Saturday, 18 April 2026

మాకు 66 శాతం ఓట్లు లేకపోవచ్చు


  • కానీ 100 శాతం మహిళల మద్దతు ఉంది
  • విపక్షాల తీరుపై ప్రధాని మోదీ ఆగ్రహం


మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం సాయంత్రం దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు తమ స్వార్థ రాజకీయాల కోసం మహిళల హక్కులను కాలరాశాయని ధ్వజమెత్తారు. "పార్లమెంటులో ఈ బిల్లును ఓడించినందుకు కాంగ్రెస్, డీఎంకే వంటి పార్టీల నేతలు చప్పట్లు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. వారు చప్పట్లు కొట్టింది బిల్లు వీగిపోయినందుకు కాదు, ఈ దేశ మహిళా శక్తికి దక్కాల్సిన గౌరవాన్ని అడ్డుకున్నందుకు. ఇది నారీశక్తి ఆత్మగౌరవంపై జరిగిన దాడి" అని మోదీ మండిపడ్డారు. బిల్లు ఆమోదానికి అవసరమైన 66 శాతం ఓట్లు తమకు సభలో లేకపోవచ్చు కానీ, దేశంలోని 100 శాతం మహిళా శక్తి తమ వెంటే ఉందన్న విషయం తనకు తెలుసని ఆయన ఉద్ఘాటించారు.



మహిళల పట్ల అన్యాయం చేసిన వారికి కాలమే శిక్ష విధిస్తుందని, ఈ 'పాపం' నుండి విపక్షాలు తప్పించుకోలేవని ప్రధాని హెచ్చరించారు. పార్లమెంటు హాల్‌లో మహిళల ఆశలను చిదిమేసి సంబరాలు చేసుకున్న నేతలను ఈ దేశ నారీ లోకం ఎప్పటికీ క్షమించదని, వారు తమ ఇళ్ల ముందుకు వచ్చినప్పుడు మహిళలు తప్పకుండా నిలదీస్తారని అన్నారు. మహిళా రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ పార్టీకి మొదటి నుండీ చిత్తశుద్ధి లేదని, గత 40 ఏళ్లుగా ఏదో ఒక సాకుతో అడ్డుకుంటూనే ఉందని ఆరోపించారు. ఈసారి కూడా నిజాయితీతో కూడిన ఒక పవిత్ర ప్రయత్నాన్ని విపక్షాలు 'భ్రూణహత్య' చేశాయని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 21వ శతాబ్దపు మహిళలు ప్రతి కదలికను గమనిస్తున్నారని, విపక్షాల అసలు రంగు ఇప్పుడు బయటపడిందని ఆయన పేర్కొన్నారు.


లోక్‌సభలో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ, మహిళా సాధికారత విషయంలో తమ ప్రభుత్వం వెనక్కి తగ్గబోదని ప్రధాని స్పష్టం చేశారు. 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి మహిళలకు సముచిత వాటా కల్పించాలనే సంకల్పంతో ఉన్నామని, దీనిపై భాగస్వామ్య పక్షాలతో చర్చిస్తున్నామని తెలిపారు. దేశంలోని సగం జనాభాకు సమాన భాగస్వామ్యం కల్పించడం ద్వారానే నవ భారత నిర్మాణం సాధ్యమవుతుందని మోదీ పునరుద్ఘాటించారు. విపక్షాల కుతంత్రాలు నారీశక్తి ప్రస్థానాన్ని ఆపలేవని, త్వరలోనే ఈ చారిత్రాత్మక బిల్లును మళ్లీ ముందుకు తీసుకెళ్లే మార్గాలను అన్వేషిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఎన్డీయేకు వేసే ఓటు తమిళనాడు ప్రగతికి గొడ్డలిపెట్టు



