Tuesday, 1 September 2026

నీ వల్ల కేసీఆర్ ఎంత మనోవేదనకు గురవుతున్నారో ఆలోచించావా?



కవితకు వేముల ప్రశాంత్‌రెడ్డి కౌంటర్‌


హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సొంత తండ్రి కేసీఆర్‌, సొంత అన్న కేటీఆర్‌ను విమర్శించిన కవిత.. తనను విమర్శించడం ఆశ్చర్యం కలిగించలేదని అన్నారు. “నీ వల్ల నీ తండ్రి కేసీఆర్‌ గారు ఎంత మనోవేదనకు గురవుతున్నారో ఒక్కసారి ఆలోచించావా కవిత?” అని ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. సొంత తండ్రి, సొంత అన్ననే విమర్శించినప్పుడు తనపై కవిత విమర్శలు చేయడం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదని పేర్కొన్నారు. కవిత రెండోసారి ఏకపక్షంగా ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంలో తన పాత్ర ఏమిటో కేసీఆర్‌కు తెలుసని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఈ విషయంలో వాస్తవాలు కేసీఆర్‌కు పూర్తిగా తెలుసని స్పష్టం చేశారు. కవిత వ్యాఖ్యలకు స్పందిస్తూ ప్రశాంత్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న అంతర్గత విభేదాల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి



  • లేకుంటే అసెంబ్లీని స్తంభింపజేస్తాం: హరీశ్‌రావు

హైదరాబాద్: తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థ అంటూ గొప్పలు చెప్పుకునే సీఎం రేవంత్‌రెడ్డి.. నెలలు గడుస్తున్నా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.

గత రెండున్నరేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని హరీశ్‌రావు తెలిపారు. అధ్యాపకులు, నాన్‌టీచింగ్ సిబ్బందికి నెలల తరబడి జీతాలు అందడం లేదని, కొన్ని కళాశాలల్లో 5 నుంచి 10 నెలల వరకు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. అద్దెలు, విద్యుత్ బిల్లులు, యూనివర్సిటీ ఫీజులు, ఇతర నిర్వహణ ఖర్చులు చెల్లించలేక కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు.

రాష్ట్రంలో ఒకప్పుడు సుమారు 960గా ఉన్న ప్రైవేట్ డిగ్రీ కళాశాలల సంఖ్య ఇప్పుడు దాదాపు 650కి తగ్గిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇప్పటికే సుమారు 310 కళాశాలలు తగ్గిపోయాయని, ఇదే పరిస్థితి కొనసాగితే మరిన్ని కళాశాలలు మూతపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీని ప్రభావం ప్రధానంగా గ్రామీణ తెలంగాణపై పడుతుందని తెలిపారు.

చిన్న పట్టణాలు, మండలాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ కళాశాలలు పరిమితంగా ఉన్నందున పేద, మధ్యతరగతి విద్యార్థులకు ప్రైవేట్ కళాశాలలే ఉన్నత విద్యకు ప్రధాన ఆధారంగా ఉన్నాయని హరీశ్‌రావు అన్నారు. ఒక కళాశాల మూతపడటం వల్ల ఆ ప్రాంతంలోని వందలాది, వేలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్య దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద, బలహీన వర్గాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉన్నత విద్యకు భరోసాగా నిలుస్తోందన్నారు.

తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చి వినతిపత్రం అందించారని హరీశ్‌రావు తెలిపారు. ప్రభుత్వం చెల్లించాల్సిన నిధులను ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచడం వల్ల ఆ భారం కళాశాలలు, అధ్యాపకులు, సిబ్బంది, చివరకు విద్యార్థులపై పడుతోందని అన్నారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో రూ.2,500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నప్పటికీ వాటిని చెల్లించి పథకాన్ని కొనసాగించామని హరీశ్‌రావు గుర్తుచేశారు. పెద్ద నోట్ల రద్దు, కరోనా వంటి సంక్షోభాలు వచ్చినప్పటికీ కేసీఆర్‌ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నిలిపివేయలేదన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో గత కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బకాయిలతో కలిపి రూ.19,500 కోట్లను ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద చెల్లించామని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు పాత బకాయిలను పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇచ్చిందని హరీశ్‌రావు అన్నారు. మూడు బడ్జెట్లు పూర్తయినా దాదాపు రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు.

వైఎస్‌ఆర్‌ ప్రారంభించిన పథకం అంటూ గొప్పలు చెప్పుకోవడం కాకుండా దాన్ని సక్రమంగా అమలు చేసే బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఇది కేవలం ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల సమస్య కాదని, విద్యార్థుల భవిష్యత్తు, అధ్యాపకులు, సిబ్బంది జీవనోపాధికి సంబంధించిన అంశమని అన్నారు.

