  • మోదీపై జైరాం రమేశ్‌ విమర్శలు


మరోవైపు, ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు, పార్టీ కమ్యూనికేషన్స్‌ విభాగం అధిపతి జైరాం రమేశ్‌ కూడా స్పందించారు. ప్రధాని మోదీ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, ఆయన వ్యాఖ్యలు ఆందోళనను ప్రతిబింబిస్తున్నాయని మీడియాతో పేర్కొన్నారు.



No comments:

Post a Comment

Featured post

ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదు

పార్టీ అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యం: అశోక్‌ గెహ్లాట్‌ ఢిల్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నారంటూ వస్తున్న ఊహాగానాలను రాజస్థాన్‌ మాజీ ...