  • తిరుప్పూర్‌లో సీఎం ఎం.కె.స్టాలిన్ ఎన్నికల శంఖారావం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పతాకస్థాయికి చేరిన వేళ, ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ విపక్ష కూటమిపై విరుచుకుపడ్డారు. శనివారం తిరుప్పూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే (NDA) కూటమికి ఓటు వేస్తే అది రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమేనని హెచ్చరించారు. డీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం ఒక మైలురాయిగా నిలుస్తుందని, అయితే ఏఐఏడీఎంకే , బీజేపీ కలిసి ఈ ప్రాంత పారిశ్రామిక వృద్ధిని కుంటుపరిచాయని ఆయన ఆరోపించారు. ఎన్డీయేకు పడే ప్రతి ఓటు తమిళనాడు పురోగతికి అడ్డంకిగా మారుతుందని, ఈ వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలని ఆయన పిలుపునిచ్చారు.తమిళనాడులో అమలవుతున్న వినూత్న పథకాలను నేడు దేశమంతా అనుసరిస్తోందని, చివరకు కేంద్ర ప్రభుత్వం కూడా తమ కార్యక్రమాలను కాపీ కొట్టేందుకు ప్రయత్నిస్తోందని స్టాలిన్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు పరమావధి అని, తమిళనాడును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలంటే మళ్లీ డీఎంకేనే గెలవాలని ఆయన స్పష్టం చేశారు. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వేడిని పెంచాయి. తమిళనాడు ఆత్మగౌరవాన్ని, ఆర్థికవృద్ధిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఓటర్లపైనే ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

లెబనాన్‌లో ఐక్యరాజ్యసమితి శాంతి దళాలపై దాడి



  • భారత్ తీవ్ర దిగ్భ్రాంతి.. 
  • దోషులను కఠినంగా శిక్షించాలని విదేశీ వ్యవహారాల శాఖ విజ్ఞప్తి

న్యూఢిల్లీ:దక్షిణ లెబనాన్‌లో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంపై జరిగిన ఘోర దాడిని భారతదేశం శనివారం తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో విధి నిర్వహణలో ఉన్న ఒక ఫ్రెంచ్ సైనికుడు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర ఘటనపై స్పందించిన భారత విదేశీ వ్యవహారాల శాఖ, ప్రాణాలు కోల్పోయిన 'బ్లూ హెల్మెట్' సైనికుడికి ఘన నివాళులు అర్పించింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఐక్యరాజ్యసమితి శాంతి దళాల భద్రతను కాపాడవలసిన బాధ్యత అన్నివర్గాలపై ఉందని స్పష్టం చేసింది. శాంతి పరిరక్షకులపై జరిగే నేరాలకు బాధ్యత వహించేలా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానం 2589ను భారత్ ముందుండి నడిపించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది.లెబనాన్ ప్రభుత్వం ఈ ఘాతుకంపై తక్షణమే విచారణ చేపట్టి, బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని భారత్ కోరింది. ఐక్యరాజ్యసమితి ప్రాంగణాలు, సిబ్బంది  పవిత్రతను గౌరవించడం అత్యవసరమని, శాంతి కోసం పనిచేసే సైనికులకు రక్షణ కల్పించాలని అన్నిపక్షాలను విజ్ఞప్తి చేసింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం మోహరించిన శాంతి దళాలపై ఇటువంటి దాడులు జరగడం అత్యంత ఆందోళనకరమని, దీనికి జవాబుదారీతనం అవసరమని భారత్ తన ప్రకటనలో పునరుద్ఘాటించింది. 

Friday, 17 April 2026

హార్ముజ్ జలసంధి 'పూర్తిగా ఓపెన్'


  • కానీ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కొత్త కొర్రీలు!

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని వాణిజ్య నౌకల కోసం పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించినప్పటికీ, అక్కడి శక్తివంతమైన సైనిక విభాగం 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్' (IRGC) తాజాగా కొన్ని కఠిన నిబంధనలను తెరపైకి తెచ్చింది. లెబనాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి అనుగుణంగా ఈ జలసంధిని తెరిచినట్లు విదేశాంగ మంత్రి ప్రకటించగా, ఐఆర్జీసీ మాత్రం ఇది తమ పూర్తి నియంత్రణలోనే ఉంటుందని స్పష్టం చేస్తూ 'కొత్త నిబంధనలను' ప్రకటించింది. ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలు ఇరాన్ అంతర్గత విభేదాలను , గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న అనిశ్చితిని ప్రతిబింబిస్తున్నాయి.



