Monday, 14 September 2026

‘బీజేపీ అగ్రవర్ణ, శాకాహార పార్టీ’.. బ్రిక్స్‌ విందుపై కార్తి చిదంబరం విమర్శలు

 



  • భారత ఆహార వైవిధ్యాన్ని ప్రదర్శించాలంటే మాంసాహారం, సముద్ర ఆహారాన్నీ వడ్డించాలి 
  • శాకాహారం మాత్రమే పెట్టడం ఉద్దేశపూర్వకమే: కాంగ్రెస్‌ ఎంపీ

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 14:
బ్రిక్స్‌ సదస్సులో విదేశీ నేతలకు ఏర్పాటు చేసిన శాకాహార విందుపై కాంగ్రెస్‌ ఎంపీ కార్తి చిదంబరం తీవ్ర విమర్శలు చేశారు. భారత్‌ ఆతిథ్య సంప్రదాయాలను గౌరవిస్తూనే దేశంలోని పూర్తి సాంస్కృతిక, ఆహార వైవిధ్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉందన్నారు.

భారత్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు మాంసాహారం తీసుకుంటారని, అలాంటప్పుడు భారతీయ వంటకాల వైవిధ్యాన్ని చూపించేందుకు మాంసం, సముద్ర ఆహారాన్ని కూడా మెనూలో చేర్చాల్సిందని కార్తి చిదంబరం అన్నారు. శాకాహారం కోరుకునేవారికి ఆ ఎంపికను అందిస్తూనే ఇతర ఆహార సంప్రదాయాలకూ ప్రాతినిధ్యం కల్పించాల్సిందని పేర్కొన్నారు.

‘‘భారత్‌ను ప్రదర్శించేటప్పుడు ఒకే రకమైన సాంస్కృతిక విధానాన్ని మాత్రమే చూపించాల్సిన అవసరం లేదు. దేశంలోని అన్ని ప్రాంతాల ఆహార సంస్కృతులనూ ప్రతిబింబించాలి’’ అని ఆయన అన్నారు.

బీజేపీపై కూడా కార్తి చిదంబరం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘బీజేపీ అగ్రవర్ణ, హిందూ, శాకాహార, ఉత్తర భారత రాజకీయ పార్టీ. ఆ పార్టీ రాజకీయ విశ్వాసాల ప్రభావంతోనే దేశాన్ని ఒక నిర్దిష్ట సాంస్కృతిక రూపంలో చూపించే ప్రయత్నం జరుగుతోంది’’ అని ఆరోపించారు.

బ్రిక్స్‌ సదస్సు గాలా విందులో పూర్తిగా శాకాహార మెనూను ఏర్పాటు చేయడం ఉద్దేశపూర్వకంగానే జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. భారతీయ వంటకాల వైవిధ్యాన్ని ప్రపంచ నేతలకు పరిచయం చేయాలంటే మాంసాహార, సముద్ర ఆహార సంప్రదాయాలకూ చోటు కల్పించాల్సిందని స్పష్టం చేశారు.

బ్రిక్స్‌ సదస్సు విజయవంతం.. కానీ చైనాను నమ్మలేం: యశ్వంత్‌ సిన్హా

 



  • ఉమ్మడి ప్రకటన విడుదల కావడం కీలకం.. 
  • ఇరాన్‌ అధ్యక్షుడి చురుకైన భాగస్వామ్యం ముఖ్య పరిణామం
  • చైనాతో చర్చలు కొనసాగాలి.. అయితే విశ్వసించే పరిస్థితి లేదు

హజారీబాగ్‌, సెప్టెంబర్‌ 13:
2026 బ్రిక్స్‌ సదస్సు విజయవంతమైందని మాజీ కేంద్ర ఆర్థిక, విదేశాంగ మంత్రి యశ్వంత్‌ సిన్హా అన్నారు. ఆహ్వానించిన దేశాధినేతలంతా సదస్సుకు హాజరుకావడం, సమావేశం అనంతరం ఉమ్మడి ప్రకటన విడుదల కావడం ప్రధాన విజయాలని పేర్కొన్నారు. గత మేలో ఢిల్లీలో జరిగిన విదేశాంగ మంత్రుల సమావేశంలో విభేదాల కారణంగా ఉమ్మడి ప్రకటన వెలువడలేదని గుర్తుచేశారు. ఈసారి అధికారులు ఎంతో కృషి చేసి ఏకాభిప్రాయంతో ప్రకటనను రూపొందించారని చెప్పారు.