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే పూర్తిగా విడుదల చేయాలని, భవిష్యత్తులో బకాయిలు పేరుకుపోకుండా ప్రతి విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నిర్ణీత గడువులో విడుదల చేసే శాశ్వత విధానాన్ని అమలు చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. బకాయిలను విడుదల చేయకపోతే ఈ అంశంపై అసెంబ్లీని స్తంభింపజేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి.. లేకపోతే తీవ్ర ఉద్యమం

 


  • ఉద్యోగ సంఘాల హెచ్చరిక

హైదరాబాద్: ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సచివాలయం మీడియా పాయింట్ వద్ద ఉద్యోగ సంఘాల సమావేశం నిర్వహించి, పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, డీఏలు, పదోన్నతులు, హెల్త్ కార్డులు, ఓపీఎస్ సహా పలు సమస్యలపై ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.

సెక్రటేరియట్ అసోసియేషన్ అధ్యక్షుడు గిరి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పీఆర్సీ లేకుండా మూడేళ్లు గడిచిపోయినా ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదన్నారు. మే 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాలతో సమావేశమై సమస్యలపై సానుకూలంగా స్పందించినప్పటికీ, ఆ సమావేశానికి నాలుగు నెలలు గడుస్తున్నా ఎలాంటి పురోగతి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది నుంచి ఉద్యోగులకు పదోన్నతులు కూడా కల్పించడం లేదని, హెల్త్ కార్డులు లేక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఓపీఎస్‌ తీసుకొస్తామని ఇచ్చిన హామీని కూడా నెరవేర్చలేదని గిరి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆరు డీఏలు బకాయిలుగా ఉన్నాయని, ప్రతినెలా జీతం చెల్లించడం మాత్రమే ప్రభుత్వ బాధ్యత కాదని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన మిగిలిన హామీలను కూడా అమలు చేయాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులు తమ ప్రయోజనాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.

సచివాలయ ఉద్యోగులు తీవ్ర పని ఒత్తిడితో పనిచేస్తున్నారని, కనీస వసతులు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా పరిష్కారం కావడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, నేటి ఆందోళన కేవలం ప్రారంభం మాత్రమేనని హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరింత తీవ్ర ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు.

ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష సరిగా లేదని, గత ముఖ్యమంత్రులు ఎవరూ ఉద్యోగులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసమే ఉద్యోగ సంఘాలు ఉద్యమాలు చేస్తున్నాయని తెలిపారు. తమ డిమాండ్లు గొంతెమ్మ కోరికలు కాదని స్పష్టం చేశారు.

టీజీఎస్ఏ జనరల్ సెక్రెటరీ ప్రేమ్ దేవేందర్ మాట్లాడుతూ.. ఉద్యోగులు ప్రభుత్వాన్ని భయపెడుతున్నారంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు సరికావని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే భవిష్యత్తులో తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు. హామీలు నెరవేర్చకుండా తాత్సారం చేయడం సరికాదన్నారు. డీఏల బకాయిల విషయంలో ప్రభుత్వం రికార్డు సృష్టించిందని విమర్శించారు.

ఉద్యోగులు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని ప్రేమ్ దేవేందర్ అన్నారు. ఆర్థిక శాఖ కార్యదర్శి వ్యవహార శైలి సరిగా లేదని, పదోన్నతుల విషయంలోనూ మొండి వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. ప్రమోషన్లు రాకుండా ఉన్నతాధికారులు అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఇళ్ల కేటాయింపు కూడా చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని పెండింగ్‌లో ఉన్న హామీలను అమలు చేయాలని సంఘాల నేతలు కోరారు.

తెలంగాణ యువతలో బీజేపీపై తగ్గిన ఆదరణ

 


  • గ్రేటర్‌లోనూ గ్రాఫ్ డౌన్: చాణక్య స్ట్రాటజీస్

తెలంగాణలో బీజేపీకి యువత నుంచి గతంతో పోలిస్తే మద్దతు తగ్గిందని చాణక్య స్ట్రాటజీస్ సర్వే పేర్కొంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ యువతలో బీజేపీ పట్ల ఆసక్తి, మద్దతు కనిపించిందని.. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో యువతలో ఆ పార్టీకి ఆదరణ తగ్గిపోయిందని తెలిపింది.

కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నిర్వహించిన సర్వేలో ప్రస్తుతం ఉన్న 11 మంది బీజేపీ కార్పొరేటర్లు కూడా ఓటమి పాలయ్యే పరిస్థితిలో ఉన్నట్లు తేలిందని చాణక్య స్ట్రాటజీస్ వెల్లడించింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో బీజేపీ గ్రాఫ్ 50 శాతానికి పైగా పడిపోయిందని పేర్కొంది.

తెలంగాణ యువతలో బీజేపీపై ఆశలు తగ్గిపోవడం, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీ ప్రభావం క్షీణించడం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉందని సర్వే అంచనాలు సూచిస్తున్నాయి.

కేసీఆర్‌పై రేవంత్‌ వ్యాఖ్యలు అసభ్యం

  • వెయ్యి రోజుల పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలి: కేపీ వివేకానంద

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి అసభ్యకరంగా మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మండిపడ్డారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రేవంత్‌రెడ్డి చిన్నపిల్లాడిలా ఉన్నారని వ్యాఖ్యానించారు. సీఎం అయిన తర్వాత రేవంత్‌రెడ్డికి అహంకారం పెరిగిపోయిందని విమర్శించారు.