ఐఆర్జీసీ విధించిన కొత్త నిబంధనల ప్రకారం, యుద్ధంలో పాల్గొనని దేశాల వాణిజ్య నౌకలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రతి నౌక తప్పనిసరిగా ఇరాన్ నిర్ణయించిన మార్గంలోనే ప్రయాణించాలని, ప్రయాణానికి ముందు ఇరాన్ నౌకాదళం నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆదేశించింది. అంతేకాకుండా, యుద్ధ నౌకలకు ఈ జలసంధి ద్వారా ప్రవేశం ఉండదని కరాకండిగా చెప్పేసింది. అరాగ్చీ చేసిన 'కంప్లీట్లీ ఓపెన్' ప్రకటనను ఐఆర్జీసీ , ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్ తప్పుబట్టారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని బట్టి మాత్రమే జలసంధి నిర్వహణ ఉంటుందని, సోషల్ మీడియా ప్రకటనలతో కాదని వారు స్పష్టం చేశారు.


మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పరిణామంపై స్పందిస్తూ, జలసంధి తెరుచుకోవడం శుభపరిణామమని పేర్కొన్నారు. అయితే ఇరాన్ పోర్టులపై అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనం మాత్రం 'పూర్తి స్థాయిలో' కొనసాగుతుందని, తమతో కుదిరే ఒప్పందం 100 శాతం పూర్తయ్యే వరకు ఇది ఉండనే ఉంటుందని స్పష్టం చేశారు. ఇరాన్  ఈ రెండు రకాల ప్రకటనలు , అమెరికా హెచ్చరికల మధ్య, అంతర్జాతీయ నౌకాయాన సంస్థలు ఈ మార్గంలో ప్రయాణించేందుకు ఇంకా ధైర్యం చేయడం లేదు. భద్రతా హామీలు స్పష్టంగా లేకపోవడంతో సరుకు రవాణా పునఃప్రారంభం కావడానికి మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది.

టీసీఎస్ మత మార్పిడి వ్యవహారం


  • నిందితురాలు నిదా ఖాన్ ఆచూకీ చెప్పిన భర్త
  • కానీ అక్కడికి వెళ్లిన పోలీసులకు షాక్!

నాసిక్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) బిపిఓ యూనిట్‌లో వెలుగుచూసిన లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడిల వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఈ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న టీసీఎస్ ఉద్యోగి నిదా ఖాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్న క్రమంలో, ముంబైలో ఉన్న ఆమె భర్త ఒక చిరునామాను పోలీసులకు అందించారు. అయితే పోలీసులు హుటాహుటిన ఆ ప్రాంతానికి వెళ్లగా, అక్కడ నిదా ఖాన్ కనిపించలేదు సగదా.. ఆ ఇల్లు తాళం వేసి ఉండటంతో దర్యాప్తు అధికారులకు చుక్కెదురైంది.



మరోవైపు నిదా ఖాన్ తరపు న్యాయవాదులు నాసిక్ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆమె ప్రస్తుతం గర్భవతి అని, ముంబైలోని తన ఇంట్లోనే ఉందని ఆమె కుటుంబసభ్యులు వాదిస్తున్నారు. పోలీసులకు భయపడి ఆమె ఎక్కడికీ పారిపోలేదని, దర్యాప్తుకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం ఆమెను ప్రధాన సూత్రధారిగా భావిస్తూ 'సిట్' (SIT) ద్వారా లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. కంపెనీలో మహిళా ఉద్యోగులను ట్రాప్ చేయడం, మత మార్పిడి కోసం ఒత్తిడి తేవడం వంటి తీవ్రమైన ఆరోపణలు ఆమెపై ఉన్నాయి.