సదస్సులో అన్ని దేశాల నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరగడం కూడా ముఖ్య పరిణామమని సిన్హా అన్నారు. ముఖ్యంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ భేటీ ప్రాధాన్యమైందన్నారు. ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ హాజరై ఉమ్మడి ప్రకటన రూపకల్పనలో చురుకుగా పాల్గొనడం కీలకమని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో బ్రిక్స్‌ ప్రకటనలో గరిష్ఠ సంయమనం, చర్చలు-దౌత్యం ద్వారా సమస్యల పరిష్కారానికి పిలుపునివ్వడం జరిగింది.

ఇజ్రాయెల్‌ గాజా, లెబనాన్‌లో చేపడుతున్న చర్యలపై బ్రిక్స్‌ వైఖరి వ్యక్తం చేయడం సంతృప్తికరమని సిన్హా అన్నారు. ఈ పరిణామంతో పాలస్తీనా-ఇజ్రాయెల్‌ అంశంపై భారత్‌ తన గత వైఖరికి తిరిగి వచ్చినట్లుగా భావించవచ్చని వ్యాఖ్యానించారు.

అయితే చైనాను పూర్తిగా విశ్వసించలేమని సిన్హా స్పష్టం చేశారు. ‘‘చైనా ఎప్పటికప్పుడు భారత్‌కు ఇబ్బందులు సృష్టించింది. వెన్నుపోటు పొడిచింది. అందువల్ల చర్చలు కొనసాగాలి కానీ నమ్మకం పెట్టుకోవడానికి వీల్లేదు’’ అని అన్నారు. ద్వైపాక్షిక చర్చల్లో ఇరు దేశాలు తమ సమస్యలను గట్టిగా ప్రస్తావించాయని, కొంత ఉద్రిక్తత కూడా నెలకొని ఉండొచ్చని పేర్కొన్నారు.

జిన్‌పింగ్‌ గాలా విందుకు గైర్హాజరు కావడానికి ద్వైపాక్షిక చర్చలపై అసంతృప్తే కారణమై ఉండొచ్చన్న అభిప్రాయాలు ఉన్నాయని సిన్హా చెప్పారు. మొత్తంగా చూస్తే ఈ పరిస్థితిని ‘గ్లాస్‌ సగం నిండింది.. సగం ఖాళీగా ఉంది’ అన్నట్లుగా చూడవచ్చన్నారు.

బ్రిక్స్‌ అధ్యక్ష హోదాలో భారత్‌ తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించిందని సిన్హా ప్రశంసించారు. వివాదాస్పద అంశాలను అన్ని దేశాలూ ఆమోదించేలా సమన్వయంతో తీర్చిదిద్ది, ఏకాభిప్రాయానికి తీసుకురావడంలో భారత్‌ విజయవంతమైందని అన్నారు.

అజిత్‌కు రేస్ కారు బొమ్మ గిఫ్ట్‌ ఇచ్చిన విజయ్‌




  • లండన్‌ వేదికగా ఒక్కటైన కోలీవుడ్ దిగ్గజాలు.. 
  • అభిమానుల మధ్య వివాదాలకు చెక్ పెడుతూ ప్రత్యేక కానుకలు మార్పిడి