తన పాలనపై రేవంత్‌రెడ్డికి నిజంగా నమ్మకం ఉంటే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయాలని కేపీ వివేకానంద డిమాండ్ చేశారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని కోరారు.

పొన్నం ప్రభాకర్, మహేశ్‌కుమార్ గౌడ్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలకు తానే భిక్షం వేసినట్లు పదవులు ఇచ్చానని రేవంత్‌రెడ్డి చెప్పుకోవడం సరికాదని ఆయన అన్నారు. వారంతా మొదటి నుంచీ కాంగ్రెస్‌లో కొనసాగుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసి నాయకులుగా ఎదిగినవారేనని పేర్కొన్నారు.

పదవులు తన జేబులో నుంచి ఇచ్చినట్లుగా రేవంత్‌రెడ్డి మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనమని కేపీ వివేకానంద విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పటివరకు స్పందించని కాంగ్రెస్‌ నాయకులు సిగ్గుతో తలదించుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఖమ్మం-నల్గొండ-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌దే విజయం- చాణక్య స్ట్రాటజీస్



హైదరాబాద్: ఖమ్మం-నల్గొండ-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి కచ్చితంగా విజయం సాధిస్తారని చాణక్య స్ట్రాటజీస్ వెల్లడించింది. తమ తాజా సర్వేలో బీఆర్ఎస్‌కు స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోందని తెలిపింది.

చాణక్య స్ట్రాటజీస్‌ సర్వే ప్రకారం.. వరంగల్ పరిధిలోని 12 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ క్లియర్ లీడ్‌లో ఉన్నట్లు పేర్కొంది.

అదేవిధంగా నల్గొండ జిల్లాలో సగం నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌కు స్పష్టమైన ఆధిక్యం ఉందని చాణక్య స్ట్రాటజీస్ తెలిపింది. మూడు జిల్లాల్లో పార్టీకి లభిస్తున్న ఆధిక్యతను పరిశీలిస్తే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి విజయం సాధించడం ఖాయమని సంస్థ అంచనా వేసింది.

బీఆర్ఎస్ పాలనకే ప్రజల మొగ్గు

  • 53 శాతం మంది మద్దతు: చాణక్య స్ట్రాటజీస్

హైదరాబాద్: తెలంగాణలో గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో ఇప్పటికీ సానుకూల అభిప్రాయం ఉందని చాణక్య స్ట్రాటజీస్ వెల్లడించింది. సంస్థ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. 53 శాతం మంది ప్రజలు గత బీఆర్ఎస్ పాలన బాగుందని అభిప్రాయపడగా, ప్రస్తుత కాంగ్రెస్ పాలన బాగుందని 36 శాతం మంది మాత్రమే పేర్కొన్నారు.యువతలోనూ బీఆర్ఎస్‌కు అనుకూలత ఉన్నట్లు సర్వే పేర్కొంది. దాదాపు 50 శాతం మంది యువత తిరిగి బీఆర్ఎస్ పాలన రావాలని కోరుకుంటున్నారని తెలిపింది.



కేసీఆర్‌పై వ్యతిరేకత వల్లే ఓటమి కాదు..

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం అప్పటి ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కాదని చాణక్య స్ట్రాటజీస్ విశ్లేషించింది. కొన్ని నియోజకవర్గాల్లో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను మార్చకపోవడమే బీఆర్ఎస్‌కు నష్టం కలిగించిందని పేర్కొంది.

అయితే, వ్యతిరేకత ఎదుర్కొన్న ఆ కొందరు మాజీ ఎమ్మెల్యేలే ఇప్పటికీ ఆయా నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌చార్జ్‌లుగా కొనసాగుతున్నారని తెలిపింది.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి.. బీఆర్ఎస్ అభ్యర్థులపైనా వ్యతిరేకత

ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ, అదే సమయంలో గతంలో వ్యతిరేకత ఎదుర్కొన్న బీఆర్ఎస్ నేతలపై కూడా ప్రజలకు సానుకూలత లేకపోవడంతో కొంతమంది ఓటర్లు తటస్థంగా ఉన్నారని చాణక్య స్ట్రాటజీస్ వెల్లడించింది.

బీఆర్ఎస్ నాయకత్వం ప్రజల్లో వ్యతిరేకత ఉన్న అభ్యర్థులను మార్చి కొత్త ముఖాలకు అవకాశం కల్పిస్తే.. ప్రస్తుతం తటస్థంగా ఉన్న యువత, ముఖ్యంగా జెన్‌జీ ఓటర్లు బీఆర్ఎస్‌కు మద్దతుగా మారే అవకాశం ఉందని సంస్థ విశ్లేషించింది.

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం కీలకమని చాణక్య స్ట్రాటజీస్ అభిప్రాయపడిం

Featured post

విలీనమా, విద్రోహమా, విమోచనమా?

సెప్టెంబర్‌ 17.. హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన  చారిత్రక రోజు. కానీ ఈ ఒక్క తేదీకి ఇప్పుడు అనేక పేర్లు.. అనేక రాజకీయ అర్థాలు. ...