ఈ వ్యవహారంపై టీసీఎస్ యాజమాన్యం కూడా కఠినంగా స్పందించింది. నిదా ఖాన్‌తో పాటు మరికొందరు నిందితులను ఇప్పటికే కంపెనీ నుండి సస్పెండ్ చేసింది. లైంగిక వేధింపుల ఫిర్యాదులను పట్టించుకోలేదన్న ఆరోపణలపై హెచ్‌ఆర్ విభాగానికి చెందిన కొందరిని కూడా విచారిస్తున్నారు. డెలాయిట్ వంటి బయటి సంస్థలతో ఆడిట్ చేయిస్తూ ఈ వ్యవహారంలో ఎంతమంది ప్రమేయం ఉందనే కోణంలో టీసీఎస్ అంతర్గత విచారణ జరుపుతోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న నిదా ఖాన్ దొరికితేనే ఈ మత మార్పిడి రాకెట్ వెనుక ఉన్న అసలు నిజాలు బయటపడే అవకాశం ఉంది.

ఒక్క గంటలో ఏడు అబద్ధాలా?

 

  • ట్రంప్ హెచ్చరికలపై విరుచుకుపడ్డ ఇరాన్
  • హార్ముజ్ జలసంధిపై కొనసాగుతున్న ఉత్కంఠ

హార్ముజ్ జలసంధి వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. జలసంధిని వాణిజ్య నౌకల కోసం తెరిచినట్లు ఇరాన్ ప్రకటించిన కొద్దిసేపటికే, తమతో ఒప్పందం కుదిరే వరకు నౌకాదళ దిగ్బంధం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఒకవేళ చర్చలు సఫలం కాకపోతే మళ్ళీ బాంబుల వర్షం కురిపిస్తామని ఆయన చేసిన హెచ్చరికలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బగేర్ గాలిబాఫ్ ఘాటుగా స్పందించారు. ట్రంప్ కేవలం ఒక గంట వ్యవధిలోనే ఏడు అసత్య ప్రకటనలు చేశారని, సోషల్ మీడియా పోస్టులు జలసంధి భవిష్యత్తును నిర్ణయించలేవని ఆయన ఎద్దేవా చేశారు. అమెరికా తన దిగ్బంధనాన్ని కొనసాగిస్తే, హార్ముజ్ జలసంధిని మూసివేస్తామని, ఇరాన్ అనుమతితోనే నౌకల రాకపోకలు సాగుతాయని గాలిబాఫ్ హెచ్చరించారు.



ఇరాన్ వద్ద ఉన్న  శుద్ధి చేసిన యురేనియంను (న్యూక్లియర్ డస్ట్) భారీ యంత్రాలతో వెలికితీసి అమెరికాకు తరలిస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. తమ యురేనియం నిల్వలను ఏ దేశానికీ తరలించే ప్రసక్తే లేదని, చర్చల్లో అసలు అటువంటి ప్రతిపాదనే రాలేదని టెహ్రాన్ స్పష్టం చేసింది. యుద్ధంలో అబద్ధాలతో గెలవలేకపోయిన అమెరికా, ఇప్పుడు చర్చల్లో కూడా అవే తప్పుడు ప్రచారాలతో లబ్ధి పొందాలని చూస్తోందని ఇరాన్ మండిపడింది. హార్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు జరుగుతున్న నేపథ్యంలో, దీనిని ఇరాన్ ఒక 'అణు నిరోధక ఆయుధం'లా వాడుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


మరోవైపు, ఇరాన్ జలసంధిని తెరిచినట్లు ప్రకటించినా, అంతర్జాతీయ వాణిజ్య నౌకలు అక్కడ ప్రయాణించేందుకు ఇంకా వెనుకాడుగు వేస్తున్నాయి. స్పష్టమైన భద్రతా హామీలు లభించే వరకు కార్యకలాపాలు పునఃప్రారంభించడం కష్టమని షిప్పింగ్ సంస్థలు భావిస్తున్నాయి. ఒకవైపు చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ చెబుతున్నా, మరోవైపు బాంబు దాడులు చేస్తామన్న ఆయన బెదిరింపులు గల్ఫ్ ప్రాంతంలో ఆందోళనను పెంచుతున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ దౌత్యపరమైన ఉద్రిక్తతలు ప్రపంచ చమురు ధరలపై , అంతర్జాతీయ భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.