లండన్: తమిళ చిత్రసీమలో ఒకరికొకరు పోటీదారులుగా భావించే అగ్ర కథానాయకుడు అజిత్ కుమార్ (Ajith), తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, ముఖ్యమంత్రి విజయ్ (Vijay) లండన్ వేదికగా ఎంతో ఆప్యాయంగా కలుసుకున్నారు. 'సిల్వర్‌స్టోన్ సర్క్యూట్'లో జరిగిన 'మిచెలిన్ లే మాన్స్ కప్' రేసింగ్ టోర్నమెంట్‌లో పాల్గొన్న అజిత్‌కు మద్దతుగా విజయ్ అక్కడకు వెళ్లడం, మ్యాచ్ అనంతరం ఇద్దరూ ఎంతో ప్రేమగా కలుసుకోవడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రేసింగ్ ముగిసిన తర్వాత వీరిద్దరూ ఒకరికొకరు ప్రత్యేకమైన కానుకలను ఇచ్చిపుచ్చుకున్నారు. అజిత్‌కు విజయ్ ఒక చిన్న రేసింగ్ కారు బొమ్మను బహుమతిగా ఇవ్వగా, దానిపై "నా ప్రియమైన సోదరుడు అజిత్‌కు ప్రేమతో.." అని తన స్వహస్తాలతో ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చారు. ఇందుకు బదులుగా అజిత్ మోటార్ స్పోర్ట్స్ హెల్మెట్‌ను విజయ్‌కి బహుమతిగా అందజేశారు.


తమిళ సినీ పరిశ్రమలో విజయ్, అజిత్ అభిమానుల మధ్య దశాబ్దాలుగా తీవ్ర పోటీ, సోషల్ మీడియా యుద్ధాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ నవ్వుతూ ఆలింగనం చేసుకుని కానుకలు ఇచ్చిపుచ్చుకోవడంతో అభిమానుల మధ్య ఉన్న వైరి వర్గాల వార్తలకు పూర్తిగా చెక్ పడినట్లయింది. కాగా, లండన్ పర్యటనలో ఉన్న ప్రముఖ నటీమణులు త్రిష, రాధికా శరత్‌కుమార్ కూడా అజిత్‌ను కలిసి ఆయన రేసింగ్ ప్రదర్శనను అభినందించారు.

దిశా శాలియన్‌ మృతి కేసు.. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో ఆదిత్య ఠాక్రే, రియా చక్రవర్తి పేర్లు




  • బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ ముమ్మరం.. 
  • హత్య, సామూహిక అత్యాచారం, సాక్ష్యాల ధ్వంసం సెక్షన్ల కింద కేసు నమోదు


ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా శాలియన్ (Disha Salian) అనుమానాస్పద మృతి కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అధికారికంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్‌ఐఆర్‌లో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, శివసేన (యుబిటి) నాయకుడు ఆదిత్య ఠాక్రే, నటులు డినో మోరియా, సూరజ్ పంచోలి , రియా చక్రవర్తిల పేర్లను చేర్చినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. హత్య, సామూహిక అత్యాచారం, ఆధారాలను ధ్వంసం చేయడం వంటి తీవ్రమైన బిఎన్ఎస్/ఐపిసి సెక్షన్ల కింద ఈ ఎఫ్‌ఐఆర్ నమోదైంది. బాంబే హైకోర్టు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన రెండు వారాల వ్యవధిలోనే ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.


ఎఫ్‌ఐఆర్‌లోని సంచలన అంశాలు

ఈ ఘటన జరిగిన సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఉద్ధవ్ ఠాక్రే కేసును బయటకు రాకుండా చేసేందుకు ,ఆధారాలను కప్పిపుచ్చేందుకు తన అధికార పదవిని ఉపయోగించారని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఆనాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే కొందరు పోలీసులు, ప్రభుత్వ అధికారులు కేసు పత్రాలు, శవపరీక్ష నివేదికలు, ఇతర ప్రభుత్వ రికార్డులను ధ్వంసం చేశారని దర్యాప్తు సంస్థ తెలిపింది. ఈ కుట్రలో భాగస్వాములైన అధికారులందరూ సీబీఐ విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కేసులోని పూర్తి రికార్డులను తమకు వెంటనే అప్పగించాలని మహారాష్ట్ర పోలీసులకు సీబీఐ లేఖ రాసింది.