Thursday, 16 April 2026

తెలంగాణ కుల గణన నివేదిక వెల్లడి


సగటు కంటే వెనుకబడిన 135 కులాలు

జనరల్ కేటగిరీ కంటే ఎస్సీ, ఎస్టీలు మూడు రెట్లు వెనుకబాటు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (SEEEPC) తుది విశ్లేషణ నివేదిక రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని స్వతంత్ర నిపుణుల బృందం (IEWG) ఈ సర్వే గణాంకాలను సమగ్రంగా విశ్లేషించి బుధవారం రాత్రి బహిరంగపరిచింది. ఈ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలోని మొత్తం 242 కులాల్లో 135 కులాలు రాష్ట్ర సగటు వెనుకబాటుతనం కంటే ఎక్కువ వెనుకబడి ఉన్నాయి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలు జనరల్ కేటగిరీ కులాల కంటే మూడు రెట్లు వెనుకబడి ఉండగా, బీసీలు 2.7 రెట్లు వెనుకబడి ఉన్నట్లు నిపుణుల బృందం నిర్ధారించింది. రాష్ట్రవ్యాప్తంగా వెనుకబాటుతనం సూచిక (CBI) సగటు స్కోరు 81గా నమోదు కాగా, ఈ 135 కులాల స్కోరు అంతకంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.



రాష్ట్ర జనాభా పరంగా చూస్తే, 36.57 లక్షల మందితో మాదిగ (ఎస్సీ) కులం అతిపెద్ద కులంగా అవతరించింది. ఆ తర్వాత స్థానాల్లో షేక్ ముస్లింలు (బీసీ-ఈ) 27.95 లక్షలు, ముదిరాజ్‌లు (బీసీ-డి) 26.39 లక్షలు, లంబాడీలు (ఎస్టీ) 24.04 లక్షలు, యాదవులు (బీసీ-డి) 20.18 లక్షలు, రెడ్డి (ఓసీ) 17.10 లక్షలు మరియు గౌడ (బీసీ-బీ) కులం 16.30 లక్షల మందితో మొదటి వరుసలో ఉన్నాయి. మొత్తం జనాభాలో 12 శాతం ఉన్న 18 అగ్రవర్ణ కులాలు రాష్ట్ర సగటు వెనుకబాటుతనం కంటే మెరుగైన స్థితిలో ఉండగా, సగటు కంటే వెనుకబడిన 135 కులాలు మొత్తం జనాభాలో 67 శాతంగా ఉన్నాయి. ఇందులో 69 బీసీ కులాలు, 41 ఎస్సీ కులాలు , 25 ఎస్టీ కులాలు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.


ప్రతి వెనుకబడిన కులం సమానంగా వెనుకబడి లేదన్నదే ఈ నివేదికలోని ప్రధాన సారాంశం. రాష్ట్ర సగటు కంటే తక్కువ వెనుకబాటుతనం ఉన్న 107 కులాలను కూడా నిపుణుల బృందం గుర్తించింది; ఇందులో 18 అగ్రవర్ణ కులాలతో పాటు 64 బీసీ, 18 ఎస్సీ మరియు 7 ఎస్టీ కులాలు ఉన్నాయి. ఈ 107 కులాలు మొత్తం జనాభాలో 29 శాతంగా ఉన్నాయి. కులాల వారీగా ఉన్న ఈ అసమానతలను గుర్తించడం ద్వారా ప్రభుత్వ పథకాల రూపకల్పన, రిజర్వేషన్ల వర్గీకరణలో ఈ నివేదిక అత్యంత కీలకం కానుంది. తెలంగాణ సామాజిక ముఖచిత్రాన్ని స్పష్టంగా ఆవిష్కరించిన ఈ గణాంకాలు రాబోయే రోజుల్లో రాష్ట్ర విధాన నిర్ణయాలపై లోతైన ప్రభావం చూపనున్నాయి.

Featured post

ప్రజాస్వామ్యానికి ఓటర్ల జాబితానే ప్రాణం

  పరిశుభ్రమైన, నవీకరించిన ఓటర్ల జాబితా అవసరమన్న శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ పరిశుభ్రమైన, ఎప్పటికప్పుడు నవీకరించబడిన ఓటర్ల జాబితా ప్రజాస్వామ్యాని...