కేసు నేపథ్యం

దిశా శాలియన్ 2020 జూన్ 8న ముంబైలోని ఒక బహుళ అంతస్తుల భవనం నుంచి పడి అనుమానాస్పద స్థితిలో మరణించారు. అప్పట్లో ముంబై పోలీసులు దీనిని ఆత్మహత్యగా తేల్చారు. ఆ తర్వాత కొద్ది రోజులకే (జూన్ 14న) నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన ఫ్లాట్‌లో శవమై కనిపించడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇటీవల దిశ తండ్రి సతీశ్ శాలియన్ బాంబే హైకోర్టును ఆశ్రయించి, మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే, డినో మోరియా, సూరజ్ పంచోలిల ప్రమేయంపై ఆరోపణలు చేశారు. ప్రముఖుల ప్రభావం వల్లే స్థానిక పోలీసులు కేసును పక్కదారి పట్టించారని వాదించడంతో, న్యాయస్థానం నిజానిజాలు తేల్చేందుకు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది.

రూ.220 కోట్ల వసూళ్లతో.. వెండితెరపై ‘మీర్జాపూర్’ హవా



  • బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘మీర్జాపూర్: ది మూవీ’
  •  దేశీయంగా రూ.220 కోట్లు దాటిన గ్రాస్ వసూళ్లు

ముంబై: ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌పై డిజిటల్ సిరీస్‌గా సుదీర్ఘకాలం విశేషాదరణ పొందిన 'మీర్జాపూర్' ఫ్రాంచైజీ, ఇప్పుడు వెండితెరపై కూడా అదే స్థాయి విధ్వంసాన్ని సృష్టిస్తోంది. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మీర్జాపూర్: ది మూవీ’ థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. దేశీయంగా ఈ చిత్రం ఇప్పటికే రూ.220 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును అధిగమించింది.

ట్రేడ్ వర్గాల నివేదికల ప్రకారం.. భారతదేశంలో ఈ సినిమా రూ.220.10 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించగా, నెట్ కలెక్షన్లు రూ.184.79 కోట్లుగా నమోదయ్యాయి. సెప్టెంబర్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం తొలిరోజే రూ.20 కోట్లకు పైగా గ్రాస్ సాధించి శుభారంభం చేసింది. 2018లో ఓటీటీ సిరీస్‌గా ప్రారంభమై మూడు విజయవంతమైన సీజన్లతో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయి క్రేజ్ తెచ్చుకున్న ఈ ఫ్రాంచైజీ, ఫస్ట్ టైమ్ లార్జర్ ద్యాన్ లైఫ్ వెండితెర రూపంలో వచ్చి ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది.

ఈ చిత్రంలో 2018 కథా నేపథ్యానికి సంబంధించిన సరికొత్త కోణాన్ని దర్శకుడు గుర్మీత్ సింగ్ ఆవిష్కరించారు. పాత పాత్రల్లో రసిక దుగల్, శ్రియ పిల్‌గావ్కర్, శ్వేతా త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ నటించగా.. జితేంద్ర కుమార్, రవి కిషన్, సోనాల్ చౌహాన్ నయా క్యారెక్టర్లతో ఆకట్టుకున్నారు. ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్స్, అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ సంయుక్తంగా ఈ బిగ్ స్కేల్ యాక్షన్ డ్రామాను నిర్మించాయి.


ఈ విజయాలు.. భారత క్రీడారంగానికి గర్వకారణం



  •  ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ ప్రశంసలు

న్యూఢిల్లీ/అమరావతి: సెప్టెంబర్ 13 ఆదివారం భారత క్రీడారంగంలో స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుగా నిలిచింది. ఒకే రోజు ఇటు హాకీ, అటు క్రికెట్‌లో భారత జట్లు చారిత్రక విజయాలు సాధించడంతో దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. జూనియర్ ఆసియా కప్‌లో పురుషుల, మహిళల హాకీ జట్లు ఛాంపియన్లుగా నిలవగా, మహిళల క్రికెట్ జట్టు ఆసియా కప్‌ను ఎనిమిదోసారి కైవసం చేసుకుంది. ఇదే సమయంలో పురుషుల టీ20 సిరీస్‌లో అఫ్గానిస్థాన్‌పై భారత్ ఘనవిజయం సాధించింది. ఈ అద్భుత విజయాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీ హర్షం:

సోషల్ మీడియా వేదికగా భారత జట్లను అభినందించిన ప్రధాని మోదీ, "ఇది భారత క్రీడారంగం ఎంతో గర్వపడే క్షణం" అని పేర్కొన్నారు.

  • మహిళా క్రికెట్ జట్టుకు: "టోర్నీ ఆసాంతం అద్భుతమైన ఆత్మవిశ్వాసం, నిలకడ ప్రదర్శించి ఆసియా కప్‌ను సొంతం చేసుకున్న మహిళా జట్టుకు అభినందనలు. ఈ విజయం భవిష్యత్తులో లక్షలాది మంది యువతులు క్రికెట్ ఆడేందుకు స్ఫూర్తిగా నిలుస్తుంది" అని కొనియాడారు.

  • జూనియర్ హాకీ జట్లకు: "భారత హాకీ చరిత్రలో ఇదొక గొప్ప ఘట్టం. ఫైనల్లో దక్షిణ కొరియాను ఓడించిన పురుషుల జట్టుకు, చైనాను మట్టికరిపించి విజేతగా నిలిచిన మహిళల జట్టుకు హృదయపూర్వక అభినందనలు" అని మోదీ పోస్ట్ చేశారు.

పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు:

మహిళల ఆసియా కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. "అద్భుతమైన నైపుణ్యం, పోరాట పటిమను ప్రదర్శించి మహిళా లోకం మరియు దేశం గర్వించేలా చేశారు. మిమ్మల్ని చూసి భారత్ గర్విస్తోంది" అని ఆయన కొనియాడారు.

ఖైరతాబాద్‌లో కొలువుదీరిన బడా గణేశ్.. గవర్నర్‌ దంపతుల తొలిపూజ




హైదరాబాద్ (ఖైరతాబాద్): వినాయక చవితి పండగను పురస్కరించుకుని హైదరాబాద్ ఖైరతాబాద్‌లో 69 అడుగుల భారీ ఎత్తులో రూపుదిద్దుకున్న ‘పంచముఖ సంకటహర మహాగణపతి’ దర్శనమిస్తున్నాడు. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకి శుక్లా దంపతులు స్వామివారికి తొలి పూజ నిర్వహించారు.


మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, ఉత్సవ కమిటీ సభ్యులు గవర్నర్ దంపతులకు ఘన స్వాగతం పలికి మండపం వద్దకు తోడ్కొని వెళ్లారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య గవర్నర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, మంత్రి పొన్నం ప్రభాకర్ ఖైరతాబాద్ గణనాథుడికి పట్టువస్త్రాలు సమర్పించారు.



ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. స్వరాజ్య ఉద్యమ కాలంలో మహారాష్ట్రలో ప్రారంభమైన గణేష్ ఉత్సవాలకు, ఖైరతాబాద్ గణేశుడి విగ్రహానికి దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు లభించిందన్నారు. గత 72 ఏళ్లుగా ఇక్కడ ఏటా భిన్న రూపాల్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. గణపతి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.



పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వినాయకుడికి భారీ కండువా, యజ్ఞోపవీతం సమర్పించారు. బడా గణేశుడిని దర్శించుకునేందుకు నగర నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తుండటంతో ఖైరతాబాద్ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభతో సంతరించుకుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.

Featured post

కాంగ్రెస్‌ ‘మొహబ్బత్‌ దుకాణం’లో అవినీతి వ్యాపారమే: బాన్సురీ స్వరాజ్

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఎంపీ బాన్సురీ స్వరాజ్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ చెప్పుకునే ‘మొహబ్బత్‌ దుకాణం’...